Monday, December 26, 2011

M.F.హుస్సేన్-తస్లీమా నస్రీన్ : మతం- రాజకీయం

M.F హుస్సేన్ అనగానే వివాదాలు గుర్తుకొస్తాయి. హుస్సేన్ గీసిన అనేక రకాల పైంటింగ్స్ లో బూతు బొమ్మల కింద వివాదాస్పద మైనవి కొన్ని మాత్రమే. అతను గీసినవన్నీ  దేవతల బూతు బొమ్మలే కావు, కేవలం వాటితోనే అతను పాపులర్ పైంటరూ కాలేదు. 
1996లో 'విచార్ మీమాంస ' అనే హిందీ పత్రిక, హుస్సేన్ గీసిన కొన్ని చిత్రాలను ప్రచురించి అతను హిందూ దేవతల్ని అవమానిస్తున్నాడని తీర్మానించడంతో వివాదం మొదలైంది. అప్పటి దాకా దేశంలో గొప్ప పైంటర్లలో ఒకడిగా వెల్గొందుతున్న హుస్సేన్, రాత్రికి రాత్రి హిందూ ద్వేషిగా ముద్ర వేయబడ్డాడు. శివసేన, భజరంగ్ దల్ లాంటి సంస్థలు  హుస్సేన్ ఇంటి మీద దాడిచేయడం, అతని ఆర్ట్ గ్యాలరీల్ని ధ్వంసం చేయడం లాంటివి చేయడంలో పోటీలు పడ్డాయి. ఈ బొమ్మలు గీసింది ఏ రమేశో, సురేశో ఐతే పరిస్తితి ఎలా ఉండేదో గానీ, 'హుస్సేన్ ' అనే పేరు కావడంతో ఇక ఎవరికీ అతను హిందూ దేవతల్ని అవమానిస్తూనే  గీశాడా లేదా అని  అణుమానించాల్సిన అవసరం  కనపల్లేదు. హుస్సేన్ మీద దేశంలోని అనేక కోర్టుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. దేశంలో అతని ప్రదర్శనల్ని ప్రతిసారీ ఆందోళనకారులు అడ్డుకోవడం జరిగింది. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన హుస్సేన్ దేశం వదిలి పారిపోయి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.
       
నిజానికి ఆ పత్రిక ప్రచురించిన హుస్సేన్ చిత్రాలు అతను 1970లో గీసినవి. 1970 నుండి, 1996లో ఓ పత్రిక ప్రచురించే వరకూ, ఈ 26 ఏళ్ళ కాలంలో  ఏ హిందువూ వాటిని చూడలేదా..? హుస్సేన్ ఆ చిత్రాల్ని ముస్లింలో, క్రిష్టియన్లో చూసి ఆనందించాలని రహస్యంగా గీశాడా..? వాటిని కేవలం అరబ్ దేశాల్లోనో, క్రిష్టియన్ దేశాల్లోనో ప్రదర్శనకి పెట్టాడా..?
హుస్సేన్ గీసిన ఈ చిత్రాలు ఆ 26 ఏళ్ళలో బారతడేశంలోనే, అనేక ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించబడ్డాయి. అనేక మంది వీటిని చూసి హుస్సేన్ ప్రతిభని కొనియాడారు. ఈ అనేక మందిలో, చిత్రకారులు, చిత్ర లేఖనం పట్ల ఆసక్తి కలవారు ఉంటారు. వీరిలో కూడా అత్యధికులు హిందువులే ఉంటారనేదాంట్లో సందేహం లేదు. పాపం వీరెవరూ ఆ చిత్రాల్లోని బూతుని కనిపెట్టలేక పోయారు, ఓ పత్రిక చెప్పేదాకా.. 


ఇక మరో వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన పుస్తకం 'లజ్జ ' లో ఇస్లాంకి వ్యతిరేకంగా రాసిందనే అభియోగం మీద అక్కడి మత సంస్థలు తస్లీమా తలకి వెలకట్టడంతో ఆమె బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి భారత దేశంలో తలదాచుకుంటుంది.
 హుస్సేన్, తస్లీమలను చూసే కోణాన్ని బట్టి దేశంలోని వివిధ వర్గాల/సంస్థల రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు.
హుస్సేన్ పై దాడులను సమర్థిస్తూ, అతన్ని దేశం నుండి తరిమి వేయడాన్ని తమ విజయంగా భావించే శివసేన, భజరంగ్ దల్, VHP లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ పై విమర్శల్ని మాత్రం మత మౌఢ్యంగా భావిస్తాయి. అట్లే ఆమెను  భారత దేశంలో  ఉంచుకోవడం గొప్ప మానవతా విషయంగా అభివర్ణిస్తాయి.  అదే సమయంలో హుస్సేన్ ని దేశం నుండి వెల్లగొట్టడాన్ని ఆటవిక చర్యగా భావించే MIM లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ ను మాత్రం భారత దేశం నుండి గెంటివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  


ఈ రెండు వివాదాల్లో అసలు కీలకాంశం ' మత విషయాల్లో కళాకారుల స్వేచ్చకు పరిమితులేమిటి, చట్టాలు, కోర్టులు ఇలాంటి విషయాల్లో ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చు' అనేది. నిజానికి ఇదేమంత క్లిష్టమైన విషయం కాదు. కాకపోతే ఇలాంటి వాటికి పరిష్కారాల్ని వెతికేటప్పుడు, మన మతం, అవతలి మతం అంటూ గిరి గీసుకుని ఆలోచించినంత కాలం విభిన్న మతాలు కల మన భారత దేశంలాంటి చోట్ల , వీటికి పరిష్కారాలు దొరకటం కష్టమే. పైగా 'ఎద్దు పుండు కాకికి ముద్దు' అన్నట్లు ఇలాంటి వాటిలో తల దూర్చి తమ రాజకీయ ప్రయోజనాల్ని నేరవేర్చుకోవడానికి ప్రయత్నించే రాబందులు ఉండనే ఉన్నాయి.. అన్ని చోట్లా, అన్ని వైపులా.. 

ఇలాంటి రాబందులకి లొంగకుండా ప్రజలు ఎంత మెచ్యూర్ గా ఆలోచించగల్గుతున్నారు అనే దాని మీదనే ఆ దేశ/సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే రవీంద్రుడు చెప్పినట్లు -  Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit...Into that heaven of freedom, my Father, let my country awake.. Aamen!!!  

Thursday, December 22, 2011

జస్టిస్ మార్కండేయ కట్జూ ఆలోచనాత్మక వ్యాసాలు.

మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ ఐన జస్టిస్ మార్కండేయ కట్జూ , భారతరత్న అవార్డు గురించి రాసిన ఆలోచనాత్మక  వ్యాసం ఇవాల్టి 'ది హిందూ'  లో ప్రచురితమైంది.

http://www.thehindu.com/opinion/op-ed/article2732614.ece 


జస్టిస్ కట్జూ 'కాలిదాస్-గాలిబ్ ఫౌండషన్' అనే సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ సామాజిక రాజకీయ  అంశాలపై లోతైన విశ్లేషణలతో రాసిన అనేక వ్యాసాలు-  http://www.kgfindia.com  అనే వెబ్ సైట్లో ఉన్నాయి. 

