ఏదైనా ఓ వస్తువును ఓ చర్యకు గురిచేస్తే, ఆ వస్తువు కూడా దానికి సమానమైన ప్రతిచర్యను కలిగిస్తుంది. ఇది ప్రఖ్యాత న్యూటన్ మూడవ సూత్రం. ఇక్కడ గమనించవలసిన విషయం, ఆ చర్య-ప్రతిచర్య అనేది కేవలం ఆ కర్త-గ్రహీత లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. A, Bపై చర్య చేస్తే, B ప్రతిచర్యను Aపైనే చూపిస్తుంది తప్ప, Cపై కాదు. ఒకవేళ అలా చేసిందంటే దానిని Cపై చర్యగా పరిగనించాలి తప్ప ప్రతిచర్యగా కాదు. ఇదీ స్థూలంగా చర్య ప్రతిచర్య సిద్ధాంతం. ఈ సూత్రం ప్రాణం లేని వస్తువుల గురించి ప్రతిపాదించబడింది. ఆధిపత్యం కోసం,మనుగడ కోసం ఒక జాతి మరోజాతిపై దాడులకు,ప్రతిదాడులకు దిగే ఆటవిక యుగంలో ఇది మనుషులకు కూడా వర్తించేదేమో కానీ, ప్రత్యేక చట్ట,న్యాయ వ్యవస్థల్ని కలిగిన ఏ ఆధునిక సమాజమూ దీనిని మనుషులకి వర్తింపచేయదు. ఎందుకంటే ఆధునిక సమాజంలో జరిగే ఎలాంటి చట్టవ్యతిరేక 'చర్య'కైనా, 'ప్రతిచర్య' చేసే బాధ్యత పోలీసు,న్యాయవ్యవస్థలకీ, ఇవి సక్రమంగా తమ విధుల్ని నిర్వర్తించేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికీ ఉంటాయి. కానీ, సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చర్య ప్రతిచర్యల్ని ప్రజలకి గుర్తుచేసి కొన్ని వేల మంది అమాయకుల ఊచకోతకు కారణమవ్వడం అనేది ఆధునిక భారత ప్రజాస్వామ్యంపై ఎన్నటికీ మాయని మచ్చ లాంటిది.
పదేల్ల క్రితం Feb27, 2002న జరిగిన గోధ్రా రైలు దహనం అనేది ముమ్మాటికీ ఓ హేయమైన చర్య. ఈ చర్యకు ప్రతిచర్య గా అక్కడి పోలీసు, న్యాయవ్యవస్థ నిందితులని గుర్తించి,విచారించి, నిందితులు ఎవరైనా, ఎందరైనా వారిని కఠినంగా శిక్షించవలసింది.కానీ దానికి విరుద్ధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బాధిత వర్గానికి చెందిన వారికి ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని తీర్మాణించేసి, దీనికి కావలసిన తోడ్పాటును అందించవలసిందిగా అక్కడి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారనేది ప్రధాన ఆరోపణ. ఇది ఇంకా న్యాయస్థానాల్లో నిరూపించబడనప్పటికీ, ఆ రైలు దహనం ఘటన అనంతరం గుజరాత్ మొత్తం మీద కొన్ని రోజుల పాటు యదేచ్చగా జరిగిన సామూహిక సజీవ దహనాలు, మానభంగాలు, హత్యలు, చివరికి గర్భినులని కూడా కిరాతకంగా చంపడం, ఓ మాజీ MPని కూడా అతని కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో బంధించి సజీవ దహనం చేయడం లాంటివి అక్కడ ఉన్నత స్థాయిలో జరిగిన కుట్రల్ని కల్లకు కట్టేవే. ఎక్కడో ఏదో ఓ సంఘటన జరిగిందని దానితో ఏ మాత్రం సంబంధంలేని అమాయకుల మీద జరిగిన ఈ దారుణాల్ని ప్రతిచర్యగా కాక,చర్యగా చూడాల్సి ఉంది. మరి ఈ చర్యకి ప్రతిచర్యని ఎవరు ఎలా చేయాలి? ఈ ప్రతిచర్యని చట్ట ప్రకారం విచారించి అమలు చేయవలసిన పోలీసు, న్యాయవ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా..? చర్య జరిగేటప్పుడు