Wednesday, September 4, 2013

ఎన్ కౌంటర్ హీరోలు !!!

'నిన్ను ఎన్ కౌంటర్లో లేపేస్తా' -  ఇది దాదాపు అన్ని భారతీయ భాషల్లోని సినిమాల్లోనూ , పోలీసు పాత్రలు చెప్పే  కామన్ డైలాగ్. ఇది ఎంతగా కామన్ అయిందంటే, ఏ మాత్రం ఇంగ్లీష్ రాని వారికి కూడా ఎన్  కౌంటర్ అనగానే, అదేదో బాగా తెలిసిన పదంలా, సమాజానికి మేలు చేసే  ఓ పవిత్ర కార్యమనే భావన కలిగేంతగా ఇది పాపులర్ అయింది.  ఎన్ కౌంటర్లకు పాల్పడిన పోలీసు అధికారుల జీవితాలే ఇతివృత్తంగా అనేక సినిమాలు కూడా రావడంతో, ఎన్ కౌంటర్ చేసేవారందరూ సినిమా హీరోల్లా నిజాయితీ కల పోలీస్ ఆఫీసర్లు  ఐనట్లూ,  ఎన్ కౌంటర్ లో చంపబడ్డవారందరూ సంఘ విద్రోహులైనట్లూ జనం ఆటోమాటిక్ గా నమ్మే పరిస్తితి ప్రస్తుతం నెలకొని ఉంది.  ఆక్స్ ఫర్డ్  డిక్షనరీ ప్రకారం 'ఎన్ కౌంటర్' అంటే, అనుకోకుండా, అప్రయత్నంగా జరిగే ఓ సంఘటన.  పోలీస్ పరిభాషలో 'ఎన్ కౌంటర్ కిల్లింగ్' అంటే, మరణ శిక్ష విధించదగిన తీవ్రత గల కేసుల్లో  అనుమానితున్ని పట్టుకునే క్రమంలోనో లేదా  అతడి బారి నుండి తమని తాము కాపాడుకునే ప్రయత్నంలోనో   ఆ అనుమానితుడు/నిందితుడు చనిపోవడం. తీవ్రవాదం, నక్సలిజం, మాఫియా లాంటివి పెచ్చుమీరుతున్న ప్రస్తుత సమాజంలో, వీటిని అరికట్టే క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ లకి పాల్పడటం కొన్ని సార్లు తప్పని సరి కావచ్చు. దీనిని ఎవరూ తప్పు పట్టలేరు, పైగా ప్రాణాలకి తెగించి  విధులని నిర్వర్తిసున్న  అటువంటి అధికారులని నిజంగా అభినందించవలసిందే.
కానీ ఇటీవల తరచుగా వార్తల్లో వినిపిస్తున్న మరో పదం - 'ఫేక్ ఎన్ కౌంటర్లు'.  అంటే , అప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్ని, కోర్టుల్లో హాజరు పరచకుండా, పోలీసులే చంపేసి, మృత దేహాల్ని  దూరదూరంగా పడేసి, వాటి పక్కన పిస్టల్లు , గ్రనేడ్లు లాంటివి ఉంచి సన్ని వేశాన్ని రక్తి కట్టించడం.  అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మరణించినవారు వారు  ఫలానా దళ సభ్యులనో,  ఫలానా గ్రూపు తీవ్రవాదులనో  చెప్పి, వీరిని ఎంకౌంటర్  చేయడం ద్వారా తాము ఓ  ఘనకార్యం చేశామని ప్రకటించేసుకోవడం.    జాతీయ మానవ హక్కుల కమీషన్  నివేదిక ప్రకారం, గడచిన నాలుగు సంవత్సరాలలో ఇలాంటి ఫేక్ ఎంకౌంటర్లు 550 జరిగాయి.   