ఉదాహరణకి  భారత దేశంలో చరిత్ర బోధన గురించి  రాసిన వ్యాసం నుండి కొంత భాగం ఇలా ఉంది-


"1928లో, టిప్పుసుల్తాన్ గురించి నేను పరిశోధన చేస్తున్న టైంలో, ఒక విధ్యార్థి సమాఖ్యకు సంబంధించిన కొందరు తాము స్థాపించబోతున్న చరిత్ర సంబంధమైన ఒక సంఘ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. వారి దగ్గరున్న చరిత్ర పుస్తకంలో నుండి టిప్పుసుల్తాన్ గురించి రాసి ఉన్న ఒక వాక్యాన్ని చూసి దాదాపు నాకు కల్లు బైర్లు కమ్మినంత పనైంది. అది - "టిప్పుసుల్తాన్ 3 వేల మంచి బ్రాహ్మణుల్ని బలవంతంగా  ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించగా వారు ఆత్మహత్య చేసుకున్నారు అనేది" . ఆ టెక్స్ట్ బుక్ రాసింది మహామహోపాధ్యాయ హర్ ప్రసాద్ శాస్త్రి, కలకత్తా యూనివర్సిటీలో సంస్కృత శాఖాధిపతి. దేని ఆధారంగా ఆయన టిప్పుసుల్తాన్ గురించి ఈ వ్యాఖ్య చేశారో, దానిని నిరూపించే చారిత్రక ఆధారాలేమైనా ఉంటే తెలియజేయండని నేను వెంటనే శాస్త్రి గారికి రాయడం జరిగింది. ఇలా అనేక సార్లు అడగిన తర్వాత- మైసూరు గెజిట్ నుండి తీసుకున్నానని ఆయన నుంచి ప్రత్యుత్తరం వచ్చింది.   మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీకాంతియా ని ఈ విషయమై సంప్రదిస్తే, మైసూర్ గెజిట్లో ఏనాడు బ్రాహ్మణుల ఆత్మహత్యల గురించి రాలేదనీ, పైగా, విద్యార్థి దశలో మైసూరు చరిత్ర మీద తాను పరిశోధన చేశాననీ, ఇలాంటి సంఘటన ఏదీ మైసూర్లో జరగలేదని తాను కశ్చితంగా చెప్పగలననీ అన్నారు.   ఇంకా టిప్పుసుల్తాన్ ప్రధానమంత్రి-పునియా మరియూ సర్వ సైన్యాధిపతి- క్రిష్ణారావు ఇద్దరూ బ్రామ్హణులేననీ చెప్తూ, అప్పట్లో టిప్పుసుల్తాన్ 156 దేవాలయాలకు ప్రతి సంవత్సరం భరణం చెల్లించే వాడనీ ఆ దేవాలయాల లిస్టూ అట్లే శ్రింగేరి మఠాధిపతి జగద్గురు శంకరాచార్య గారితో టిప్పుసుల్తాన్ ఆత్మీయ సంబంధాన్ని తెలిపే ఉత్తరప్రత్యుత్తరాలకి  సంబంధించిన సుమారు 30 ఫోటో కాపీలను కూడా పంపించాడు.  
చరిత్రను వక్రీకరిస్తూ శాస్త్రి గారు రాసిన పుస్తకం అప్పటికే  బెంగాల్, ఒరిస్సా, యు.పి, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పాఠ్యాంశంగా బోదించబడుతుంది. అప్పటి కలకత్తా యూనివర్సిటీ VC-శ్రీ అశుతోశ్ ముఖర్జీ   గారికి, శాస్త్రి గారితో, మైసూర్ యూనివర్సిటీ VC -బ్రిజేంద్ర నాధ్ శీల్ గారితో, మరియూ ప్రొఫెసర్ శ్రీకాంతియా గారితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ ఇతర అధారాలనూ పంపించి అసత్యాలను ప్రాచుర్యంలోకి తెస్తున్న వారిపై చర్య తీసుకోవలసిందిగా కోరడం జరిగింది. అశుతోశ్ ముఖర్జీ గారు వెంటనే స్పందించి శాస్త్రి రాసిన పుస్తకాలన్నింటినీ పాఠ్యాంశాలనుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.  కానీ బాధాకరమైన విషయమేమంటే - విద్యార్థుల మనసుల్లో విద్వేషాల్ని నింపే  ఇలాంటి కట్టుకథలు ఇంకా అనేక పాఠ్యపుస్తకాలలో ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు."

భారత దేశం మీదికి దండెత్తి వచ్చిన తొలితరం ముస్లిం పాలకులైన ఘజనీ, ఘోరీ లాంటి కొందరు హిందూ దేవాలయాలను కూలగొట్టిన మాట వాస్తవమేననీ, కానీ ఆ తర్వాత ఇక్కడ రాజ్యస్థాపన చేసిన అనేక మంది ముస్లిం రాజులు హిందువులతో సఖ్యతను కొనసాగిస్తూ వారి సంస్కృతినీ, దేవాలయాలనూ పరిరక్షించారనీ, కానీ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నంత కాలం వారి మీద ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదని గ్రహించిన బ్రిటీష్ వారు, తమ 'విభజించి పాలించు' పధకంలో భాగంగా చరిత్ర వక్రీకరణకి పూనుకున్నారనీ వివరిస్తూ, వివిధ బ్రిటీష్ అధికారుల మధ్య ఈ విషయం గురించి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్ని ఆధారాల్తో సహా జస్టిస్ కట్జూ గారు వివరించడం జరిగింది.  
ఆసక్తి ఉన్న వారు పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదువుకోవచ్చు. - 

http://www.kgfindia.com/kalidas-ghalib.php    

Friday, August 26, 2011

ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు - అయ్యేపనేనా?



రిజర్వేషన్ల గురించి TVల్లో, వివిధ బ్లాగుల్లో ఎప్పుడు చర్చ జరిగినా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలనే ఒక వాదన చాలా మంది వినిపిస్తుంటారు. ఆర్థిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు అనేది ఓ మాంచి రొమాంటిక్ థాట్. ఆర్థికంగా వెనబడిన వాల్లకు రిజర్వేషన్లు ఇస్తాం, పేదోల్లెవరో వచ్చి క్యూ లో నిలబడండి అని ఒకసారి అనౌన్స్ చేసి చూడండి. బాగా డబ్బున్న మారాజులందరూ సొంత వాహనాల్లో వెల్లి, మేము చాలా పేదోల్లమంటూ క్యూ లో ముందు నిలబడ్తారు, చేతుల్లో MRO ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా.(MRO చేతిలో ఎంత ఎక్కువ పెడితే, మన ఆదాయం అంత తక్కువగా రాస్తాడనేది తెలిసిందేగా) పాపం నిజంగానే డబ్బులేనోల్లేమో బస్సుల్లో,పాసింజర్ రైల్లలో వెల్లి క్యూ లో ఆఖరున నిలుచుంటారు.