బాధితుల ఆక్రందనల్ని ఏమాత్రం ఖాతరు చేయని పాలకులు, ఇప్పుడు కనీసం న్యాయం పొందడంలోనైనా వారికి సహకరిస్తున్నారా..? అనేవి ఆలోచించాల్సిన ప్రశ్నలు. గుజరాత్ అల్లర్లలో సామూహిక జనహనన జరిగిన అనేక కేసుల్లో, సాక్షాత్తూ సుప్రీం కోర్టు కలగ జేసుకుని ఆఞాపించేవరకూ అక్కడి పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదనేది కాదనలేని కఠోర సత్యం. ఇక 14మందిని సజీవ దహనం చేసిన బెస్ట్ బేకరీ కేసు విచారణ జరిగిన తీరు గుజరాత్లోని పోలీసు వ్యవస్థ నిష్క్రియాపరత్వానికి పరాకాష్టగా నిలుస్తుంది. మొదట ఈ కేసును విచారించిన అక్కడి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాక్షాలు లేని కారణగా మొత్తం 23 మంది నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది.అనంతరం దేశ వ్యాప్తంగా ఈ తీర్పుపై పెల్లుబికిన నిరసనల్నిపరిగణించిన సుప్రీం కోర్టు, ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయగా,పునర్విచారణలో అదే నిందితుల్లోని 9 మందికి జీవిత ఖైదు విధించబడింది. ఇలాంటి కేసులు అనేకం గుజరాత్లోని వివిధ జైల్లలో, వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా నిజాలు వెల్లడించడానికి ముందుకు వచ్చిన సంజీవ్ భట్ లాంటి పోలీస్ ఆఫీసర్లను, సస్పెండ్ చేయడం, పాత కేసుల్ని తిరగతోడి జైలు పాలు చేయడం ద్వారా నిజాయితికి దక్కే నజరానా ఎంత కఠినంగా ఉంటుందో గుజరాత్ ప్రభుత్వం స్పష్టంగానే హెచ్చరిస్తోంది.
ఆర్థిక అభివృద్ధిని చూసి మోడీని క్షమించవచ్చా..?
మోడీని గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా, గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్న గొప్ప CMగా అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ లాంటి వారు కొనియాడుతుంటారు.పైగా గుజరాత్ మతకలహాలనేవి గోధ్రా రైలు దహణానికి 'ప్రతిచర్యగా' మాత్రమే జరిగాయనీ, వీటి ఆధారంగా మోడీని తప్పుపట్టలేమనీ కూడా చెబుతుంటారు. 2007లో CNN-IBN ఇంటర్వ్యూలో, 'గుజరాత్లో ముస్లింలపై జరిగిన అఘాయిత్యాలకి చింతిస్తున్నారా..?' అని విలేఖరి కరణ్ థాపర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని మోడీ ఆ ఇంటర్వ్యూని అర్థాంతరంగా ఆపేసి స్టూడియో నుండి వెల్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గుజరాత్లోని మతకలహాల బాధితులకి అతను ఏనాడూ కనీస సానుభూతిని కూడా చూపలేదని బహిరంగ సత్యం. ప్రజల్ని మతప్రతిపదికన విభజించి చూస్తూ, ఓ వర్గానికి న్యాయాన్ని, జీవించే హక్కును కాలరాస్తున్న ఓ వ్యక్తి, కొన్ని కోట్లరూపాయల పెట్టుబడుల్ని తీసుకురాగలిగినంత మాత్రాన గొప్పవాడు అయిపోతాడా..? గుజరాత్ ఘటనలకి చర్య-ప్రతిచర్య సిద్ధాంతాన్ని ఆపాదించి మోడీ నేరాన్ని, వైఫల్యాన్ని కప్పిఉంచడం, అక్కడి ఆర్థికాభివృద్ధిని చూపించి మోడీని జాతీయ నాయకునిగా నిలబెట్టడం వీరి తాపత్రయంగా కనిపిస్తుంది.