ఈ కేసుల్లో  చంపబడ్డ వారందరూ నిజంగా నేరస్తులేనా,  ఒకవేళ నేరస్తులే ఐతే ఆ నేర తీవ్రత ఎంత, దానికి తగ్గ శిక్ష ఏంటి,  ఇది తేల్చడానికి న్యాయస్థానాలు ఉండగా, పోలీసులే శిక్షలు  నిర్ధారించడం ఏమిటి,   ఒక వేళ ఆ చంపబడ్డ వారిలో ఎవరైనా అమాయకులు ఐతే, వారి చావుకు బాధ్యులు ఎవరు,  ఆ బాధితుల కుటుంబాలకు స్వాంతన చేకూరేది ఎలా?  అనేవి ఆలోచించాల్సిన ప్రశ్నలు. కానీ,  నానాటికీ విలువలు మంట గలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో  ఓ ఎన్ కౌంటర్, నకిలీదని తెలిసినా దానిని సమర్థించే వారి సంఖ్య గణనీయంగా ఉండడం , అందులోనూ ఉన్నత  విద్యావంతులే అధికంగా ఉండటం  శోచనీయం.  నేర విచారణలో విపరీత జాడ్యం, మత రాజకీయాలు విచారణా ప్రక్రియకి ఆటంకాలు కలిగించడం లాంటివి నకిలీ ఎంకౌంటర్ లని సమర్థిస్తూ వీరు వినిపిస్తున్న వాదనలు.  వీటిలో కొంత వరకూ వాస్తవం ఉన్నప్పటికీ, అసలు విచారనే లేకుండా శిక్షల్ని నిర్ధారించడం అనేది , విచారణలో ఆలస్యానికి ఎప్పటికీ పరిష్కారం కాబోదు.  అట్లే,  నిష్పాక్షిక విచారణ ద్వారా, ఎంత తీవ్రమైన శిక్షలు విధించి అమలు చేసినా సమాజంలోని అన్ని వర్గాల వారు ఆమోదిస్తారనేదానికి  , ఇటీవల ఉరిశిక్షలు విధించ బడిన కసబ్, అఫ్జల్ గురుల కేసులే నిదర్శనం..
 ఫేక్ ఎన్ కౌంటరలను కూడా రాజకీయాలకి వాడుకోవడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.  2002-06 మధ్య గుజరాత్లో జరిగిన 21   ఎన్ కౌంటర్లు ప్రస్తుతం వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి.   వీటిలో చాలా వరకూ  నకిలీ ఎన్ కౌంటర్లేనని ఇప్పటికే నిరూపితమైంది. ఐనప్పటికీ ఆ  మరణించిన వారికి  ఎక్కడో , ఎవరితో నో లింకులున్నాయనే, నిరూపితం కాని విషయాల్ని  పదే  పదే వల్లె వేస్తూ,  అ నకిలీ ఎన్ కౌంటర్లు అంత తీవ్రమైనవి కావని, పైగా వాటిమీద విచారణలు కూడా అనవసరం అనే విధంగా కొన్ని  రాజకీయ పార్టీలు, బాధ్యత కల స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతుండటం  విస్మయం గొలుపుతుంది.   మాలేగావ్, అజ్మీర్, మక్కా మసీదు లాంటి పేలుల్లలో నిందితులుగా విచారణ నెదుర్కొంటున్న సాధ్వి ప్రగ్నాసింగ్,  అసిమానంద లాంటి వారిని కూడా ఇలాగే  నకిలీ ఎన్ కౌంటర్ చేస్తే, అప్పుడు కూడా వీరు ఇదే వాదనని వినిపిస్తారా అనేదానికి జవాబు అందరికీ తెలిసిందే.