అసలు మనదేశంలో ఎవరిదగ్గర ఎంత సంపద ఉందో, ఎవరి ఆదాయం ఎంతో,వంశపారంపర్యంగా అప్పణంగా వచ్చి పడుతున్న ఆస్తులెంతో ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలున్నాయా? పన్నులు ఎగ్గొట్టడానికీ, ప్రభుత్వ సంక్షేమ పధకాలు పొందటానికి ఉన్న అదాయాన్ని/సంపదను బయటపెట్టకుండా, మేము పేదోల్లమని ప్రకటించుకోవడానికి ఏమాత్రం సంకోచం లేని 120 కోట్ల ప్రజలున్న దేశంలో, అసలు అలా ఆర్థిక వెనుకబాటు లిస్ట్ తయారు చేయడం సాధ్యమయ్యే పనేనా..?
సాధ్యం కాని ప్రాత్యమ్నాయాలతో ఆదర్శాలు వల్లెవేయకుండా ఉన్న వ్యవస్థను కొనసాగిస్తూనే దానిలోని లోపాలను సవరించడంపై దృష్టిపెడితే బాగుంటుంది.

Tuesday, August 16, 2011

ఎలక్షన్లు,పార్లమెంట్,అసెంబ్లీలను నిషేధించాలి!!!

తిండి మానేసి నేను చెప్పినట్లు చేయకుంటే చస్తానని బెదిరించే ప్రతివాడూ గాంధీగారిలా ఫీలైపోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని ఎవరు చేసినా వారికి గుడ్డిగా మద్దతు పలికే ప్రతిపక్షాలు, TRP రేటింగ్ల కోసం గోరంతను కొండత చేసి చూపడంలో పోటి పడుతున్న మీడియా, వీరందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న, తెలంగాణా ప్రకటించకపోతే చస్తానంటూ KCR నిరాహారదీక్షకు పూనుకున్నాడు. ఇంకేముంది పోతాండంట..పోబోతున్నాడంట..కోమా అంట.. అంటూ ఒకటే ఫ్లాష్ న్యూసులు. సహజంగానే చావు అనేది బలమైన సెంటిమెంట్ కాబట్టి ప్రజల్లో కూడా ఎక్కడలేని సానుభూతి. ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్లుగా, నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అంటూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.ఇక వేరే గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటన చేయడం, చర్చలు,సంప్రదింపులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ తర్వాత జరిగిన సంఘటనలు తెలిసిందే.
KCR దీక్ష నుండి స్పూర్తి పొందాడో ఏమో గానీ, అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్లుగా, ఇప్పటికిప్పుడే దానిని అంతమొందిస్తానన్నట్లుగా దీక్షలకు పూనుకుంటున్నాడు అన్నా హజారే. ఇక peepli live మీడియా, ప్రభుత్వానికి మైనస్ ఐతే, మనకు ప్లస్సే అనుకునే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.

సరే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అన్నా హజారే బృందం చెబుతున్నట్లుగా వారు తయారు చేసిన లోక్పాల్ బిల్లుని పార్లమెంటులో పెట్టి ఆమోదించేయడమా? ఇక ఆ తర్వాత వీరు మల్లీ ఇలాంటి దీక్షలకు పూనుకోకుండా మూటా ముల్లే సర్దుకుని,పౌర సమాజాన్ని మూసేసుకుని హిమాలయాలకు వెల్లిపోతారా..? లేక,  దేశ ప్రజలకు  ప్రభుత్వం పైన కంటే, ఇలాంటి పౌర సమాజం పైన మాత్రమే నమ్మకముంది కాబట్టి పార్లమెంటుని, అసెంబ్లీలని రద్దు చేసి, అన్నా హజారే గారి అధ్యక్షతన పౌరసమాజాన్నే పాలించమందామా..?
అన్నా హజారే దీక్షకు వస్తున్న స్పందనను చూసి, భవిష్యత్తులో మరికొంత మంది నాయకులు ఇలా దీక్షల బాట పడితే పరిస్తితి ఏంటి..?
ఉదాహరణకి ముంబై లోని మరాఠా ప్రజలకి అన్యాయం జరిగి పోతుందని బాల్ ధాకరే గారు మహారాష్ట్ర లోని ఊరూ వాడా తిరిగి, ఉన్నవి లేనివీ జనాలకి నూరిపోసి, ముంబై నుండి ఇతరుల్ని తరిమి వేయాలని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే..?
తమిళులకి దేశంలో తీరని అన్యాయం జరుగుతుందనీ, తమిలులకి, కాష్మీర్ తరహా ప్రత్యేక మినహాయింపులో,లేక ప్రత్యేక దేశమో కావాలని కరుణానిధి నిరాహార దీక్షకు పూనుకుంటే..?
దేశంలో రిజర్వేషన్ల వల్ల అగ్రకులాల యువకులకు తీరని అన్యాయం జరుగుతుందనీ, రిజర్వేషన్లను ఎత్తేయ్యాలనీ ఏ సుబ్రమన్య స్వామి లాంటి వారో ఆమరణ నిరాహార దీక్ష కి సిద్ధపడితే. సహాజంగానే అగ్రకులాల ప్రజలు ఆయన దీక్షకు మద్దతుగా తండోపతండాలుగా తరలి వస్తారు.ఇక peepli live మీడియా ఉండనే ఉంది.
ఇక అప్పుడు రిజర్వేషన్లను తీసేద్దామా..?

ఇప్పటికే ఎలక్షన్ల నిర్వహణకి బోలెడంత ప్రజాధననం ఖర్చవుతుందంట. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్లను నిషేధించి వాటి స్థానంలో దీక్షల పోటీలను  పెట్టాలి. అంటే ఎవరు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ నాయకునికి దేశంపైన,ప్రజలపైన అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు నిర్ధారించి వారికే పాలించే అవకాశం ఇవ్వాలి. జై దీక్షలు..జై జై దీక్షలు.

My previous post on the similar topic:

http://andamainacheekati.blogspot.com/2011/06/blog-post.html

Friday, July 29, 2011

ఆజాద్ చర్చలు - ఫ్లాప్ మూవీకి రీమేక్!!!

2010లో, తెలంగాణాపై తేల్చటానికని కేంద్ర ప్రభుత్వం ఓ ఐదుగురు తటస్థులతో నీతి నిజాయితీ గల నికార్సైన వ్యక్తిగా పేరున్న జస్టిస్ శ్రీక్రిష్ణ గారి అద్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు ఈ కమిటీ ఎదుట హాజరై తమ వాదనలు, అభిప్రాయాలు వెలిబుచ్చారు. దినపత్రికలు,వార్తలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఎవరికైనా అప్పట్లో చర్చల అనంతరం బయటికి వచ్చిన తెలంగాణా నాయకులు T.V మైకుల ముందు ఏమన్నారో గుర్తుండే ఉంటుంది. "కమిటీ సభ్యులు మేం చెప్పింది పూర్తిగా,శ్రద్ధగా విన్నారు", "తెలంగాణాకు అనుకూలంగా రిపోర్టు ఇస్తారని మాకు పూర్తి నమ్మకం కలిగింది" లాంటి అభిప్రాయాలు దాదాపు అందరి నోటినుంచి వచ్చాయి. KCRగారైతే మరో అడుగు ముందుకు వేసి, జస్టిస్ శ్రీక్రిష్ణ గారి నైతికత హిమాలయాలంత ఎత్తు అనీ, రిపోర్టును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగ ఇస్తారనే నమ్మకముందని స్టేట్మెంట్లిచ్చేశారు. ఇదే రకంగా సీమాంధ్రా నాయకులు,ప్రజాసంఘాల వాదనలు కూడా విన్న శ్రీక్రిష్ణ కమిటీ, తెలంగాణా వారు చెప్తున్న అన్యాయం,దోపిడీ లాంటివి వట్టిమాటలని తేల్చెశారు.ఇక అప్పటిదాకా శ్రీక్రిష్ణ మంచోడు,మంచోడు అన్న నోల్లే, రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించేసి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు చేశారో గుర్తుండే ఉంటుంది. "జస్టిస్ శ్రీక్రిష్ణ అమ్ముడుపోయారు"," శ్రీక్రిష్ణ కమిటీ దిక్కుమాలిన కమిటీ","సీమాంధ్ర నాయకుల ప్రలోభాలకు లొంగిపోయారు" లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో తె.గ నాయకులు పోటీ పడ్డారు.
ఇక మధుయాష్కీ ఐతే- సీమాంధ్ర నాయకులు శ్రీక్రిష్ణ కమిటీ సభ్యులకు దుబాయ్ లో ఫ్లాట్లు కొనిచ్చారనీ, దీనికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయనీ సమయమొచ్చినప్పుడు బయట పెడతాననీ నిస్సిగ్గుగా చెలరేగిపోయాడు. ఆ ఆధారాలు ఎప్పుడు చూపిస్తావని తర్వాత తెలంగాణాలో ఎవరూ మధుయాష్కీని అడగలేదు, ఈయన చూపించనూ లేదు. తమ ప్రజల అమాయకత్వం మీద ఈ నాయకులకి ఎంత నమ్మకమో!