మరి గుజరాతీలు మోడీని ఎందుకు గెలిపిస్తున్నట్లు?
గుజరాత్ లో జరిగిన గొద్రా అనంతర మారణహోమాల్ని నివారించలేకపోవడంలోనూ,వీటికి కారకులైన నిందితుల్ని శిక్షించేలా అక్కడి పోలీసు,చట్ట వ్యవస్థల్ని సమాయత్తం చేయలేకపోవడంలోనూ గుజరాత్ ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీం కోర్టు అనేక సార్లు ఎండగట్టింది. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వ వైఖరి, దేశంలోని లౌకిక వాదులకు, ఇతర మైనారిటీలకు తీవ్ర అసంపృతిని కలిగిస్తూ, అక్కడి బాధితులపై సానుభూతిని కలిగిస్తున్నా , గుజరాతీలకు మాత్రం ఇదేమంత ప్రాధాన్యత ఉన్న అంశంలా అనిపించడంలేదు. 2002, మరియు 2007 అసెంబ్లీ ఎలెక్షన్లలో వారు మోడీకి అనుకూలంగా తీర్పు నివ్వడమే దీనికి నిదర్శనం. దీనిలో BJPకి రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్ అత్యంత బలహీన స్థితిలో ఉండటం ఒక కారణమైతే, అక్కడి హిందూ,ముస్లిం సమాజాల మధ్య గల స్పష్ఠమైన అంతరం(కమ్యునల్ డివైడ్) మరో కారణం.
మానవ మనస్తత్వ శాస్త్రం ప్రకారం, కష్టాల్లో ఉన్న ఓ వ్యక్తిపై, మరో వ్యక్తి చూపే సానుభూతి, వారిరువురి మధ్యగల సఖ్యతను, మరియు అతనిపై అప్పటికే ఏర్పరచుకుని ఉన్న అభిప్రాయాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి కష్టాలలో ఉన్న మరో అపరిచిత వ్యక్తిపై ఉండేది సాధారణ(కనీస) సానుభూతి అనుకుంటే, అదే పరిస్థితుల్లో ఉన్న 'తన' వర్గానికి చెందిన వ్యక్తిపై ఆ కనీస సానుభూతి కంటే ఎక్కువే ఉండి, అతన్ని కష్టాలనుండి విముక్తి కలగజేయడానికి ప్రయత్నించేలా కూడా సమాయత్తం చేయవచ్చు. అట్లే ఆ కష్టాలలో ఉన్నది తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిస్తే, అతనిపై కనీస సానుభూతి కూడా ఉండకపోగా తన 'పాపాన్ని అనుభవిస్తున్నాడన్న' తాత్సార వైఖరి ఉంటుంది. ఇక్కడ వర్గం అనేది పరిస్థితుల్ని బట్టి కులం, మతం, భాషా, ప్రాంతం వీటిలో ఏదైనా కావచ్చు. అట్లే సానుభూతి చూపడంలో ఈ రకమైన వ్యత్యాసాలను ఆ కష్టాలలో ఉన్న వ్యక్తి పై అప్పటికే ఏర్పడి ఉన్న అభిప్రాయాన్ని బట్టి కూడా మారుతుంటుంది, అంటే కష్టాలలో ఉన్నది మంచి వ్యక్తి అని తెలిస్తే అతనిపై ఎక్కువ సానుభూతి, అంత మంచి వాడు కాదు అనే అభిప్రాయం ఉంటే, తక్కువ సానుభూతి ఉంటుంది.దేశ విభజన సంధర్భంగా, గుజరాత్లో సరిహద్దు కిరువైపులా జరిగిన మత ఘర్షనలు మొదులుకొని, RSS,VHP,భజరన్ దల్ లాంటి సంస్థలు ఆ తర్వాత అక్కడ ఒక పద్ధతి ప్రకారం చేపట్టిన ముస్లింల పట్ల దుష్ప్రచారం ఫలితంగా, ముస్లింలు మిగతా వర్గాలనుండి పూర్తిగా వేరుచేయబడటంతో, వారి పట్ల ప్రభుత్వం ఎంత వివక్షాపూరితంగా వ్యవహరించినా అది మెజారిటీ ప్రజలకు నేరంగా అనిపించని పరిస్థితులు ప్రస్తుతం అక్కడ నెలకొని ఉన్నాయి. ఇలాంటి స్థితి దేశంలోని ముస్లింల మరియు ఇతర మైనారిటీల మనుగడకు ఎంత ప్రమాదకరమో గుజరాత్ దారుణాలు తెలియజేస్తున్నాయి.