రాజకీయ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికో,  ప్రమోషన్లకోసమో,  లేక మీడియాలో పబ్లిసిటీకోసమో చట్టాల్ని రక్షించాల్సిన పోలీసులే నకిలీ ఎన్ కౌంటర్లకి పాల్పడటం అత్యంత అనాగరికం.    ఇలాంటి నకిలీ ఎన్ కౌంటర్లకి పాల్పడిన  పోలీసులని హత్యానేరం కింద విచారించాల్సిందేనని  సుప్రీం కోర్టు అనేక సార్లు అభిప్రాయపడింది.  అట్లే సినిమాలు, మీడియా నకిలీ ఎన్ కౌంటర్లని గ్లోరిఫై చేయకుండా  దానినో చట్ట వ్యతిరేక చర్యగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో, పొగతాగడం, మద్యం సేవించే సన్నివేశాలు వచ్చినప్పుడు , అది ఆరోగ్యానికి హానికరం అని కింద స్క్రోలింగ్ ఇస్తున్నట్లుగానే,   పోలీసు పాత్రలు నకిలీ ఎంకౌంటర్లకు పాల్పడుతున్న సన్నివేశాల్లో కూడా , అదో తీవ్రమైన చట్టవ్యతిరేక చర్యగా స్క్రోలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే 'నకిలీ ఎన్ కౌంటర్లను ' పూర్తిగా రూపుమాపడం సాధ్యమవుతుంది. 

Monday, July 8, 2013

నేను - సీమ - హైదరాబాదు!!!

నేను - సీమ - హైదరాబాదు!!!
మన జిల్లా పేరు ఏమిటి?
కడప జిల్లా.
మన రాష్ట్రం పేరు ఏమిటి?
ఆంధ్ర ప్రదేశ్.
మన రాష్ట్ర రాజధాని ఏది?
హైదరాబాద్.
ఏ క్లాసులో చదివానో గుర్తులేదు కానీ,  అలా మా పోరుమామిళ్ళ, ప్రభుత్వ పాఠశాలలోని, పూరి గుడిసెలో మొదటిసారిగా నాకు హైదరాబాదు పరిచయమైంది.  1980 దశకంలో పుట్టి,  తెలంగాణా,  ఆంధ్ర రాష్ట్ర అవతరణ, జై ఆంధ్రా ఉద్యమాల గురించి ఏమాత్రం తెలియక, మనది ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్  'మన' రాజధాని అనే ఊహతో పెరిగి పెద్దవాల్లైన  అనేక మంది ప్రస్తుత యువకుల్లో నేనూ ఒకడిని.
"ఒరే పిల్లలూ , హైదరాబాద్,- దేశంలోని గొప్ప నగరాల్లో ఒకటి. అక్కడ  400 ఏళ్ళక్రితం నిజాం నవాబులు కట్టించిన, ఎత్తైన చార్మినార్ ఉంటుంది, దాని మీదికి ఎక్కి చూస్తే  హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది .    నగరం మధ్యలో  హుస్సైన్ సాగర్ అనే పేద్ద  చెరువు ఉంటుంది.  దాని మధ్యలో NTR పెట్టించిన బుద్ధవిగ్రహం ఉంటుంది.  అక్కడికి బోటులో వెల్లి రావచ్చు.  ఇంకా  సాలార్జంగ్ మ్యూజియం , పబ్లిక్ గార్డెన్స్, బిర్లా మందిర్ ఇలాంటివి చాలా ఉన్నై. మనం  వచ్చేనెలలో హైదరాబాదుకి ఎస్కర్షన్ కి వెల్తున్నాం.  ఒక్కొక్కరు 200 రూపాయలిస్తే ఇవన్నీ చూపిస్తాం. "  ఎప్పుడూ చిరాగ్గా మొఖం పెట్టుకుని, ఎవడ్ని ఏ కారణంతో వాయిద్దామా అన్నట్లుండే మా ప్రభుత్వ పాఠశాల లెక్కల మాష్టారు , ఆ రోజు ప్రశాంత వదనంతో హైదరాబాద్ గురించి చెప్తున్న విషయాల్ని  మైమరచి వింటున్న నాకు ,   ఆ చివరిమాట  మాత్రం  శరాఘాతం లా తగిలింది. 200 రూపాయలు ఎంత పెద్దమొత్తమో తెలీదు కానీ, మా నాన్న ఇవ్వగలిగినంత చిన్నది మాత్రం కాదని తెలిసుండటం వల్ల.  అలా  హైదరాబాదు మొదటిసారి నన్ను నిరుత్సాహ పర్చింది. తర్వాత  1999 వ సంవత్సరంలో గానీ, నాకు భాగ్యనగరానికి వెల్లే భాగ్యం కలగలేదు- అది కూడా ఎంసెట్ ఇంగినీరింగ్ కౌన్సిలింగ్ కోసం. అక్కడి అభివృద్ధినీ, కాస్మోపాలిటన్ కల్చర్ నీ చూశాక,  అక్కడే చదవాలని మనసులో  అనిపిస్తున్నా,   మా వూరి నుంచి రాను  పోనూ చార్జీలు మరియు సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్  లెక్కేసుకున్నాక, మాకు దగ్గర్లోనున్న నెల్లూర్లో ఐతే బాగుంటుందని అక్కడి కాలేజీ సెలెక్ట్ చేసుకున్నాను. 