ఇలాంటి నిరాధార,అడ్డగోలు ఆరోపణలతో శ్రీక్రిష్ణ రిపొర్టు 'ఓపెనింగ్స్ బాగున్నా, కమర్షియల్ గా ఫ్లాప్' ఐన సినిమాలా తయారయ్యింది.ఇక లేటెస్టు గా, ఈ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేయడానికన్నట్లుగా  ఆజాద్ మల్లీ చర్చలు షురూ చేసి, తె.గ కాంగ్రెస్ నాయకులతో గంటలు గంటలు మంతనాలు సాగించాడు. ఈ మీటింగుల నుంచి బయటికి వచ్చిన తె.గ నాయకుల స్పందన, శ్రీక్రిష్ణ కమిటీతో చర్చల అనంతరం లాగానే ఉంది. -"తరతరాలుగా తెలంగాణా కి జరిగిన అన్యాయాన్ని కల్లకు కట్టినట్లు ఆజాద్ కి వివరించాము, ఆయన చాలా శ్రద్ధగా విన్నడు.మద్యలో అక్కడక్కడా కంటతడి కూడా పెట్టిండు.( వెనక నుంచి- ముక్కు కూడా చీదుకున్నడు), కాబట్టి తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటడని మాకు పూర్తిగా నమ్మిక ఉన్నది". ఇక షరా మామూలుగానే తర్వాతి రీలు, సీమాంధ్ర నాయకులతో చర్చలు. వీరితో కూడా చర్చలు ముగించాక కాంగ్రేస్ హై కమాండ్ కి, ఆజాద్ రిపోర్టు సమర్పిస్తారట. ఈ రిపోర్టు కూడా ఎలా ఉండబోతుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఈ రిపోర్టును తయారు చేయటానికి ఆజాద్ 2 నెలలు సమయం కావాలన్నాడట. అంత టైం ఎందుకు అంటే రంజాన్ ఉంది కాబట్టి అనేది ఒక రీజను. రంజాను కీ, చర్చలకీ సంబంధం ఏమిటో..? ఉపవాసాలు ఉంటూనే,చర్చలు గట్రా చేయకూడదా..? ఏదేమైనా, ఆజాద్ నివేదిక ఎప్పుడు ఇచ్చినా.. శ్రీక్రిష్ణ కమిటీ లాగానే ఆజాద్ కూడా ఆరోపణలు,నిందలు భరించటానికి సిద్ధం కావాల్సిందే. "ఆజాద్ అమ్ముడు పోయాడు", "ఆజాద్ ద్రోహి"," ఆజాద్ కి సీమాంధ్రా నాయకులు చంద్ర మండలంలో ఫ్లాట్ కొనిచ్చారు,దీనికి మాదగ్గర బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి" లాంటి కామెంట్లు భవిష్యత్తులో బుల్లి తెర సాక్షిగా చూడాల్సి రావచ్చు. అప్పటిదాకా Lets wait and see..

Thursday, June 30, 2011

అవినీతి-దీక్షలు-ప్రజాస్వామ్యం-సినిమా!!!

ఫస్టాఫ్ లో ఎక్కడ చూసినా అవినీతి,అరాచకత్వం రాజ్యమేలుతుంటుంది. ప్రజలందరూ, ఈ అవినీతి వల్ల నానాకష్టాలు  పడుతుంటారు.ఇదంతా చూసి మన హీరో గారికి రక్తం ఉడికి పోతుంటుంది. చూసే ప్రేక్షకులకి కూడా సేం ఫీలింగ్... ఇంటర్వెల్ కి ముందు ఓ పెద్ద ట్విస్ట్. అప్పటిదాకా సాధారణ వ్యక్తిగా ఉన్న మన హీరో గారికి ఓ మంత్రదండం లాంటి అతీత శక్తో, లేక రాత్రికి రాత్రి, CMగానో,PMగానో మారిపోవడమో జరుగుతుంది. దానితో మన హీరో గారు రెచ్చిపోయి, "ఇక అవినీతి పరుల భరతం పడతానని ఓ పంచ్ డైలాగ్ తో శపధం చేస్తాడు. చూసే జనాలకి ఎక్కడలేని ఎక్సైట్మెంట్!!  ఇక సెకండ్ హాఫ్ లో, అవినీతి పరులతో హీరోచితంగా పోరాడి, మొత్తానికి సినిమా ఐపోయే టయానికి అవినీతిని, సంస్కారవంతమైన XXX సబ్బుతో కడిగినట్లు, కడిగిపాడేస్తాడన్నమాట.ప్రేక్షకులు మస్తు ఖుష్, సినిమా బంపర్ హిట్!!.ఇది ఇప్పటికే దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ టెస్టెడ్ సక్సెస్ ఫార్ములా. రీల్ లైఫ్, రియల్ లైఫ్ వేర్వేరని తెలిసినా, ఒక్కోసారి రీల్ లైఫ్ లోలాగా రియల్ లైఫ్ లో జరిగితే బాగుంటుందనిపిస్తుంది. అవినీతి పై యుద్ధం చేస్తానని ఎవరైనా ప్రకటించగానే, సినిమాల్లో హీరో  లాగా, వీరు కూడా విజయం సాధిస్తే అవినీతి పూర్తిగా అంతమైపోతుందేమోననే చిన్న ఆశ అందర్లోనూ.
 “ఆయనెవరో అవినీతి మీద యుద్ధం ప్రకటించాడంట, అవినీతి అంతమయ్యే వరకూ అన్నం ముట్టనని, గాంధీ గారిలాగా దీక్ష చేస్తున్నాడంట, అదేదో బిల్లు తెమ్మని అడుగుతున్నాడంట, దానికి మన పెబుత్వమోల్లు ఒప్పుకోవడం లేదంట, ఆ బిల్లు గాని తెస్తే, లోక్ పాల్ అని ఎవరో ఒకాయన వస్తాడంట, అవినీతి పరుల్నందర్నీ చిన్న పెద్ద తేడాల్లేకుండా ఎక్కడికక్కడే శిక్షిస్తాడంట, అలాగ్గాని  చేస్తే మన దేశంలో అవినీతి అనేదే ఉండదంట.
జై దీచ్చ, డౌన్ డౌన్ పెబుత్వం”.  - ఇదీ ఇంటర్నెట్లోని వివిధ సైట్లలో మెజారిటీ నెటిజన్ల కామెంట్ల సారాంశం.
                                                  
దీక్షాసీనులు, వీరి మద్దతుదార్లు అందరూ 'పౌర సమాజం' అని ఓ పేరు పెట్టేసుకుని, మేము చెప్పినట్లు బిల్లు తెస్తారా లేక మల్లీ దీచ్చ చేయాల్నా అని, ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నారు. ఈ సమాజమోల్లు చెప్పేది వినడానికి బాగానే ఉంది కానీ, కాస్త లోతుగా అలోచిస్తేనే, బొమ్మకున్న మరో కోణం పై అణుమాణాలు కలిగేది.