చాపకింద నీరులా ముస్లింల పరాయీకరణ
గుజరాత్ లో విజయవంతంగా పరీక్షించబడ్డ 'పరాయీకరణ ' చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే ప్రయత్నాలు చాపకింద నీరులా జరుగుతూనే ఉన్నాయి. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ వైఖరుల్ని ప్రత్యక్షంగా గమనించొచ్చు. కర్నాటకలోని భాగల్కోట్లో జనవరి 1,2012 నాడు జరిగిన సంఘటన దీనికో చిన్న ఉదాహరణ మాత్రమే. అక్కడ తహసిల్దార్ ఆఫీసు ఎదురుగా జనవరి 1 వ తేదీన ,పాకిస్తాన్ జండా ఒకటి వెలసింది. అక్కడి ముస్లిములే ఈ పని చేశారని శ్రీరాం సేన, భజరంగ్ దల్, RSS లాంటి సంస్థలు ధర్నాలు,ర్యాలీలు నిర్వహించి అనేక ముస్లింల షాపులు, మరీయూ ఓ మసీదును కూడా ధ్వంసం చేశారు. కానీ పోలీసు విచారణలో ఇది ముస్లింల పని కాదనీ, మత వైషమ్యాలను పెంచి దానిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అక్కడి స్థానిక BJP నాయకులు ఈ పని చేయించారనీ తేలింది. దీనిలో భాగస్వామ్యులైన 7 మందిని శ్రీరాం సేన కార్యకర్తలుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది దేశవ్యాప్తంగా పార్టీకి చెడ్డపేరు తెస్తుందని గ్రహించి వెంటనే తేరుకున్న రాష్ట్ర BJP ప్రభుత్వం, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన విషయాలేవీ బయటికి పొక్కనీకుండా పోలీసుల్ని కట్టడి చేసేసింది. అక్కడి స్థానిక ముస్లింల అదృష్టం బాగుండి ఈ కుట్ర విఫలమైంది కానీ, లేకపోతే ఈ పాటికి ఎంత మంది అమాయకులు తమ ఆస్తులు,ప్రాణాలు కోల్పోయే వారో. ఇలా ముస్లింలను ఏదోఒక వివాదంలోకి లాగి వారిని ఇతర వర్గాలనుండి వేరు చేసి, వారిపట్ల ద్వేషభావం పెంచి పోషించడానికి ఈ కాషాయ వర్గాలు వాడే మరో అస్థ్రం -అసత్యాలు,అర్థ సత్యాలతో వక్రీకరించబడిన చరిత్ర. టిప్పు సుల్తాన్ అప్పటి కాలంలోని హిందువుల్ని ఏదో చేశాడనో, ఔరంగజేబు దుర్మార్గుడనో వారి గురించి ఉన్నవీ,లేనివీ కట్టుకథలు సృష్టించి ఆ ద్వేషాన్ని ప్రస్తుత ముస్లిం సమాజంపైకి మల్లించేలా ప్రయత్నిస్తుంటారు. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మరియు ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ మాటల్లో చెప్పాలంటే -"మధ్య యుగాలనాటి ముస్లిం పాలకులు అప్పటి హిందువులపై అనేక అకృత్యాలకు పాల్పడ్డట్లుగా, వేధింపులకు గురి చేసినట్లుగా ఏ మాత్రం ఆధారాలు లేని కట్టుకథలతో మన చరిత్ర నింపబడింది." (Source:http://www.kgfindia.com/kalidas-ghalib.php) ఇలాంటి వక్రీకరించబడిన చరిత్రే దేశంలోని ముస్లింల భవిష్యత్తును అంధకారమయం చేయడానికి ఉపయోగించబడుతుంది.