కడప, నెల్లూరు  పేరుకు రెండూ జిల్లా కేంద్రాలే, పైగా పక్క పక్కనే ఉంటాయి. కానీ నెల్లూరు  అన్ని విధాలుగా  కడప కంటే చాలా అభివృద్ధి చెంది ఉంటుంది.    నెల్లూర్ లో B.Tech జాయిన్ ఐన కొత్తలో  మా కడప విద్యార్థులం  ఎప్పుడైనా ఓ చోట గుమికూడితే ఈ విషయం గురించి మాట్లాడుకునే వాల్లం.   కోస్తా వాల్లు బిజినెస్ మైండెడ్ అనీ అందుకే వాల్లు బాగా డెవెలప్ అయ్యారనీ, మా సీమ మనుషులు   సెంటిమెంట్స్ కే ఎక్కువ విలువనిస్తారనీ, వారికి కపటత్వం తెలీదనీ అందుకే  వెనుకబడి ఉన్నారనీ మాకు మేము చెప్పుకుంటూ,  కోస్తా వారి మీద వివిధ రకాల జోకులు కూడా వేసుకుని ఆనందిచేవాల్లం.  ఇదంతా సరదాకే కానీ,  కోస్తాలో సీమ కంటే ముందు జరిగిన విద్యాభివృద్ధీ, అక్కడ  బ్రిటీష్ వారికాలంలోనే  ఏర్పాటైన రవాణా సౌకర్యాలు, విస్తారమైన, సారవంతమైన  భూములు, తీర ప్రాంతం  లాంటివి  వారి అభివృద్ధికి ప్రధాన కారణాలని మాకు తెలీక కాదు.ఆత్మస్థుతి-పరనిందలో అదోరకం తృప్తి ఉంటుంది కదా.
తర్వాత BTech 3 వ సంవత్సరంలో ఉండగా మా సీనియర్ పెళ్ళికి అదిలాబాద్ వెల్లడం జరిగింది.  హైదరాబాద్ దాటి ఇతర తెలంగాణా జిల్లాల్లోకి వెల్లడం అదే మొదటిసారి. అప్పటిదాకా కోస్తాలోని అభివృద్ధితో పోల్చుకుంటూ, మా రాయలసీమ  వెనుకబడిందని ఇంఫీరియారిటీలో ఉన్ననాకు,   తెలంగాణా  సీమకంటే కూడా  చాలా వెనుకబడి ఉందని అర్థం ఐంది.   అట్లే అక్కడి ప్రజల నిరక్షరాస్యత, వ్యవసాయానికి తగిన నీటిపారుదల వసతులు లేకపోవడం వంటివి ఆ వెనుకబాటుకు కారణాలైఉంటాయని కూడా  అనిపించింది.
ఖర్చుకు భయపడి నెల్లూర్ లో జాయిన్  అయ్యాననే గానీ, మనసంతా హైదరాబాద్లోనే ఉండేది. ఎప్పుడెప్పుడు BTech ఐపోతుందా, ఎప్పుడెప్పుడు  హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించి ఆ విశాలమైన  రోడ్లపై బైక్ వేసుకుని తిరుగుదామా అనిపించేది. మా ఇంజినీరింగ్ కాలేజ్ లోని అందరు విధ్యార్థుల ఆలోచనలూ దాదాపు హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుండేవి, US గురించి ఆలోచించే కొందరు సంపన్నుల బిడ్డలకి తప్ప.