ఇంతకూ ఈ లోక్ పాల్ ని ఏ స్వర్గం నుంచి, ఎవరు పట్టుకొస్తరు?

ప్రధాన మంత్రి పైన ఐనా, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులపై ఐనా సూమోటో గా కేసులు బనాయించే అధికారం, శిక్షలు వేసే అధికారాలు కూడా కావాలంటున్న ఈ లోక్పాల్ ని ఎవరు ఎలా నియమిస్తారనే దానిమీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  పౌర సమాజ ప్రతినిధులు చెప్పేదాని ప్రకారమైతే,  లోక్ పాల్ సెలెక్షన్లో ప్రజలకు గానీ,ప్రజా ప్రతినిధులకు గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అంటే,ప్రజల చేత ఎన్నుకోబడిన MPలు,MPల చేత ఎన్నుకోబడిన PM, Cabinetలు ఓ పక్క, వీరితో సంబంధం లేకుండా వీరందరికంటే ఎక్కువ అధికారాలుగల లోక్పాల్ మరో పక్క అన్నమాట. ఇన్ని అధికారాలుగల లోక్పాల్ కి కుల,మత,ప్రంతీయ రాగ ద్వేషాలు గాని ఉంటే, ఇక అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ఇలాంటి రాగ ద్వేషాలు లేని నిఖార్సైన వ్యక్తి ఐనంతవరకూ ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.  అలాంటి నిఖార్సైన వ్యక్తిని ఎవరు,ఎలా ఎన్నుకుంటారనేది అసలు సమస్య. 
ఉదాహరణకి, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో NDA అధికారంలోకి వచ్చిందనుకుందాం. అప్పుడు లోక్ పాల్ గా ఏ కాంగ్రేస్ పార్టీ  సానుభూతిపరుడో ఉంటే పరిస్తితి ఎలా ఉంటుంది? కాంగ్రేస్ పార్టీ వారు ప్రతి రోజూ NDA ప్రధాని మీద ఏదో ఒక ఆరోపణ చేయడం, దాని ఆధారంగా లోక్ పాల్ ప్రధానిని విచారించడం,విసిగించడం.. వీలైతే మార్చమని అడగటం..ఇదీ తంతు.

లోక్పాల్ పాపాల్ చేస్తే..?

 "మానవుడు పాపి, పాపాల్ చేయని మానవుడు ఎవడూ ఉండడు" అని K.A.పాల్ చెప్పినట్లుగా, లోక్పాల్ ఏ మైనా తప్పులు చెస్తే, అతన్ని శిక్షించే అధికారం,పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికుంది అనే దాని మీద, పౌర సమాజా ప్రతినిధులక్కూడా స్పష్టత ఉన్నట్లులేదు. ఒక వేల, లోక్ పాల్ ని శిక్షించే అధికారం ప్రధాన మంత్రికి కానీ, న్యాయ వ్యవస్థ కి కానీ  ఉందనుకుంటే, వీరిని మల్లీ లొక్ పాల్ కిందికి తేవాలనడం అర్థరహితం. నీతి,నిజాయితీలతో పనిచేస్తామని ప్రజల వోట్లతో గెలిచి, మల్లీ ఐదేల్ల తర్వాత ప్రజల ముందుకెల్లాల్సి ఉంటుందని తెలిసిన ప్రజాప్రతినిధులే ఇంతలా అవినీతికి పాల్పడుతున్నప్పుడు, ఇవేవీ లేకుండా ఎవరో కొందరు వ్యక్తులు అపాయింట్ చేసిన ఓ అధికారి మాత్రం నీతిగా,ప్రలోభాలకు లొంగకుండా ఉంటాడని ఎలా నమ్మడం?  
ఇంతకూ వీరు ఎలక్షన్స్ లో ఎందుకు నిలబడరు?

 
ప్రజాస్వామ్యము, ఎన్నికలలో పోటీ చేయడం వంటి వాటిమీద, ఈ దీక్షాసీనుల అభిప్రాయం కాస్త కంఫ్యూజింగ్ గా ఉంది. తమకు 100 కోట్ల భారతీయుల మద్దతు ఉందనీ, తమ మీద దాడులు చేసినా,తమ అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోకున్నా దేశ ప్రజల్ని అవమానించడమే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. వీరికి అంత మంది మద్దతు ఉన్నప్పుడు, వీరే ఎలక్షన్లలో నిలబడవచ్చు కదా? నిజంగానే అంత మంది మద్దతిస్తే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బంపర్ మెజారిటీతో గెలిచి వీరే అధికారం లోకి రావచ్చు. అప్పుడు ఎన్ని బిల్లులైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దానికి మహా అంటే మరో 5 ఏల్లు పట్టవచ్చు. అవినీతిని ఇన్నేల్లు సహించాక, మరో 5 ఏల్లు ఆగలేరా..?  అప్పట్లో అంటే, చట్టం బ్రిటీష్ వారిది కాబట్టి, మరో దారి లేక గాంధీ గారు నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న చట్టం మనం రాసుకున్నది. ప్రభుత్వ పరిపాలనలో ఏమైనా లోపాలున్నాయనుకున్నప్పుడు, ఆ లోపాలేవో జనాలకు వివరించి, జనం మద్దతు ఉందనుకుంటే ఎవరైనా సరే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి, ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. దీనికి కాస్త సమయం పట్టవచ్చేమో కానీ, అసాధ్యం మాత్రం కాదు.    ఈజిప్ట్,లిబియా,టూనీషియా,బహ్రైన్ లాంటి చిన్న,చిన్న దేశాలు కూడా తమకు ప్రజాస్వామ్యం కావాలని ఉద్యమాలు చేస్తుంటే,మన దేశంలో మాత్రం, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కంటే, సర్వాధికారాలు కల ,ప్రజలతో ఎన్నుకోబడని డిక్టేటర్ లాంటి వ్యవస్థ కావలని ఉద్యమాలు జరుగుతుండటం శోచనీయం.


