Friday, December 24, 2010

'ఆత్మస్థుతి-పరనింద ' మాంచి కిక్ ఇచ్చే కాంబినేషన్

'ఆత్మస్థుతి-పరనింద ' జనాల్ని పోగెయ్యడానికి,రెచ్చగొట్టడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. ఆత్మస్థుతి అంటే, మనందరం మంచోల్లం,మనది గొప్ప మతం/కులం, మనది మహా గొప్ప సంస్కృతి,మనది మహా పుణ్య దేశం.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నమాట.. ఇక పరనింద అంటే, ప్రత్యర్థి వర్గాన్ని నోటి కొచ్చినట్లు తిట్టడం... ఆ ప్రాంతం వాల్లందరూ చెడ్డోల్లు, ఆ కులం వాల్లందరూ అహంకారులు, ఆ మతం వాల్లందరూ తీవ్రవాదులు etc..ఇలా డెసైడ్ చేసేయడం.  సహజంగా ప్రతి వాడికి,తన ప్రాంతం,కులం,మతం మీద మంచి అభిప్రాయం, ఓ రకమైన అభిమానం ఉంటుంది కాబట్టి, ఈ ఆత్మస్థుతి చేసే వాల్లందరూ మొదటి సారే నచ్చేస్తారు. ఇక, పక్కనోడు వెధవ అని అనుకోవటంలో, అంతర్లీనంగా నేను మంచోన్ని అనే అదో రకమైన తృప్తి వుంటుంది కాబట్టి, ఈ పరనింద కూడా వినటానికి చాలా హాయిగా/కంఫర్టబుల్ గా ఉండి, మెదడు యొక్క రీజనింగ్ పవర్ ని డామినేట్ చేసేసి,నిజానిజాల ఊసెత్తనీయకుండా చేస్తుంది.ఇక పదే పదే వింటూ ఉండటం, మాట్లాడుకుంటూ ఉండటం వల్ల, కొన్నాల్లకి మనకి తెలిసిందే నిజం అనే అభిప్రాయం స్థిరపడిపోయి, దానికి ప్రతిగా అవతలివాడు ఏం మాట్లాడినా, ఎన్ని ఆధారాలు చూపినా మనకు నమ్మాలనిపించదు. పైగా ఎదుటివాడు ఎంత బలంగా మన అభిప్రాయాలను తప్పని వాదిస్తే, అంతగా అతని మీద మనకు ద్వేషం పెరిగిపోయి, అతన్ని అవహేలన చేసో,తిట్టో మన ఈగో ని తృప్తి పరచుకోవటానికి ప్రయత్నిస్తాం.  ఈ ఆత్మస్థుతి-పరనింద, రీజనింగ్ ని ఎంతగా డామినేట్ చేస్తుందో, కొన్ని ఎక్జాంపుల్స్ ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటు,సమైక్య ఉద్యమాల్లో నాయకులు ఆత్మస్తుతి-పరనింద ని వాడుతున్న తీరుని ఆల్రేడీ నా పాత పోస్ట్ లలో రాసిఉన్నాను.ఇక్కడ వాడుతున్న ఎగ్జాంపుల్స్ చూసి, అసలు ఇది రాసినోడు 'మనోడా', కాదా అనేది ముందు తేల్చుకోవాలని మీలో కొందరికి అనిపిస్తూకూడా ఉంటుంది( దానిని బట్టి, నేను రాసిందాన్ని, పొగడాలా, లేక తిట్టాలా, తిడితే ఎంత తిట్టాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చని.)
Example speech #1.


"మనది చాలా గొప్ప సంస్కృతి. ఎన్నో మతాల్ని తనలో కలుపుకుంది మన సంస్కృతి.మన దేశం ఇప్పటి వరకూ ఎవరి మీదా దాడి చేయలేదు.కానీ మన దేశాన్ని ముస్లిం రాజులు దోచుకున్నారు. మన గుడులను, దేవాలయాలను  కూల్చేశారు.  మన సంస్కృతిని నాశనం చేసారు. ఇంకా ఎంత కాలం మనం చూస్తూ ఉండాలి..? "


పైకి చాలా సహేతుకంగా కనిపిస్తూ, ఒకింత సౌమ్యులని కూడా ఉద్రేక పరిచే అందమైన ఆత్మస్థుతి-పరనింద పై వాక్యాల్లో ఉంది. అదేంటో చూద్దాం.

రాజులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం, గెలిచిన రాజులు ఓడిన రాజ్యాల సంస్కృతిని నాశనం చేయటం అనేది అప్పట్లో చాలా మామూలు విషయం.మన దక్షిన భారతదేశంలోనే శివున్ని ఆరాధ్యదైవంగా పూజించే రాజ్యాలు కొన్నైతే, విష్ణువుని ఆరాధ్య దైవంగా పూజించే రాజ్యాలు కొన్ని ఉండేవి. వీరి మద్య పరస్పర యుద్ధంలో గెలిచిన వారు ఇతరుల ఆలయాలను కూల్చివేయడమో, లేక తమ ఆరాధ్య దేవుని విగ్రహాలతో నింపివేయటమో ఎన్నో సార్లుజరిగిందే.కానీ, 'ముస్లిం రాజులు మన గుడులు పడగొట్టారంట '  అనేదాంట్లో ఉన్నంత ఎమోషనల్ 'కిక్ ' మిగతా వాటిలో లేక పోవడం వల్ల మనం  దీనిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఇక మనదేశం , ఇప్పటి వరకూ ఏ దేశంపై కూడా దాడి చేయలేదు అనేది, ఆత్మస్థుతికి ఓ గొప్ప ఉదాహరణ. సహజంగా, బాగా బలంగా ఉన్న దేశాలు, అందుబాటులో ఉన్న బలహీన దేశాల్ని ఆక్రమించుకుంటాయి. మనకంటూ ఓ స్వతంత్ర్య దేశం ఏర్పడింది 1947లో. మన దేశం ఎవరిమీదా దాడి చేయలేదు - అంటే దానర్థం, మన పూర్వీకులు ఎవరూ అసలు యుద్ధాలు చేయలేదనా? పల్లవులు, చాలుక్యులు,క్రిష్ణదేవరాయులు,శాతవాహనులు,ఇక్ష్వాకులు లాంటి వారందరూ మన పూర్వీకులే కదా..? వీరెవరూ యుద్ధాలూ,ఆక్రమణలూ చేయలేదా..? కానీ  మన కంఫర్టబుల్ మైండ్ మనల్ని ఇలా ఆలోచించనీయదు.   ఇక మన సంస్కృతి ఎన్నో మతాల్ని తనలో కలుపుకుంది అనేది మరో ఆసక్తికర అంశం. వేరే మతం వారిని ఇక్కడ బతకనిస్తుండటమే చాలా గొప్ప అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కానీ, చాతుర్వర్ణ వ్యవస్తలో అట్టడుగునున్న కులాల వారు, సమానత్వం కోసం,  కుల వ్యవస్థ లేని Christianity,Islaam ల లోనికి మారటం వల్ల ఇక్కడ అవి బాగా వ్యాప్తి చెందాయి అనే నిజాన్ని మనం ఎప్పటికీ ఒప్పుకోం. ఎందుకంటే, ముస్లిం లందరూ అరేబియా నుంచి వచ్చారనీ(అంటే అరేబియా నుంచి వచ్చి మన మారుమూల గ్రామాల్లో/పల్లెల్లో స్థిరపడ్డారన్నమాట), క్రిష్టియన్లందరూ మిషనరీ లిచ్చే డబ్బులకి ఆశపడి వారి మతానికి అమ్ముడుపోయారనీ అనుకోవటం మనకు బోలెడంత Comfortness మరియు Satisfaction ఇస్తుంది.


Example speech#2 :


"మన మతంలో అసలు తీవ్రవాదులు,నేరస్తులు లేనే లేరు. కానీ ఆ మతంలో మాత్రం పుట్టిన ప్రతివాడు తీవ్రవాదే.కావాలంటే చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంస్థలన్నీ వారివే అంటారు."