సరిగ్గా  అలాంటి సమయంలోనే,KCR తెరాసను స్థాపించారు.  తెలంగాణాలోని ఊరూ,వాడా మరియు అక్కడి యూనివర్సిటీలు తిరిగి సీమాంధ్రోల్లు అలాంటివారనీ, ఇలాంటివారనీ, దొంగలనీ, దోపిడీ దారులనీ ఏవేవో లెక్కలు చెబుతూ, వారివల్లనే  తెలంగాణా వెనుకబాటుకు గురైందని చెబ్తుండేవాడు .  ఆయన మాటలు మా రాయలసీమ విధ్యార్థులం  కోస్తా వారిమీద వేసుకునే  కుల్లు జోకుల్లానే ఉండేవి.   ఓ ప్రాంతం అభివృద్ధికి కావలసిన విద్యావకాశాలు, పారిశ్రామిక, రవాణా,   నీటిపారుదల సదుపాయాలు, అవి సమకూర్చుకునే రాజకీయ చైతన్యం లేక ఓ ప్రాంతం వెనుకబడి ఉంటే, దానికి ఇతరప్రాంతం ప్రజలు ఎలా కారణమవుతారో  అస్సలు అర్థమయ్యేది కాదు. సీమాంధ్రుల కుట్రలు  అంటూ కేసీఅర్  చెప్పే చారిత్రక  విషయాలు ఒక్కోసారి సహేతుకంగానే అనిపించినా.. ఆ మరునాడే లగడపాటి, ఉండవల్లి, తలసాని స్రీనివాస్ వంటి వారు ఇచ్చే  వివరణలు,  కేసీఆర్ పై చేసే ప్రత్యారోపణలతో  'కుట్ర  ' కధనాలు నిరాధారమిపించేది.  కానీ వీరిలో ఎవరి వెర్షన్ నిజమైనదని  తేల్చుకోవడానికి ఆ  డాక్యుమెంట్లను,  గణాంకాలను  తిరగేసేంత  ఓపిక, తీరిక ఎవరికీ ఉండేది కాదు. 
పైగా సీమాంధ్ర ఉద్దంఢులైన  వైయెస్సార్, చంద్రబాబు లాంటి వారు కూడా కేసీఆర్ తో  వేదికల్ని పంచుకోవడంతో  కేసీఆర్ యొక్క విభజనవాదం అంత ప్రమాదకరమైందిగా ఎప్పుడూ అనిపించలేదు.  డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కానీ,  విభజన వాదం ఎంత తీవ్ర  స్థాయికి చేరుకుందో అర్థం కాలేదు.   అప్పటిదాకా మనదనుకున్న 'హైదరాబాద్ ' ఒక్కసారిగా పరాయిదవబోతుందన్న ఊహే చాలా కష్టంగా అనిపించింది.  అందుకే ఆ ప్రకటనకి వ్యతిరేకంగా ఉద్యమించిన లగడపాటి, జె.సి దివాకర్ రెడ్డి లాంటి  వారిని, ఇతర సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుల్ని మనసారా అభినందిచాలనిపించింది.  మొత్తానికి డిసెంబర్ 23  ప్రకటన ద్వారా  తెలంగాణా ఏర్పాటును విజయవంతంగా అడ్డుకోగలిగారు కానీ,  దగా పడ్డామనే భావన తెలంగాణా మిత్రుల్లో మరింత బలంగా  నాటుకుపోఇందనే విషయం    అక్కడ జరిగిన అసంఖ్యాక విధ్యార్థుల ఆత్మహత్యల ద్వారా స్పష్టమైంది.  ఇక అప్పట్నుండి  మాకు జరిగిన అన్యాయాలకు ఆధారాలు అంటూ వారి లెక్కల్తో వారు,  అవి అన్యాయాలు కాదంటూ వీరి లెక్కల్తో వీరు- ఎవరి లెక్కలు వారివే, ఎవరి వాదనలు వారివే.  ఎవరూ ఎవరి వాదనల్నీ వినే పరిస్థితి లేదని తేలిపోఇంది.    మీడియాలో, బ్లాగుల్లో, TV  స్టూడియోల్లో అన్నిట్లో ఇదే తంతు.  