ఏదేమైనా, అవినీతి పైన దేశ ప్రజలకు ఎంత ఏహ్యభావం, ఆగ్రహం ఉందో నిరూపించడంలో మాత్రం, పౌర సమాజ ప్రతినిధులు పూర్తిగా విజయం సాధించారు. దానికి వీరిని  అభినందించవలసిందే. అట్లే అవినీతిని అరికట్టడానికి తీసుకునే ఏ చర్య ఐనా, ప్రజాస్వమ్య చట్టాలకు లోబడి, ప్రజాస్వామ్యాన్ని బలపరిచేదిగానే ఉండాలితప్ప , బలహీన పరిచేదిగా మాత్రం ఉండదని ఆశిద్దాం.

Monday, March 7, 2011

మనకు అనుకూలంగా ఉన్నదే సరైన తీర్పా..?

ఏదైనా నేరం జరిగితే, ఆ నేరం చేసినవారి, అట్లే ఆ నేర బాధితుల కుల,మత,ప్రాంతాలతో, మరియు డబ్బు,హోదా వంటి సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆ నేరస్థులు నేరానికి తగ్గ శిక్ష అనుభవించేలా చేయగలగడం  ఏదైనా అభివృద్ధి చెందిన సమాజానికి,గొప్ప సంస్కృతికి ఉండాల్సిన ప్రధాన లక్షణం.నేరం చేసిన వారిని శిక్షించడం ఎంత అవసరమో, నేరం చేయని అమాయకులని ఆ నేరానికి బాధ్యులని చేస్తూ శిక్షించకుండా ఉండటం అంతే అవసరం. ఈ విషయాన్ని దృష్ఠిలో ఉంచుకునే మన న్యాయ శాస్త్ర చట్టాలు రూపొందిచబడ్డాయన్నది సుస్పష్టం. ఈ చట్టాలని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు,న్యాయవాదులు మరియు న్యాయమూర్తుల మీద ఉంది. కానీ, వీరు కూడా మానవ మాత్రులే కాబట్టి, కులం,ప్రాంతం,మతం,డబ్బు,హోదా లాంటి వాటికి అతీతమైన వాల్లు కాదు కాబట్టి, కొన్ని సార్లు చట్టం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. దీని వల్ల కొన్నిసార్లు నేరస్థులు తప్పించుకోవచ్చు, అట్లే, నేరంతో సంబంధం లేని అమాయకులు బలిపశువులు కావచ్చు.ఈ విషయాన్ని దృష్ఠిలో ఉంచుకునే మన రాజ్యాంగ నిర్మాతలు, న్యాయవ్యవస్థను వివిధ అంచెలుగా తీర్చిదిద్దారు. న్యాయ వ్యవస్థ మెజిస్ట్రేట్,సెషెన్స్,హైకోర్ట్,సుప్రీం కోర్ట్ ఇలా వివిధ స్థాయిల్లో విభజించబడింది.ఏదైనా ఓ కోర్ట్లో తమకు న్యాయం జరగలేదని భావించిన వాల్లు ఎవరైనా సరే పై కోర్ట్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా కాకుంటే ఆపై కోర్ట్ కు, ఇలా సుప్రీం కోర్ట్ వరకు కూడా వెల్లవచ్చు.దీని వల్ల కాలయాపన జరగవచ్చేమో కానీ, అన్యాయం న్యాయం కాకూడదనే ఉదాత్త ఆశయానికి ఇది తప్పనిసరి.పై కోర్టులు, క్రింది కోర్టుల తీర్పుని సమర్థిస్తూనే ఇంకా తీవ్రమైన శిక్షని విధించిన సంధర్భాలూ, క్రింది కోర్టుల తీర్పులకి పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సంధర్భాలూ కూడా చాలానే ఉన్నాయి. జెస్సికా లాల్ కేసు దీనికొక చక్కని ఉదాహరణ. మొత్తం మీద , ఏదైనా క్రింది కోర్టు తీర్పుతో విభేదించటం అనేది తప్పో,చట్ట వ్యతిరేకమో కాదు. కానీ, ఈ విభేదించటం, పై కోర్ట్ కి అప్పీల్ చేసుకోవడం లాంటివి ఓ పద్దతి ప్రకారం చట్టానికి లోబడి జరగాలే కానీ, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. ఎందుకంటే, తీర్పు మనకు నచ్చలేదు కదా అని న్యాయ వ్యవస్థని నిందించటం/అగౌరవ పరచటం అంటే, కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే.


ఉదాహరణకి, ఇటీవలే గోధ్రా రైలు దుర్ఘటనకి సంబంధించి ఓ సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. కొందరు తీర్పుని స్వాగతించారు, కొందరు అసంతృప్తి ప్రకటించారు. అసంతృప్తులు పైకోర్ట్ కి అప్పీల్ చేసుకుని రీట్రైల్ కోసం ప్రయత్నించుకోవచ్చు. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సాక్ష్యాధారాల్ని మరింత క్షున్నంగా పరిశీలించి పై కోర్ట్లు తీర్పు ప్రకటిస్తాయి కాబట్టి, నిజంగానే వారు నేరస్థులైతే, శిక్ష నుంచి  తప్పించుకోలేరు. అట్లే, ఆ రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల పైనా, అజ్మీర్,మాలేగావ్ లాంటి బాంబు పేలుల్ల గురించీ వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో వాటి తీర్పులు వెలువడినప్పుడు కూడా, కొందరు సోకాల్డ్ నాయకులు, బ్లాగర్లు   ఇలాగే  కోర్ట్ తీర్పుని వ్యతిరేకిస్తూ, ఇది కొందరి ఓట్ల కోసం జరుగుతున్న కుట్ర అనీ, ఓ మతం పై జరుగుతున్న దుష్ప్రచారం అనీ ఆవేశంగా స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ , అప్పుడు కూడా.. ఎవరి Programed Mindని బట్టి వారు రియాక్ట్ అవడమూ, రెచ్చిపోయి కామెంట్లు రాయడమూ చేస్తారు. ఏదేమైనా, సత్యమేవ జయతే అని ఆశిద్దాం.

Monday, February 14, 2011

ప్రాణం ఖరీదు!!!