చేటు తెస్తున్న కొందరు ముస్లింల మత చాందసవాదం
స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం, ముస్లింల పట్ల ప్రణాళికా బద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారానికి, కొంత మంది ముస్లింలు కూడా తమ మత చాందస వాదంతోనూ, మూర్ఖత్వం తోనూ సహాయపడుతున్నారు. దీనికి చక్కటి ఉదాహరణ ఇటీవల రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో పండుగల సంధర్భంగా విపరీతంగా పెరిగిపోతున్న జెండాలు మరియు బైక్ ర్యాలీల సంస్కృతి.నిజానికి విగ్రహారాధనకి,మత చిహ్నాలకీ చోటులేని ఇస్లాంలో ఈ జెండాల గొడవేమిటో అర్థం కాదు.ఇది కేవలం ఇటీవలి కాలంలోనే మొదలై, ప్రతి సంవత్సరానికీ విస్తరిస్తూంది. 'ఇతరులు కూడా చేస్తున్నారు కదా ' అనే ఓ గొర్రెదాటు వంక తప్ప దీనికి మరే ఇతర సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నట్లు కనిపించదు. కానీ ప్రశాంత వాతావరణంలో, చూసే వారికీ, చుట్టుపక్కలవారికీ కూడా సంతోషాన్ని పంచుతూ చేసుకోవాల్సిన పండుగలు ఇలా పోలీసు బందోబస్తు మధ్య బలప్రదర్శనకు వేదికగా మారడం శోచనీయం. పైగా, ఇలాంటి మత పరమైన విభజనలు, ఉద్రిక్త పరిస్థితులు, 'ఎద్దు పుండు కాకికి ముద్దు ' లా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాచుక్కూర్చున్న అతివాద శక్తులకే అంతిమంగా లాభం చేకూరుస్తాయనే సంగతిని, జరుగుతున్న సంఘటనల్ని బట్టైనా గ్రహించలేక పోవడం వీరి మూర్ఖత్వానికి నిదర్శనం.
మతం మత్తులాంటిదని కార్ల్ మార్క్స్ చెప్పిన మాట అన్ని మతాలకు వర్తిస్తుంది.కానీ ఉరుకులు,పరుగుల దైనందిన జీవితంలోని ఒత్తిల్ల నుండి కాస్త స్వాంతన చేకూర్చటానికి, మంచి చెడుల స్పృహను
కలిగించడానికి ఇది కొంత వరకూ అవసరమే. కానీ హద్దులు దాటిందంటే దీని అనర్థాలు చాలా తీవ్రంగానే ఉంటున్నాయి. 'మనోల్ల' మతోన్మాదం వల్ల మనకేం ఇబ్బందులు లేవుకదా అని వీరిని ఉపేక్షిస్తే, ఈ మతోన్మాద విషసర్పం స్వపక్షీయుల్ని కూడా కాటేయడానికి ఎంతో కాలం పట్టదు. దీనికి చక్కని ఉదాహరణ మన పొరుగునే ఉన్న పాకిస్తాన్.అక్కడ ఎప్పుడు, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. చంపేదీ,చచ్చేదీ అందరూ ఒక మతస్థులే. ఇన్నాల్లూ భారత్,ఆఫ్గనిస్తాన్ లాంటి పొరుగుదేశాల్ని లక్ష్యంగా చేసుకున్న తమ దేశమతోన్మాదుల్ని ఉపేక్షించిన ఫలితాన్ని వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందుకే మతోన్మాదం, ఎక్కడ ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించవలసిందే, వారికి వంత పాడే వ్యక్తుల్ని, పార్టీల్ని దూరంగా ఉంచవలసిందే. అట్లే ముస్లింలు కూడా తామేదో ఓ ప్రత్యేక వర్గమని భావిస్తూ, అస్తమానం స్వర్గ సుఖాలగురించే ఆలోచించకుండా, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని, అందరిలో కలిసిపోయి, అందరినీ కలుపుకుని పోవలసిన అవసరం చాలా ఉంది. సర్వేజనాసుఖినోభవంతు.