అలాంటి పరిస్థితుల్లో  మొదట ఎంతో ఆశాజనకంగా కనిపించిన  శ్రీక్రిష్ణ కమిటీ కూడా  సీమాంధ్ర నేతల విందు రాజకీయాల కారణంగా  ఎందుకూ కొరగానిదిగా మిగిలిపొఇంది. తాము కుట్రలకు, దోపిడీకి గురయ్యామనే భావన తెలంగాణా వాదుల మనసుల్లోనుండి పూర్తిగా తీసివేయబడనంతవరకూ,  'కలిసిఉంటే ప్రయోజనాల '  పేరుతో ఎన్ని లాజిక్కులు మాట్లాడినా ఫలితం  ఉండదు.  అట్లే  మేము విడిపోతాము మొర్రో అనే వారితో,  కలిసిఉండాల్సిందే అని వాదించడం ఏ ప్రజాస్వామిక చట్టాల ప్రకారం చూసినా విరుద్ధమే.    అపోహలూ, అపవాదులూ తొలగిపోకుండా ప్యాకేజీలతో  సమస్యను మరికొంత కాలం పాటు కప్పిపుచ్చవచ్చేమో గానీ,  ఓ 20 ఏళ్ళతర్వాత   మరో నాయకుడు, మరో నినాదంతో ఉద్యమాన్ని తిరిగి తోడడన్న గ్యారెంటీ లేదు. కావున ఈ సమస్యను  విభజనతోనే  శాశ్వతంగా పరిష్కరించడం అవసరం.   కానీ ఆ విభజన ఎలా ఉండాలి అనేది మరో చిక్కు సమస్యగా  మారింది. ఈ విషయంలో రాయలసీమ 4 జిల్లాల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.  తెలంగాణాతో ఉంటామంటే వారు ఒప్పుకోరు.  కోస్తాతో ఉందామంటే,   అభివృద్ధిలో  ఇప్పటికే ముందంజలో ఉన్న  ఆ ప్రాంత ప్రజలతో పోటీపడలేక మరింత వెనుకబాటుకు గురవుతామేమోననే అభద్రతా భావం.  పోనీ ప్రత్యేక రాష్ట్రంగా మనగలుగుతామని కనీసం మాకు మేము కూడా గట్టిగా చెప్పుకోలేని  పరిస్థితి.కావున గుడ్డిలో మెల్ల లా రాయలసీమను రెండుగా విభజించే 'రాయల తెలంగాణా' ఒక్కటే కాస్త మెరుగైన పరిష్కారంగా తోస్తుంది.  దీనితో రాయలసీమ  తన అస్తిత్వాన్ని కోల్పోతుందనే వాదనలో వాస్తవమున్నప్పటికీ,   మనుగడ సాగించడానికి కావలసిన వనరులు లేనప్పుడు అస్తిత్వం గురించి అదే పనిగా మాట్లాడటం అత్యాశే అవుతుంది.ఇప్పటికే ఎడతెగని ఉద్యమం ఫలితంగా రాష్ట్రం చాలా రకాలుగా నష్టపోతుంది. ఒకప్పుడు ITలో  దేశంలో మూడవ స్థానంలో ఉన్న హైదరాబాద్  క్రమంగా కిందికి జారుతుంది. గత కొన్ని సంవత్సరాలలో హైదరాబద్ లో చెప్పుకోదగిన పెద్ద కంపెనీ ఒక్కటీ  స్థాపించబడలేదు.  మంచి జీతం కావాలంటే చెన్నైకో, బెంగులూరుకో వెల్లక తప్పదనే పరిస్తితి ప్రస్తుతం నెలకొని ఉంది.    ఎద్దు పుండు కాకికి ముద్దన్నట్లుగా  ఉద్యమం మాటున మతతత్వ వాదులు తమ ప్రాబల్యం పెంచుకుంటూ పోతున్న సూచనలు భీతిగొలుపుతున్నాయి.   కావున సమస్య మరింత జటిలమై రాష్ట్రం మరింత సంక్షోభంలోకి  నెట్టివేయబడకముందే  దీనిని శాశ్వతంగా పరిష్కరించుకోవడం  అందరికీ ఉత్తమం.