మరి గుజరాత్ అల్లర్లలో అన్ని వందలమంది మర్డర్లు,మానభంగాలు, ఎలా జరిగాయంటే.. అబ్బే.. అదంతా గోధ్రా లో కరసేవకులు చనిపోవటం వల్ల ఆవేశంలో  ప్రతిచర్యగా జరిగిందే, దాని గురించి ఎక్కువ మాట్లాడవలసింది లేదు అంటారు. ఆవేశంలోచేసినా, ఆలోచించి చేసినా కుటుంబసభుల్ని కోల్పోయిన బాధ అందరికీ ఒకేలా ఉంటుంది కదా.. ఆ బాధను కొంత వరకైనా తీర్చేలా ఆ తప్పు చేసిన వారికి శిక్షలు వేయమని కసబ్,అఫ్జల్ గురు ల విషయంలో అడిగినట్లుగా ఎందుకు అడగం? అంటే సమాధానం ఉండదు.పైగా, అక్కడి కేసుల గురించి SupremCourt,CBI ఎమైనా మాట్లాడితే,హిదువుల్ని అవమానించటానికి అవి ప్రయత్నిస్తున్నాయని, అదంతా కాంగ్రెస్ వాల్లు వెనకుండి చేయిస్తున్నారని, ఇటలీ నుంచి వచ్చిన క్రిస్టియన్ సోనియా గాంధీ ఈ స్కెచ్ అంతా వేసారని మనం పెద్ద డిటెక్టివ్ లా ఆలోచిస్తాం.లేక ఎవరైనా సోకాల్డ్ నాయకుడు/బ్లాగర్ ఇలా విమర్శిస్తే ,చప్పట్లు కొట్టిమరీ వారిని ఎంకరేజ్ చేస్తాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదుల లిస్ట్ తీస్తున్నారు కదా, అట్లే అక్కడి ప్రజల సమస్యల లిస్ట్ కూడా తీయండి, పాలస్తీనాలో ఏం జరుగుతుందో, ఇస్రాయెల్ ఎలా,ఎక్కడ ఏర్పాటు ఐందో, ఏర్పాటైనప్పుడు దాని పరిమాణం ఎంత ఉండేది,ఇప్పుడు ఎంత ఉందో చూడండి, అల్ ఖైదాని ఎవరు తమ స్వార్థం కోసం పుట్టించారో ,అట్లే అక్రమ ఇరాక్ యుద్ధంలో చనిపోయిన, లేక అవిటివాల్లైన చిన్న పిల్లలపై కాసేపు జాలి పడండి అంటే, దానికీ సమాధానం ఉండదు కానీ, వాల్ల తరపున ఇంతగా మాట్లాడుతున్నాడంటే  వీడు కశ్చితంగా మనోడు కాదు అనేది కంఫర్మ్ , కాబట్టి వీడు చెప్పేది మనం ఇగ్నోర్ చేయాలి, లేకుంటే మాంచి పంచ్ డైలాగ్ తో అపోజ్ చేయాలి...ఇలా ఉంటుంది మన వైఖరి.
 
"మనం కత్తి పడితే అది గత్యంతరం లేక చేసే పవిత్రకార్యం, అదే ఎదుటివాడు చేస్తే అది తీవ్రవాదం, మతమౌఢ్యం"


ముగించే ముందు కొన్ని ముఖ్య విషయాలు:


* కాష్మీర్లో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పొయిన, మరియు ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే ప్రంతాలకు తరలివెల్లిన కాష్మీరీ హిందూ పండిట్లూ, ఉగ్రవాదుల చేతిలో మరియు మిలిటరీ చేతిలో(టెర్రరిస్ట్లనే అణుమానంతో) ప్రాణాలు కోల్పోతున్న కాష్మీరీ ముస్లింలు వీరిద్దరీ బాధా ఒక్కటే. గోధ్రా రైల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన కరసేవకుల కుటుంబసభ్యుల ఆవేదనా,ఆ తర్వాత గుజరాత్ అంతటా చెలరేగిన  అల్లర్లలో  గోధ్రా రైలు దహనంతో ఏ మాత్రం సంబంధంలేని, ( నిందితులది, వీరిదీ ఒకే మతం అనే ఒక్క కారణం తప్ప) హత్యలకు,మానభంగాలకు గురైన,  గుజరాతీ ముస్లిం ల రోదనా,ఆవేదనా ఒక్కటే. అట్లే, పార్లమెంట్ పై దాడి,1992 ముంబై అల్లర్లు,ఇటీవలి తీవ్రవాద దాడులు,అజ్మీర్,మక్కా మజీద్,లుంబినీ పార్క్ పేలుల్లుetc.. అన్నీ ఖండించాల్సినవే, అన్ని సందర్భాల్లోనూ నిందితుల్ని నిష్పాక్షికంగా విచారించి కఠినంగా శిక్షించాల్సిందే. దీనికి అన్ని మతాల, వర్గాల ప్రజలు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది.
* ఇస్లామిక్,క్రిష్టియన్ దేశాల్లో అక్కడి మైనారిటీలను నీచంగా చూస్తారని చెప్తూనే, మనం మాత్రం మంచిగా ఎందుకు ఉండాలి, మనం వారికంటే మూర్ఖులమని నిరూపించుకుందామనటం ఏ సంస్కృతికి చిహ్నం?
* మంచి మనుషుల్ని తయారు చేయలేని మతమేదైనా మంచి మతం కాదు. ఎదుటి వాడి బాధను మతం కల్లతో చూసే వాడెవడూ మంచి మనిషి కాలేడు.
* మతాలన్నీ ఒక స్టేజ్ వరకూ మంచిగానే ఉంటాయి. దానితో రాజకీయం కలిసినప్పుడే అసలు చిక్కంతా. ఆ రాజకీయాల్ని అర్థం చేసుకోకుండా, ఆ మతస్తులందరినీ ఒకే గాటన కట్టి విమర్శించటంలో అర్థం లేదు.

Thursday, December 9, 2010

YSR పై ఓ అభిప్రాయం!!!

"YSR- ఓ అవినీతిపరుడు"
"YSR- ఓ ఫ్యాక్షనిస్టు"
"YSR- ఓ తెలంగాణా ద్రోహి"