ఇటీవల ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా 'No one killed Jessica' అనే సినిమా వచ్చింది. 1999 లో, అర్థరాత్రి టైం దాటి పోవటం వల్ల లిక్కర్ అమ్మడానికి నిరాకరించిన పాపానికి, ఓ హర్యానా మంత్రి కొడుకు చేతిలో హత్యకావించ బడిన 'జెస్సికా లాల్ ' ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. సుమారు 300 మంది ఉన్న ఆ పార్టీలో, అంత మంది ప్రత్యక్ష సాక్షుల కల్ల ముందే ఈ హత్య జరిగినప్పటికీ, మంత్రి గారి డబ్బు,అధికారానికి భయపడి ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోవటంతో, క్రింది కోర్టు మంత్రి గారి కొడుకును, అతనికి సహకరించిన అతని మిత్రుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తర్వాత NDTV మరియు ఇతర జాతీయ మీడియా 'ఓ అమ్మాయి ప్రాణం ఖరీదు, ఓ లిక్కర్ బాటిల్ తో సమానమా..? అంటూ దీనికి విషేశ ప్రాధాన్యం కలిగించడంతో, ప్రజాభి ప్రాయానికి తలవంచిన హైకోర్టు కేసును పునర్విచారన చేసి, మంత్రి కొడుకుకి యావజ్జీవ శిక్ష విధించటం జరిగింది.ఇలా ఏ తప్పూ చేయకపోయినా, అర్ధాంతరంగా తనువు చాలించిన జెస్సికా మీద మొదట్లో చాలా సానుభూతి కలిగినప్పటికీ, నేరం చేసిన వాడు మంత్రి కుమారుడైనా చట్టం అతడిని శిక్షించగలిగిందనే  తృప్తి కలిగేలా ఈ సినిమా రూపొందించబడింది. మీడియా చివరివరకూ పోరాడటం వల్ల జెస్సికా మృతికి బాధ్యులైన వారిని చట్టం శిక్షించగలిగింది. కానీ ఈ మాత్రం అవకాశం కూడా లేని దురదృష్ట జెస్సికాలు ఇంకెంత మంది ఉన్నారో..?
#కొన్నేల్ల క్రితం సినీ హీరో బాలక్రిష్ణ ఇంట్లో కాల్పుల ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బాలక్రిష్ణ ఇంటి వాచ్ మేన్ హత్య చేయబడ్డాడు. కొన్ని రోజులు హడావుడి చేసిన తెలుగు మీడియా తర్వాత ఈ విషయాన్ని అటకెక్కించేయటం తో, ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలీదు.ఇక్కడ ఒక పేద వాచ్ మేన్ ప్రాణం ఖరీదు ఎంతో ఎలా చెప్పడం..?
#మొన్న ముంబై మీద 11 మంది తీవ్రవాదులు చేసిన దాడిలో సుమారు 200 మంది అమాయకులు మరణించారు. ఆ తర్వాత భద్రతా దలాల చేతిలో 10 మంది తీవ్రవాదులు హతమయ్యారు. అంటే ఒక్కో తీవ్రవాది ప్రాణం ఖరీదు 20 మంది ప్రాణంతో సమానమా..? ఇక్కడ బాధితులకి పూర్తి న్యాయం జరిగిందనుకోవాలా..? మరి అన్యాయానికి  బాధ్యులు ఎవరు..?
#అట్లే ప్రతినిత్యం ఎంతో మంది అమాయకులు బూటకపు ఎన్కౌంటర్లలోనూ,ఇంఫార్మర్లు,కోవర్టులనే  నెపంతోనూ, కాష్మీర్ లాంటి చోట్ల భద్రతాదళాలు,టెర్రరిస్ట్ ల చేతుల్లో అసువులుబాస్తున్నారు. మరి వీరందరి చావులకూ అకౌంటబిలిటీ ఉంటుందా..? వీరి ప్రాణాలకు విలువ లేదా..?
#మొన్నటికి మొన్న, సామూహిక జనహనన ఆయుధాలున్నాయనే నెపంతో, అగ్రరాజ్యాలు ఇరాక్ మీద చేసిన అక్రమ యుద్ధంలో మరణించిన వేలకొద్దీ అమాయక ప్రజలకు, అవిటివాల్లైన పసిపిల్లలకు న్యాయం చేసేదెవరు..? మేమనుకున్నట్లు అక్కడ మరు భూములు తప్ప, మారణాయుధాలు లేవు, చిన్న పొరబాటు జరిగింది అని అమెరికా అధ్యక్షులవారు ఇచ్చిన వివరణ, పోయిన ప్రాణాలకు ఖరీదు కట్టగలదా..?

Tuesday, January 25, 2011

మీకు దేశభక్తి ఉందా? ఉంటే, ఎన్ని కిలోలు/లీటర్లు/మీటర్లు..?

'దేశభక్తి ' బాగా పరిచయం ఉన్నపేరులాగే అనిపిస్తుంది. మీకు దేశభక్తి ఉందా..? అని ఎవరైనా అడగ్గానే, 'ఉంది ' అని ఏమాత్రం ఆలస్యం లేకుండా చేప్పేస్తాం. ఉంటే చూపించండి అనిగానీ, ఎంత ఉందో చెప్పండి అనిగానీ అడిగారంటే మాత్రం, ఏం చెప్పాలో తెలీక, అడిగిన వాన్ని ఓ వింత చూపు చూస్తాం.బ్రిటిష్ వాల్లు ఇండియాలో ఉండే టైంలో, వారి మీద దాడి చేసి అల్లూరి సీతారామరాజు,భగత్ సింగ్ లాంటివారు.. వారిని ఎదిరించి, వారికి సహాయనిరాకరణ చేసి గాంధి,నెహ్రూ లాంటి వారు తమ దేశభక్తిని చాటుకున్నారట.
వారి హీరోచిత కథల్ని,గాధల్ని చిన్నప్పుడు స్కూల్లో, ఆగస్ట్15, జనవరి26 నాడు టీచర్ల ఉపన్యాసాల సందర్భంగా వినటం వల్లా, దేశభక్తిపూరిత సినిమాల్ని,పాటల్ని బాగా చూసివుండటం వల్లా, దేశభక్తి అంటే,అదేదో తప్పక ఉండాల్సిన విషయమనీ, మన చుట్టూ ఉన్నోల్లందరూ అది తమకు బోలెండంత ఉంది అన్నట్లుగా ధీమాగా ఉండటం వల్ల, అది మనకు కూడా ఉండే ఉంటుందిలే అనీ డిసైడ్ అయిపోతాం. దేశభక్తి ఉందా లేదా అనే విషయంలో ఎవరికీ అణుమానాలు లేవు కానీ, దేశభక్తిని వ్యక్తపరచటం ఎలాగా..? దేశాన్ని ప్రేమించటం అంటే ఏంటి..? అనే దాంట్లో మాత్రం మనలో చాలా మందికి స్పష్టత ఉన్నట్లు లేదు.స్పష్టత లేనంత మాత్రాన, లోపలున్న ఎమోషన్ సైలెంట్ గా ఉండనీదు కాబట్టి, మనకు ఈజీగా అనిపించిన కొన్ని యాక్టివిటీస్ తో మన దేశభక్తిని బయటపెట్టుకుంటుంటాం.
ఇండియా ఆడే అన్ని క్రికెట్ మ్యాచులూ చూస్తూ, ఇండియా గెలుస్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోతూ, గెలిస్తే సంతోషించి, ఒకవేళ ఓడిపోతే బాధ పడిపోయి, దేశం పట్ల తమ ప్రేమను చూపిస్తున్నామనుకుంటారు కొందరు. దేశభక్తి ఉందని నిరూపించుకోవాలంటే వందేమాతరం పాడాల్సిందేనని వాదించటం, ఒక వైపు మనభారతీయుడు USలో ఒక స్టేట్ కి గరర్నర్ గా నియమితులయ్యారని చంకలు గుద్దుకుంటూనే, మరోవైపు విదేశీయురాలైన సోనియాగాంధీ మన దేశంలో పెత్తనం చెలాయించటం ఏమిటని ఆక్రోశించటం,అవకాశం దొరికినప్పుడల్లా, అవినీతి,స్వార్థం,కుల,మత రాజకీయాల గురించి ఆవేశంగా లెక్చర్ దంచేసి,దేశం నాశనమై పోయిందని డిక్లేర్ చేసేయడం.. ఇలాంటివి తమకు దేశభక్తి మెండుగా ఉందనుకునేవారు చేస్తున్న కొన్ని యాక్టివిటీస్.
నిజానికి, ఇవన్నీ దేశభక్తి అవునో కాదో చెప్పలేం కానీ,ఇవి చేయడం వలన దేశానికి ఉపయోగం కానీ, చేయక పోవడం వలన దేశానికి వచ్చే నష్టం కానీ ఏమాత్రం లేదనేది నిస్సందేహంగా నిజం.మరో ముఖ్య విషయమేమిటంటే,ఇలాంటి 'ఈజీ దేశభక్తి' ని ప్రదర్శిస్తున్న వారిలో బాగా చదువుకున్నవారే ఎక్కువగా ఉండటం.  'ఆంగ్లేయులు' అనే ఉమ్మడి శత్రువు దేశం నుండి వెల్లిపోయిన తర్వాత, దేశభక్తిని,దేశంపై ప్రేమను నిర్మాణాత్మకంగా ఎలా ప్రకటించవచ్చో దేశ యువతకు అర్థమయ్యేలా చెప్పకపోవడం మన విద్యా వ్యవస్థ వైఫల్యంగా చెప్పుకోవచ్చు.