Wednesday, January 30, 2013

ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అద్భుత వ్యాసం..


విశ్వరూపం గురించి( ఇంగ్లీష్ లో)



what is the movie about?
mainly its about Taliban terrorism targeting Americans. Hero is a RAW agent, who is helping FBI in dismantling terror networks.(RAW agent working for FBI.. hhmm but why..? is RAW more efficient than FBI..? Dont ask such logical questions. :)
How is the movie?
watchable once. gripping screenplay, with very little comedy.. on overall its a good suspense thriller
Is it about Muslims?
yes. but its about afghan Muslims, their lives, problems and about their association with terrorism.
Is anything wrong in the depiction of Muslims/Islam in the movie..?
who can say the depiction is wrong, when bomb explosions killing many innocents has become a routine activity in Pakistan and Afghanistan these days. Terrorism is a undeniable fact in some part of Muslim world, but the origin of this terrorism is not Islam, rather its because of the power politics of west. This movie shows only the effects of terrorism and not the origins. But no one can blame the director for not showing the origin, as its his pejorative about what to show and what not.
Then what is the controversy about its release in India?
The controversy is only in Tamil Nadu. there were demonstrations in other states too initially, but the respective state govts didn't take them seriously so the move got released and now running smoothly.
why TN took it seriously..?
Its well known fact that, AIDMK is going to have a tie-up with NDA after 2014 elections and its even going to support Mr.Modi as prime minister, an Idea which the minorities and mostly Muslims hate. So, Jayalalita govt is trying to do some balancing act now by banning this movie. probably she wants to show that she care for Muslims too, in this way.
Does the ban do any good to Muslims?
Absolutely NOT. these types of bans undermines democracy and free speech. These are a must for the survival of minorities, in multi-cultural societies.
What should Muslims do..?
ISLAM has a 1400 years of history and spawn across many geographic locations. Saying that- a 2.5 hour movie can harm Islam is meaningless. Its the 'narrow mindedness' and anti-democratic acts of Muslim's that harm ISLAM and not any movies/books etc. So, support Kamal Hassan and let the movie play.

Friday, January 11, 2013

అందుకే, హిందూ చదవమనేది..

"ఇద్దరు భారత సైనికుల్ని హతమార్చి, వారి తలల్ని తీసుకెల్లిన పాక్ దళాలు"- ఇది నిన్న దేశవ్యాప్తంగా అన్ని వార్తా పత్రికలలో ప్రముఖంగా వచ్చిన వార్త. అమాయకులైన మన సైనికులని, పాక్ దళాలు మన భూభాగంలోకి చొరబడి, నిర్ధాక్షిన్యంగా చంపడమే కాకుండా, రాక్షసంగా వారి తలల్ని కూడా తీసుకెల్లిన వైనాన్ని మన ఈనాడు లాంటి పత్రికలు కథలుకథలుగా వర్ణించాయి. ఆ కథనాలు చదివిన భారతీయులు ఎవరికైనా బాధ, ఉక్రోషం, ఏహ్యభావం కలగక మానవు. ఈనాడు, టైంస్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల ఆన్లైన్ ఎడిషన్లలో ఈ న్యూస్ కింద వున్న వందలాది రీడర్ కామెంట్లు చదివితే, ఈ వార్త చదువరుల్ని ఎంతగా కలిచివేసిందో, ఎంతగా రెచ్చగొట్టిందో ఇట్టే అర్థమవుతుంది. అమేరికా లాడెన్ ని హతమార్చినట్లుగానే, మనం కూడా విమానాల్తో కాల్పులు జరిపి  ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పే వారు కొందరైతే, పాకిస్తాన్ పై ఇక ఏమాత్రం పై ఆలస్యం చేయకుండా అణుబాంబుల్ని వేయాల్సిందేనని తీర్మానించే దేశభక్తులు మరికొందరు. పనిలో పనిగా, ఇటలీనుండి వచ్చిన సోనీయాగాంధీ వల్లనే ఇలా జరిగిందనీ, అదే మోడీ లాంటి నిఖార్సైన భారతీయుడు ప్రధాని ఐతే ఇలా జరగదనీ శవాలపై చిల్లర ఏరుకునే టైపు వారు మరికొందరు. సరే, ఈ  విషయాన్ని THEHINDU ఎలా కవర్ చేసిందో చూద్దాం. 