ఇలా YSRని విమర్శించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోతుంది.. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా, నాకేమనిపిస్తుందో   మీతో పంచుకోవాలని ఈ వ్యాసం.. రాజకీయనాయకుడు అంటే -ఐదేళ్లకోసారి ప్రజల వద్దకెల్లి, నోటికొచ్చిన హామీలిచ్చి,కులం,మతం,ప్రాంతం వీటిలో ఏదో ఒకటి,వీలైతే అన్నీ గుర్తుచేసి, ఇంకా వీలైతే రెచ్చగొట్టి, వారి ఓటును తద్వారా అధికారాన్ని పొంది, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఇచ్చిన హామీలను, ఓటేసిన ప్రజలను మరచిపోయి రాజయోగాలు అనుభవించేవాడు అని ప్రస్తుత అర్థం."  ఏ నాయకుడు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సగటు ప్రజానీకం జీవితాలలో మాత్రం పెద్దగా మార్పు ఉండదు,గెలిచిన ఆ నాయకుని,అతని బంధువర్గ,అనుచరగణ జీవితాలలో తప్ప.. 2004కు ముందు వరకూ, రాష్ట్రప్రజలకు తెలిసిన రాజకీయమిదే..కానీ, 2004లో YSR ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత, ఓ రాజకీయ నాయకుడు తలచుకుంటే ప్రజల జీవితాలను ఎంతగా మార్చగలడో క్రమంగా అర్థమవుతూ వచ్చింది.ఇందిరమ్మ గృహాలు,ఆరోగ్యశ్రీ,వికలాంగ, వృద్ధాప్య పించన్లు,మైనారిటీ రిజర్వేషన్లు,విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్,108,104 etc..etc...రాష్ట్రంలో 80% పైగా ఉన్న దిగువ,మధ్య తరగతి కుటుంబాలలో, ప్రతి కుటుంబం  ఈ పధకాలలో కనీసం ఒక్క పధకం ద్వారానైనా లబ్ధిపొంది ఉంటుంది, వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ.. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లాగే సాధారణంగా ఉండే మా ఊర్లో, 2004 తర్వాత సెలవులకు ఇంటికెల్లిన ప్రతిసారీ, ఈ మార్పును అక్కడి ప్రజల జీవితాలలో చాలా స్పష్టంగా గమనించాను.వర్షాకాలంలో నీరు కారకుండా నీలం రంగు పాలిథిన్ పేపర్లతో, ఎండాకాలంలో గాలికి ఎగిరిపోకుండా పైన పెద్ద రాల్లతో కనబడే బోదకొట్టాలన్నీ పక్కా గృహాలైపొయాయి-ఇందిరమ్మ పధకంవల్ల. పెద్ద రోగమేదైనా వస్తే, పెద్ద పాపమేదో చేసిఉంటామనుకుంటూ తమలోతాము కుమిలిపోవటమే తప్ప కార్పోరేట్  ఆసుపత్రులవైపు కన్నెత్తి చూడటానికికూడా సాహసించని నిరుపేదలు, పైసా ఖర్చు లేకుండా,దర్జాగా వ్యాధులు నయం చేసుకొని ఇల్లకెల్లటం నాకల్లతో చూశాను-ఆరోగ్యశ్రీ వల్ల...ఊర్లోకి అంబులెన్స్ వస్తే, 'రెడ్డిగారి ' వీధిలో ఎవరికో బాగాలేదనుకొనే పరిస్థితినుండి, పేదోడి ప్రాణాన్ని కాపాడటానికి కూడా ఆఘమేఘాల మీద అంబులెన్స్ లు రావడం 'కుయ్ కుయ్ 'శబ్దాల సాక్షిగా చూశాను- 108వల్ల. టెంత్/ఇంటర్ తర్వాత, విమానటికెట్ కి,వీసా చార్జీలకి అవసరమైనంతడబ్బును అప్పుగా పొందగల స్తోమత ఉన్నోడు గల్ఫ్ లో ఒంటెలు కాసుకోడానికో,మరేదైనా కూలిపనికో.. ఆ మాత్రం స్తోమత కూడా లేనివాడు.. నాలుగు చక్రాల బండి మీద పండ్లు,కూరగాయలు అమ్ముకుంటూ..స్థానిక మసీదులోని ముల్లా చెప్పే 'స్వర్గపు కబుర్లు' వింటూ, పేదరికం దేవుడు పెట్టే పరీక్ష అనుకుంటూ నైరాశ్యంలో బతకటం..ఇదీ నాకు తెలిసిన ఒకప్పటి మైనారిటీ యువకుల దీనస్థితి. కానీ, ఇప్పుడు వీరిలో చాలా మంది MBA/MCA/BTech లు జాయినవుతున్నారు- మైనారిటీ రిజర్వేషన్లు,ఫీజు రీఎంబర్స్మెంట్ ల వల్ల.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక వ్యక్తి-YSR.


YSR మహాత్ముడు కాదు:


చట్టాలను అతిక్రమించో, చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకొనో తన వాల్లకి అక్రమ ఆస్తుల్ని కూడబెట్టడం ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్.YSR దీనికి అతీతుడేమీ కాదు. తన బంధు,అనుచరగణం అక్రమాస్థులు సంపాదించుకోవడంలో సహకారం అందించటం, లేకుంటే చూసీ చూడనట్లు వదిలేయటం చేసిఉంటాడనటంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.. అట్లే YSR ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయగ్నం మరియు ఇతర పథకాలలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిఉంటుంది అనే దాంట్లో కూడా సందేహం లేదు. కానీ ఈ అవినితిని ఆసరాగా చేసుకుని, దేశంలో ఇప్పటివరకూ ఏ CMకి కానీ,ఏ నాయకునికి కానీ, కనీసం ఊహకైనా అందనంత మంచి పథకాలను ప్రవేశపెట్టిన YSRని, పేదప్రజల గుండెల్లోనుండి శాశ్వతంగా తొలగించడానికి ఓ పథకం ప్రకారం
కుట్ర జరుగుతుండడమే అసలు విషాదం. YSR అవినీతి గురించి, నిజాయితీగా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న JP లాంటి వారో,అవినీతికి పాల్పడే అవకాశం ఎప్పుడూ లేని,రాని కమ్యూనిస్టులో విమర్శిస్తే పరవాలేదు కానీ, అవినీతి వ్యవస్థలో తాము కూడా భాగమైపోయి, తమ హయాంలో సాధ్యమైనంత దోచుకున్న వారుకూడా-'మేమైతే కొంత తక్కువ దోచుకునే వాల్లం' అన్నట్లుగా విమర్శించటం హాస్యాస్పదం. ఇక YSR బతికి ఉన్నన్నాల్లూ తమ శకుని ఎత్తుగడలు ఫలించక, ఓ వైపు ప్రతి ఎలక్షన్లలోనూ తెలంగాణా ప్రజలు YSR పక్షానే నిలుస్తుండటంతో ఏంచేయాలో పాలుపోక అన్నీ మూసుకుకూర్చున్న కెసీఆర్ అండ్ కో, ఆయన మరణించిన ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసారో కనిపిస్తూనే ఉంది. ఐనా, పార్టీలూ, ఉద్యామాలంటూ మొదలుపెట్టాక అపోజిషన్ వాడు ఎంత మంచోడైనా వాడిని తిట్టకుంటే మనుగడ ఉండదు కాబట్టి ఈ విమర్శలను కొంత వరకూ అర్థం చేసుకోవచ్చు. వీరందరూ కాక, YSRని విమర్శించే మరో గ్యాంగ్ కూడా ఉంది. అది -కాంగ్రెస్ లోని వృద్ధజంబూకాల గ్యాంగ్. వయసుతో పాటు YSRపై కుల్లు,ఈర్ష్య,అసూయ పెరుగుతూ వచ్చి, ఎవరికి చెప్పుకోవాలొ ఏం చేయాలొ తెలియక సతమవుతున్న ఈ ముసలి నాయకులు(?) ,ఇటీవల స్టేట్మెంట్లు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు."YSR పధకాలన్నీ సోనియా పథకాలేనంటాడొకడు. మరి వేరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవు? కాంగ్రెస్ పార్టీ గెలుపులో తమ పాత్ర కూడా ఉందంటాడు మరొకడు.ఇది విని వాల్ల ఇంట్లొవారు కూడా నవ్వకుండా ఉండలేరు. సోనియా వల్లే YSR గొప్పవాడయ్యాడంటాడు ఇంకొకడు.YSRలేకుంటే కాంగ్రెస్ గతి ఏమయ్యేదో ఇప్పుడు సోనియాకు క్లియర్ గా తెలిసిఉంటుంది . కాంగ్రెస్ లోని ఇలాంటి నాయకులందర్ని 'ఏనుగును చూసి మొరిగే కుక్కలనవచ్చు ' కానీ కుక్కలలో కూడా ఇవి 'పిరికి కుక్కలు ' ఎందుకంటే ఏనుగు ముందు అరవడానికి భయపడి ఏనుగు వెల్లింతర్వాత, ఏనుగుకు వినపడకుండా సైలెంట్ గా మొరుగుతున్నాయ్ కాబట్టి. ఇక ఇలాంటి నాయకులతో నిండిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటో కాలమే చెప్తుంది.

