Monday, December 26, 2011

M.F.హుస్సేన్-తస్లీమా నస్రీన్ : మతం- రాజకీయం

M.F హుస్సేన్ అనగానే వివాదాలు గుర్తుకొస్తాయి. హుస్సేన్ గీసిన అనేక రకాల పైంటింగ్స్ లో బూతు బొమ్మల కింద వివాదాస్పద మైనవి కొన్ని మాత్రమే. అతను గీసినవన్నీ  దేవతల బూతు బొమ్మలే కావు, కేవలం వాటితోనే అతను పాపులర్ పైంటరూ కాలేదు. 
1996లో 'విచార్ మీమాంస ' అనే హిందీ పత్రిక, హుస్సేన్ గీసిన కొన్ని చిత్రాలను ప్రచురించి అతను హిందూ దేవతల్ని అవమానిస్తున్నాడని తీర్మానించడంతో వివాదం మొదలైంది. అప్పటి దాకా దేశంలో గొప్ప పైంటర్లలో ఒకడిగా వెల్గొందుతున్న హుస్సేన్, రాత్రికి రాత్రి హిందూ ద్వేషిగా ముద్ర వేయబడ్డాడు. శివసేన, భజరంగ్ దల్ లాంటి సంస్థలు  హుస్సేన్ ఇంటి మీద దాడిచేయడం, అతని ఆర్ట్ గ్యాలరీల్ని ధ్వంసం చేయడం లాంటివి చేయడంలో పోటీలు పడ్డాయి. ఈ బొమ్మలు గీసింది ఏ రమేశో, సురేశో ఐతే పరిస్తితి ఎలా ఉండేదో గానీ, 'హుస్సేన్ ' అనే పేరు కావడంతో ఇక ఎవరికీ అతను హిందూ దేవతల్ని అవమానిస్తూనే  గీశాడా లేదా అని  అణుమానించాల్సిన అవసరం  కనపల్లేదు. హుస్సేన్ మీద దేశంలోని అనేక కోర్టుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. దేశంలో అతని ప్రదర్శనల్ని ప్రతిసారీ ఆందోళనకారులు అడ్డుకోవడం జరిగింది. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన హుస్సేన్ దేశం వదిలి పారిపోయి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.
       
నిజానికి ఆ పత్రిక ప్రచురించిన హుస్సేన్ చిత్రాలు అతను 1970లో గీసినవి. 1970 నుండి, 1996లో ఓ పత్రిక ప్రచురించే వరకూ, ఈ 26 ఏళ్ళ కాలంలో  ఏ హిందువూ వాటిని చూడలేదా..? హుస్సేన్ ఆ చిత్రాల్ని ముస్లింలో, క్రిష్టియన్లో చూసి ఆనందించాలని రహస్యంగా గీశాడా..? వాటిని కేవలం అరబ్ దేశాల్లోనో, క్రిష్టియన్ దేశాల్లోనో ప్రదర్శనకి పెట్టాడా..?
హుస్సేన్ గీసిన ఈ చిత్రాలు ఆ 26 ఏళ్ళలో బారతడేశంలోనే, అనేక ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించబడ్డాయి. అనేక మంది వీటిని చూసి హుస్సేన్ ప్రతిభని కొనియాడారు. ఈ అనేక మందిలో, చిత్రకారులు, చిత్ర లేఖనం పట్ల ఆసక్తి కలవారు ఉంటారు. వీరిలో కూడా అత్యధికులు హిందువులే ఉంటారనేదాంట్లో సందేహం లేదు. పాపం వీరెవరూ ఆ చిత్రాల్లోని బూతుని కనిపెట్టలేక పోయారు, ఓ పత్రిక చెప్పేదాకా.. 