దానికి సంబంధించిన లింక్ - ఇక్కడ

ముఖ్యంగా హిందూ పత్రిక చెప్పేదేమంటే, ప్రస్తుత వివాదం ఒక్కసారిగా, పాక్ సైనికులు మన సైనికుల్ని హతమార్చడంతో మొదలైంది కాదు. ఒక చిన్న సంఘటనగా సుమారు 3 నెలల క్రితం మొదలైన పరిణామాలు, తరువాత ఇరువైపుల నుండి కవ్వింపు చర్యలు, చెదురుమదురు కాల్పులు జరిగి ఓ వారం క్రితం భారత సైన్యం చేతిలో ఓ పాక్ సైనికుడు మృతి, అనంతరం పాక్ సైనికులు మన భారత సైనికుల్ని హతమార్చడం వరకూ జరిగింది.  వారం క్రితం భారత సైన్యం చేతిలో పాక్ సైనికుడు మృతిచెందగా దీనిపై పాక్ ప్రభుత్వం  తన అసంతృప్తిని భారత్ కి తెలియజేసిన వార్తను, కేవలం THE HINDU మాత్రమే ప్రచురించిన విషయం ఇక్కడ గమనార్హం. మిగతా జాతీయ పత్రికలేవీ దీనికి ప్రాముఖ్యం ఇవ్వలేదు, ఇక మన ఈనాడు లాంటి పత్రికల గురించి ఐతే చెప్పక్కర్లేదు.  సరే , ఈ వార్త క్రింద కూడా రీడర్ కామెంట్లు ఉన్నాయి. వాటిని ఓ సారి చూడండి- అణుబాంబు, యుద్ధం, ప్రతీకారం లాంటి (దురా)ఆవేశ  కామెంట్లు ఇక్కడ కనబడవు. సమస్యను ఇంకా పెద్దది చేయకుండా ఇరు వర్గాలు సమ్యమనం పాటించి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా  ఇరు వర్గాలు శాంతి చర్చలకు పాల్గొనాలనే టైపు పాజిటివ్ దృక్పదంతో కూడిన మెచ్యూర్డ్ కామెంట్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి.     
ఈ ఒక్క విషయమే కాదు. ఇండియా-చైనా యుద్ధమైనా, అస్సాం మతకలహాలైనా, శ్రీలంకలో హింసాత్మక ఉద్యమమైనా, చార్మినార్ పక్కన దేవాలయ నిర్మానమైనా.... THEHINDU ఎప్పుడూ వాస్తవాలకీ , మానవ హక్కులకి ప్రధాన్యమిస్తుందే గానీ, కుహన దేశభక్తికీ,  ఆత్మస్థుతి-పరనింద లకు  పాల్పడదు. ఈ విషయం అనేక సార్లు నిరూపితమైంది. కాబట్టి, అసంబద్ధ, దురావేశాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా, సమ్యమనం, సౌభ్రాతృత్వం ల ప్రాతిపదికన అభిప్రాయాల్ని ఏర్పరచుకోవాలనుకునే వారందరూ , THEHINDUని క్రమం తప్పకుండా చదవవలసిన అవసరం ఉంది.