Saturday, December 4, 2010

ర్యాగింగ్ ముచ్చట్లు -1

ఎదుటివాడు ఎంత సున్నితమనస్కుడు అని అంచనావేసే ఓపిక,వివేచన లేకుండా, ఎదుటివాని బాధను కూడా ఎంజాయ్ చేసే శాడిజం ఉన్న సీనియర్లు..
పుట్టిన మరుక్షణమే, ప్లే స్కూల్ ఫీజ్ నుండి,పెద్దయ్యాక విదేశాల్లో ఉన్నత చదువులకు అవసరమైన ఖర్చులు కూడా లెక్కగట్టి, దానికి తగ్గట్లు పాలసీలు కట్టే నాన్న,పిల్లలపెంపకం గురించి పుస్తకాలు చదివి మరీ ప్రిపేర్ అయ్యే అమ్మ, ఉంటే,గింటే మరో అన్నో,చెల్లో.. వీరు తప్ప ఇంకో ప్రపంచం అంటూ తెలీకుండా చిన్న కుటుంబాల్లో, అతిసున్నితంగా,ప్రొటెక్టివ్ గా పెరిగిన జూనియర్లు...
వీరివల్ల, ర్యాగింగ్ అనేది ఓ సామాజిక రుగ్మతగా మారి, పరిస్థితి హత్యలు, ఆత్మహత్యల వరకూ వెల్లడంతో..ప్రభుత్వం దానిని పూర్తిగా రూపుమాపటానికి ప్రయత్నిస్తుంది. అంతకు మించి వేరే మార్గం కూడా లేదు. కానీ,కొన్నేల్ల క్రితం వరకూ ర్యాగింగ్ అంటే,  అప్పటివరకూ పుస్తకాలతో కుస్తీ పట్టి, వృత్తి విద్యాకోర్సుల్లో సీట్ సాధించిన విద్యార్ధికి, సిగ్గూ,బిడియం లాంటివి పోగొట్టి, చాలా సరదాగా, సీనియర్లతో చక్కటి పరిచయాలు పెంపొందించుకోవటానికి ఓ మార్గంగా ఉండేది. సీనియర్లు ర్యాగింగ్ లో చెప్పించే మాటలు,చేయించే పనులు, ఆ సమయంలో కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుంటే చాలా నవ్వు తెప్పిచ్చేలా ఉండేవి. నా అనుభవంలో ఉన్న అలాంటి కొన్ని సరదా ఞాపకాలను మీతో పంచుకుంటాను..


ఓ రోజు,  నన్ను, మా రూమ్మేట్ కిరణ్ ని  సీనియర్లు మెస్ దగ్గర అటకాయించి ,SD(సొంత డబ్బా) చెప్పమన్నారు.
మారూమ్మేట్ తన పేరు చెప్పి, వూరు నెల్లూర్ అన్నాడు. ఆ తర్వాత, నెల్లూర్ తో కాస్త పరిచయం ఉన్న ఓ సీనియర్ తో కిరణ్ సంభాషన ఇలా సాగింది.


సీనియర్: నెల్లూర్లో ఎక్కడ్రా మీ ఇల్లు?
కిరణ్: సార్, నెల్లూర్ జిల్లాలో గూడూర్ సార్..
సీ: గూడూర్లో ఎక్కడ్రా మీ ఇల్లు?
కిరణ్: గూడూర్ దగ్గర పొదలకూర్ సార్..
సీ: పొదలకూర్లో ఎక్కడ?
కిరణ్:పొదలకూర్ పక్కన తూర్పుకోండ్ల అనే వూరు సార్..
సీ (కొంచెం ఇరిటేషన్ తో) : ఒరే ఎక్కడో..  తూర్పుకోండ్ల నుంచి ఎర్రబస్సు ఎక్కి వచ్చి, ఇక్కడ నెల్లూర్ అని బిల్డప్పు కొడుతున్నవా..? ఐనా సొంత ఊరి పేరు చెప్పుకోడానికి నామోషీనారా నీకు? ఇంకో సారి ఎవరైనా అడిగితే ఉన్నది ఉన్నట్లు చెప్పు, ఎగస్ట్రాలొద్దు..


ఆ తర్వాత, మరుసటిరోజే మరో బ్యాచ్ సీనియర్లు మెస్ దగ్గర మమ్మల్ని అటకాయించి, SD చెప్పమన్నారు. అప్పుడు మా కిరణ్ తో సీనియర్ల సంభాషన ఇలా సాగింది.