ఇక మరో వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన పుస్తకం 'లజ్జ ' లో ఇస్లాంకి వ్యతిరేకంగా రాసిందనే అభియోగం మీద అక్కడి మత సంస్థలు తస్లీమా తలకి వెలకట్టడంతో ఆమె బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి భారత దేశంలో తలదాచుకుంటుంది.
 హుస్సేన్, తస్లీమలను చూసే కోణాన్ని బట్టి దేశంలోని వివిధ వర్గాల/సంస్థల రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు.
హుస్సేన్ పై దాడులను సమర్థిస్తూ, అతన్ని దేశం నుండి తరిమి వేయడాన్ని తమ విజయంగా భావించే శివసేన, భజరంగ్ దల్, VHP లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ పై విమర్శల్ని మాత్రం మత మౌఢ్యంగా భావిస్తాయి. అట్లే ఆమెను  భారత దేశంలో  ఉంచుకోవడం గొప్ప మానవతా విషయంగా అభివర్ణిస్తాయి.  అదే సమయంలో హుస్సేన్ ని దేశం నుండి వెల్లగొట్టడాన్ని ఆటవిక చర్యగా భావించే MIM లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ ను మాత్రం భారత దేశం నుండి గెంటివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  


ఈ రెండు వివాదాల్లో అసలు కీలకాంశం ' మత విషయాల్లో కళాకారుల స్వేచ్చకు పరిమితులేమిటి, చట్టాలు, కోర్టులు ఇలాంటి విషయాల్లో ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చు' అనేది. నిజానికి ఇదేమంత క్లిష్టమైన విషయం కాదు. కాకపోతే ఇలాంటి వాటికి పరిష్కారాల్ని వెతికేటప్పుడు, మన మతం, అవతలి మతం అంటూ గిరి గీసుకుని ఆలోచించినంత కాలం విభిన్న మతాలు కల మన భారత దేశంలాంటి చోట్ల , వీటికి పరిష్కారాలు దొరకటం కష్టమే. పైగా 'ఎద్దు పుండు కాకికి ముద్దు' అన్నట్లు ఇలాంటి వాటిలో తల దూర్చి తమ రాజకీయ ప్రయోజనాల్ని నేరవేర్చుకోవడానికి ప్రయత్నించే రాబందులు ఉండనే ఉన్నాయి.. అన్ని చోట్లా, అన్ని వైపులా.. 

ఇలాంటి రాబందులకి లొంగకుండా ప్రజలు ఎంత మెచ్యూర్ గా ఆలోచించగల్గుతున్నారు అనే దాని మీదనే ఆ దేశ/సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే రవీంద్రుడు చెప్పినట్లు -  Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit...Into that heaven of freedom, my Father, let my country awake.. Aamen!!!  

Thursday, December 22, 2011

జస్టిస్ మార్కండేయ కట్జూ ఆలోచనాత్మక వ్యాసాలు.

మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ ఐన జస్టిస్ మార్కండేయ కట్జూ , భారతరత్న అవార్డు గురించి రాసిన ఆలోచనాత్మక  వ్యాసం ఇవాల్టి 'ది హిందూ'  లో ప్రచురితమైంది.

http://www.thehindu.com/opinion/op-ed/article2732614.ece 


జస్టిస్ కట్జూ 'కాలిదాస్-గాలిబ్ ఫౌండషన్' అనే సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ సామాజిక రాజకీయ  అంశాలపై లోతైన విశ్లేషణలతో రాసిన అనేక వ్యాసాలు-  http://www.kgfindia.com  అనే వెబ్ సైట్లో ఉన్నాయి. 

ఉదాహరణకి  భారత దేశంలో చరిత్ర బోధన గురించి  రాసిన వ్యాసం నుండి కొంత భాగం ఇలా ఉంది-