స్వతంత్ర్యమంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కాదు!!!
1947 ఆగస్ట్15న మనకు స్వతంత్ర్యం వచ్చిందని,1950 జనవరి 26 నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందనీ మనందరికి తెలుసు.స్వతంత్ర్యమంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కాదు. ఓ సామాజిక ఒప్పందానికి లోబడి అందరూ ఉండటం. ఆ ఒప్పందాన్నే 'రాజ్యాంగం' అంటున్నాం.కుల,మత,ప్రాంత వివక్షలు లేకుండా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు అనే సమున్నత ఆశయాలతో అంబేద్కర్ గారి అధ్యక్షతన రూపుదిద్దుకున్నదే మన రాజ్యాంగం.(అందరూ సమానమే అయినప్పుడు, వెనుకబడిన వర్గాలకు,మహిళలకు రిజర్వేషన్లు,ప్రత్యేక చట్టాలు ఎందుకని అమాయకంగా అడిగేవారూ, వేరే దేశాల్లో మైనారిటీలకు లేని రక్షణ మన దేశంలోనే ఎందుకుండాలని అడ్డగోలుగా వాదించే 'సర్టిఫైడ్' దేశభక్తులూ, ఈమధ్య ఎక్కువవుతున్నారు. ఈ టాపిక్ గురించి మరో సారి వివరంగా రాస్తా.) రాజ్యాంగానికి లోబడి జీవించడం, దేశభక్తి కలిగిన పౌరుల కనీస కర్తవ్యం.అలా అని బైబిల్,ఖురాన్,భగవద్గీతల లాగా రాజ్యాంగంలో ఉన్నదాన్ని గుడ్డిగా ఆచరించాలని లేదు.రాజ్యాంగ సవరణ అనేది మన రాజ్యాంగానికున్న గొప్ప లక్షణాల్లో ఒకటి. మెజారిటీ(2/3) సభ్యుల అంగీకారంతో రాజ్యాంగంలోని ఏ విషయాన్నైనా మార్చటానికి అవకాశం ఉంది.దీని ప్రకారం, రాజ్యాంగంలో మనకు ఏదైనా నచ్చకపోతే దానిని మెజారిటీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, MPలపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్ ద్వారా దానిని సవరించుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారం ఓపిక, సహనం, సమ్యమనంతో రాజ్యాంగ బద్ధంగానే సాధించుకునే అవకాశం ఉంది.ఉదాహరణకి, పబ్స్, నైట్ క్లబ్స్ లాంటివి మన సంస్కృతికి వ్యతిరేకమని కొంతమందికి అనిపించవచ్చు. ఎందుకు వ్యతిరేకమో,వాటివల్ల కలిగే నష్టాలేమిటో ప్రజలందరికి వివరించి మెజారిటీ ప్రజలు కూడా దానికి సమ్మతిస్తే పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవ దీసి,చర్చించి దేశవ్యాప్తంగా వీటిని నిషేదించే వీలుంది. కానీ ఇది ఒక్కరోజులో జరిగేది కాదు.దానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే మంచి మార్పు తేవడానికి, నిజాయితీ,సహనం చాలా అవసరం. ఇవేవీ లేని ప్రభుద్ధులు, పబ్బుల మీద దాడి చేసి హంగామా సృష్ఠిస్తారు. అదే మంటే, ఈ దేశం మీద మీకంటే మాకు ప్రేమ ఎక్కువ కాబట్టి ఇలా చేశామంటారు. వీరికి,  'దేశాన్ని ప్రేమించడం అంటే, కొన్ని మతాల్ని,సంస్కృతుల్ని ద్వేషించడమే' అనుకునే  కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలూ,చదువుకున్న కొందరు నిరక్షరాస్యులూ, మద్దతు కూడా తెలుపుతారు.దేశానికి గుండెకాయలాంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, మా అంత దేశభక్తులు లేరని బీరాలు పలుకుతుంటారు.ఇక ప్రస్తుతం, రాష్ట్రంలో జరుగుతున్న, విభజన,సమైక్య  ఉద్యమాలలో కూడా, యదేచ్చగా రాజ్యాంగనోల్లంఘన ప్రతినిత్యం జరుగుతూనే ఉంది.తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజ్యాంగ బద్ధంగా ఉద్యమించే హక్కు, అది సాధించుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది.దానిని అపహాస్యం చేసే  హక్కు ఎవరికీ లేదు.కానీ విభజన ఉద్యమమైనా,సమైక్య ఉద్యమమైనా, మరేదైనా ఉద్యమమైనా.. రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అస్తమానం బందులు, రాస్తారోకోలు, బస్సుదహనాలూ,షాపుల అద్దాలు పగలగొట్టడం పైగా వీటన్నిటికీ జవాబుదారీతనం లేకుండా కేసులు ఎత్తివేయాలని మల్లీ డిమాండ్ చేయడం.. ఇవన్నీ రాజ్యాంగాన్ని పరిహసించటం కాదా అంటే, అవతలి వాల్లు కూడా చేస్తున్నారు కదా అంటూ సమర్థించుకోవటం.ఈ రకంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో ఒకరితో ఒకరు నిత్యం పోటీ పడుతున్నారు.స్వాతంత్ర్యం వచ్చిన ఈ 60సంవత్సరాల్లో, కులాల,మతాల,ప్రాంతాల వారీగా ఆలోచించడంలో బాగానే అభివృద్ధి చెందాం. అవసరమైనప్పుడు రాజ్యాంగ హక్కుల గురించి ఉద్యమిచడంపై ఉన్న శ్రద్ధ, రాజ్యాంగ విధుల గురించి మాట్లాడటంపై మాత్రం  లేకపోవడం శోచనీయం.రాజ్యాంగ హక్కుల గురించి ఉద్యమించినట్లుగానే, రాజ్యాంగ బాధ్యతలపై ఉద్యమించిననాడు,మన కులం వారికి,మన మతంవారికి,మన ప్రాంతంవారికి ఉన్నట్లుగానే, ఎదుటి కులంవారికీ,ఎదుటి మతం వారికీ,ఎదుటి ప్రాంతం వారికీ కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని గుర్తించి వాటిని గౌరవించడం నేర్చుకున్న నాడు, భారత దేశానికి ప్రపంచంలో ఎదురు ఉండదు. అలాంటి రోజులు త్వరలో రావాలని కోరుకుందాం.


రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో.. జై హింద్!!