కిరణ్: నా పేరు కిరణ్. మా వూరు తూర్పుకోండ్ల.
సీ : తూర్పుకోండ్ల..? అదెక్కడుందిరా..?
కిరణ్: పొదలకూర్ మండలంలో సార్..
సీ: పొదలకూరా..? అదెక్కడుంది..?
కిరణ్: గూడూర్ తాలుకా సార్..
సీ: గూడూరా..? అదెక్కడ?
కిరణ్: నెల్లూర్ జిల్లా సార్..
సీ(ఇరిటేషన్  తో) : ఒరే, నెల్లూర్ అని చెబితే ఒక్క మాటలో  ఐపొయేది కదరా..? SD అడిగిన పాపానికి ఇంతలా టార్చర్ పెట్టాలా..? ఆ చెప్పడం చూడు.. తూర్పుకోండ్ల అంట, అదేదో న్యూయార్క్ సిటీ నుంచి వచ్చానన్నట్లు..
మా కిరణ్ పరిస్థితికి, ఎంతగా ఆపుకోవల్లన్నా కుదరక, నేను తల వంచుకొని నవ్వుతుంటే, ఒరే ఇక్కడ ఇంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే, ఏ మాత్రం భయంలేకుండా నవ్వుతున్నవా..? అని వాన్ని వదిలేసి నన్ను సెంటర్ చేశారు... నేను చేసిన ఈ ఘోర అపరాధానికి ఏం శిక్ష వేయాలనేదానిమీద కాసేపు వాల్లలో వాల్లు తర్జనభర్జన పడ్డారు. 'సపోటా' మేడంకి లవ్ లెటర్ రాయిద్దామన్నాడొకడు.(అతని మనసులో కోర్కెని నా ద్వార తీర్చుకుందామనేమో.?) , వీల్ల క్లాస్ లో ఎవరో ఓ అమ్మాయి తో వీడికి లవ్ లెటర్ రాయించుకొని రమ్మందామన్నడొకడు.. (ఈ ఐడీయా ఏదో బాగుంది అనుకున్నా, మనసులో) ..ఇలా కొన్ని ఆప్షన్స్ అనుకొని, చివరికి ఒకటి ఖాయం చేసేశారు. అది- ఓ వారం రోజుల పాటు, ప్రతిరోజూ పొద్దున  క్లాసెస్ స్టార్ట్ కావడానికి ఓ 5 నిమిషాలు ముందు, వారి క్లాస్ లోకి వెల్లి,ఇంగ్లీష్ లో ఓ జోక్ చెప్పి అందరిని నవ్వించాలి.  ఎప్పుడూ గుంపులో కూర్చుని గోల చేయడమే తప్ప, స్టేజీలపైన, కొత్తవారి ముందు మాట్లాడటం మన హిస్టరీలోనే లేదు. అది కూడా ఇంగ్లీష్ లో చెప్పాలంట.. మనదేమో ఒకటో కిలాసు నుంచి ఇంటర్ వరకూ ప్రభుత్వ స్కూల్లలో, ప్యూర్ తెలుగు మీడియం చదువు. ఆ రోజుల్లో నేను ఇంగ్లీష్ సీరియస్ గా మాట్లాడితేనే వినేవాల్లు తెగ నవ్వేసేవారు. ఇక జోక్ చెబితే ఎలా ఫీల్ అవుతారో..? పైగా,అసలే సీనియర్ల కంటపడకుండా ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్న టైంలో, నాకు నేనే వారి క్లాస్ రూంలోకి వెల్లి జోక్ చెప్పడం...ఏమి నా ఖర్మము అనుకుంటూ, పాత వారపత్రికలు ముందేసుకొని , ఈజీగా ఉన్న జోకుల్ని ఇంగ్లీష్ లోకి అనువదించుకొని,కంఠతా పట్టేసా. మొదటిరోజు సీనియర్ల క్లాస్ లోకి అడుగుపెట్టడం.. వాల్లందరూ నా మీద జోకులేసుకొని పగలబడి నవ్వడం వరకైతే గుర్తుంది కానీ, నేనేం చెప్పానో నాకే తెలీలేదు.. అలా ఆ ఆరు రోజులూ ఆరు ప్రహసనాలుగా గడిచిపొయాయి. కానీ, నాకున్న 'స్టేజ్ ఫియర్ ' ని జయించడంలో మాత్రం అది బాగా హెల్ప్ అయింది...