"1928లో, టిప్పుసుల్తాన్ గురించి నేను పరిశోధన చేస్తున్న టైంలో, ఒక విధ్యార్థి సమాఖ్యకు సంబంధించిన కొందరు తాము స్థాపించబోతున్న చరిత్ర సంబంధమైన ఒక సంఘ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. వారి దగ్గరున్న చరిత్ర పుస్తకంలో నుండి టిప్పుసుల్తాన్ గురించి రాసి ఉన్న ఒక వాక్యాన్ని చూసి దాదాపు నాకు కల్లు బైర్లు కమ్మినంత పనైంది. అది - "టిప్పుసుల్తాన్ 3 వేల మంచి బ్రాహ్మణుల్ని బలవంతంగా  ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించగా వారు ఆత్మహత్య చేసుకున్నారు అనేది" . ఆ టెక్స్ట్ బుక్ రాసింది మహామహోపాధ్యాయ హర్ ప్రసాద్ శాస్త్రి, కలకత్తా యూనివర్సిటీలో సంస్కృత శాఖాధిపతి. దేని ఆధారంగా ఆయన టిప్పుసుల్తాన్ గురించి ఈ వ్యాఖ్య చేశారో, దానిని నిరూపించే చారిత్రక ఆధారాలేమైనా ఉంటే తెలియజేయండని నేను వెంటనే శాస్త్రి గారికి రాయడం జరిగింది. ఇలా అనేక సార్లు అడగిన తర్వాత- మైసూరు గెజిట్ నుండి తీసుకున్నానని ఆయన నుంచి ప్రత్యుత్తరం వచ్చింది.   మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీకాంతియా ని ఈ విషయమై సంప్రదిస్తే, మైసూర్ గెజిట్లో ఏనాడు బ్రాహ్మణుల ఆత్మహత్యల గురించి రాలేదనీ, పైగా, విద్యార్థి దశలో మైసూరు చరిత్ర మీద తాను పరిశోధన చేశాననీ, ఇలాంటి సంఘటన ఏదీ మైసూర్లో జరగలేదని తాను కశ్చితంగా చెప్పగలననీ అన్నారు.   ఇంకా టిప్పుసుల్తాన్ ప్రధానమంత్రి-పునియా మరియూ సర్వ సైన్యాధిపతి- క్రిష్ణారావు ఇద్దరూ బ్రామ్హణులేననీ చెప్తూ, అప్పట్లో టిప్పుసుల్తాన్ 156 దేవాలయాలకు ప్రతి సంవత్సరం భరణం చెల్లించే వాడనీ ఆ దేవాలయాల లిస్టూ అట్లే శ్రింగేరి మఠాధిపతి జగద్గురు శంకరాచార్య గారితో టిప్పుసుల్తాన్ ఆత్మీయ సంబంధాన్ని తెలిపే ఉత్తరప్రత్యుత్తరాలకి  సంబంధించిన సుమారు 30 ఫోటో కాపీలను కూడా పంపించాడు.  
చరిత్రను వక్రీకరిస్తూ శాస్త్రి గారు రాసిన పుస్తకం అప్పటికే  బెంగాల్, ఒరిస్సా, యు.పి, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పాఠ్యాంశంగా బోదించబడుతుంది. అప్పటి కలకత్తా యూనివర్సిటీ VC-శ్రీ అశుతోశ్ ముఖర్జీ   గారికి, శాస్త్రి గారితో, మైసూర్ యూనివర్సిటీ VC -బ్రిజేంద్ర నాధ్ శీల్ గారితో, మరియూ ప్రొఫెసర్ శ్రీకాంతియా గారితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ ఇతర అధారాలనూ పంపించి అసత్యాలను ప్రాచుర్యంలోకి తెస్తున్న వారిపై చర్య తీసుకోవలసిందిగా కోరడం జరిగింది. అశుతోశ్ ముఖర్జీ గారు వెంటనే స్పందించి శాస్త్రి రాసిన పుస్తకాలన్నింటినీ పాఠ్యాంశాలనుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.  కానీ బాధాకరమైన విషయమేమంటే - విద్యార్థుల మనసుల్లో విద్వేషాల్ని నింపే  ఇలాంటి కట్టుకథలు ఇంకా అనేక పాఠ్యపుస్తకాలలో ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు."

భారత దేశం మీదికి దండెత్తి వచ్చిన తొలితరం ముస్లిం పాలకులైన ఘజనీ, ఘోరీ లాంటి కొందరు హిందూ దేవాలయాలను కూలగొట్టిన మాట వాస్తవమేననీ, కానీ ఆ తర్వాత ఇక్కడ రాజ్యస్థాపన చేసిన అనేక మంది ముస్లిం రాజులు హిందువులతో సఖ్యతను కొనసాగిస్తూ వారి సంస్కృతినీ, దేవాలయాలనూ పరిరక్షించారనీ, కానీ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నంత కాలం వారి మీద ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదని గ్రహించిన బ్రిటీష్ వారు, తమ 'విభజించి పాలించు' పధకంలో భాగంగా చరిత్ర వక్రీకరణకి పూనుకున్నారనీ వివరిస్తూ, వివిధ బ్రిటీష్ అధికారుల మధ్య ఈ విషయం గురించి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్ని ఆధారాల్తో సహా జస్టిస్ కట్జూ గారు వివరించడం జరిగింది.  
ఆసక్తి ఉన్న వారు పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదువుకోవచ్చు. - 

http://www.kgfindia.com/kalidas-ghalib.php