Wednesday, November 21, 2012

2వ రోజూ కొనసాగిన 'హిందూ' పత్రిక ఎదురీత

కేవలం అసత్యాల్ని ప్రచారం చేసుకోవడం ద్వారా జనాల్ని కూడగట్టుకుని తమ పబ్బం గడుపుకునే అతివాద దళాల పనితీరు ఎలా ఉంటుందంటే.. వీరు ఎవరినైనా బ్రైన్ వాష్ చేసి ఓ 10 పాయింట్లు చెబితే, వాటిలో పదవ పాయింట్ తప్పనిసరిగా ఇలా ఉంటుంది.-  "పై తొమ్మిది పాయింట్లలో ఎవరైనా ఏ ఒక్క పాయింట్ నైనా తప్పని చెబితే వారు మన గ్రూపుకి వ్యతిరేకి కింద లెక్క. కాబట్టి అలాంటి వారి మాటల్ని నువ్వు నమ్మకు. వారు ఎన్ని ఆధారాల్ని చూపినా పట్టించుకోకు" 
ఇది కూడా నాజీల నుండి నేర్చుకున్న విద్యే. దీనికి మంచి ఉదాహరణ రోమీలా థాపర్. భారత దేశ ఉపఖండ చరిత్ర గురించి ఈవిడ రాసిన  రీసర్చ్ పుస్తకాలు, అనేక దేశ,విదేశ ప్రముఖ యూనివర్సిటీల్లో రెఫరల్ బుక్స్ గా ఉన్నాయి. విద్యా రంగంలో ఈవిడ సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మ భూశన్ అవార్డు ప్రకటించినా, విద్యాసంస్థలుఇచ్చే అవార్డులు తప్ప ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులేవీ తాను స్వీకరించనని ఈవిడ ఆ అవార్డును తీసుకోలేదు. అది ఆవిడ నిబద్ధతకు నిదర్శనం. కానీ మన అతివాద హిందూ గ్రూపులు మాత్రం ఆమెను హిందూ వ్యతిరేకిగా తీర్మానించేసి, హిందువులెవరూ ఆమె పుస్తకాల్ని చదవరాదని నిర్దేశిస్తుంటాయి. ఎందుకంటే, జనాల్ని కూడగట్టడానికి ఈ అతివాద గ్రూపులు చెప్పుకుంటూ తిరిగే చారిత్రక కథనాలు ఎంత అవాస్తవమో,అసంబద్ధమో ఈమె సోదాహరణంగా ఆవిడ పుస్తకాల్లో వివరిస్తారు కాబట్టి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే,  నిన్న హిందూ పత్రికలో ప్రచురితమైన చార్మినార్ పాత చిత్రం పై కొందరు వివిధ రకాల అణుమానాలు వ్యక్తం  చేశారు. హిందూ పత్రిక కావాలనే హిందువులకు వ్యతిరేకంగా రాస్తుందనీ, ఆ ఫోటో పైంటింగ్ లా ఉందనీ ఇలా.. దేశంలో వివిధ పత్రికల గురించి కనీస నాలెడ్జ్ ఉన్నవారెవరికీ, ఒక సారి హిందూ లో ఓ వార్త వచ్చాక  దానిపై ఇక అణుమానం ఉండదు. 'హిందూ' నిబద్ధత, ఆ పత్రిక పాటించే విలువలూ అలాంటివి. ఐనా సరే,  హిందూ పత్రిక అలా అణుమానించే వారి వ్యాఖ్యల్ని కూడా ప్రచురించి , వారి అణుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా ఈ సారి పక్కా డేట్స్ తొ కూడిన  4 ఫోటోలను ప్రచురించింది. దాని లింక్ ఇక్కడ

ఈ ఫోటోల్ని కూడా అణుమానించే వారు, నకిలీవని వాదించే వారు ఉంటారనే దాంట్లో సందేహం లేదు. కొందరికి కొన్ని నమ్మడంలో, కొన్ని నమ్మక పోవడంలో ఓ రకమైన కంఫర్ట్నెస్ ఉంటుంది. 
నిన్న నేను రాసిన పోస్టుకి స్పందనగా నాకు కూడా వివిధ రకాల కామెంట్లు వచ్చాయి. కొందరు ముస్లింలు పడగొట్టిన గుడుల లిస్టు అంటూ ఏవో కొన్ని లింకులు కూడా పంపారు. చార్మినార్ పక్కన ఇంతకు ముందు లేని గుడి ఇప్పుడు రావడానికి, చరిత్రలో ముస్లిం రాజులు కూలగొట్టిన గుడులకు మధ్య సంబంధం ఏమిటో అర్థం కాదు. "వారు అన్ని కూలగొట్టారు కదా, మనం కనీసం ఇదన్నా కూలగొడదాం"  అని వారి ఉద్ధేశ్యం కావచ్చు. చరిత్రలో అసత్యాల్ని అర్థ సత్యాల్ని తలకెక్కించుకున్నాక, ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే.  చరిత్రలో ఎక్కడ చూసినా ఆధిపత్యం కోసం, ఒక జాతి/వర్గం పై దాడులు/ప్రతిదాడులకి దిగడం, గెలిచిన వర్గం ఇతర వర్గం వారి సంస్కృతిని నాశనం చేయాలని చూడడం అనేది ఏ ఒక్క మతానికో, సమూహానికో పరిమితం కాదు. మంగోలులు,క్రైస్తవులు,ముస్లింలు,బుద్ధులు ఇలా అందరూ ఈ దారుణాలకు పాల్పడినవారే. చివరికి హిందూ మతం వ్యవస్థీకృతం కాకముందు వేరువేరుగా ఉన్న వైష్ణవులు,శైవులు, బుద్ధుల మధ్య కూడా ఇలాంటి దాడులు అనేకం జరిగాయి. హైదరాబాద్, అశోక్ నగర్లో, పుస్తకాల షాపుల్లోని సివిల్స్ ,గ్రూప్-1,2 లకి సంబంధించిన ఏ చరిత్ర పుస్తకం చూసినా వీటికి సంబంధించిన,  వివరాలు కావలసినన్ని దొరుకుతాయి.  (ఏ దేవాలయం శైవం నుండి వైష్ణవానికి మార్చబడింది, ఆ రాజు పేరు ఏమిటి లాంటివి గ్రూప్స్  లో ఇంపార్టెంట్ ఏరియాస్ ) . ఇలా చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా, మనకు అన్యాయం జరిగిందహో అని నినదించే  కపట రాజకీయ నాయకుల ఉపన్యాసాలో, వారి తలా తోకా లేని లింకులో పట్టుకుని, ఆవేశంతో ఊగిపోవడం వారితో పాటు సమాజానికి కూడా మంచిది కాదు.-జై హింద్

Tuesday, November 20, 2012

తెలుగు మీడియాకి ఇది పబ్లిష్ చేసే దమ్ము/నిజాయితీ ఉందా..?

ఈ రోజు హిందూ పత్రిక మొదటి పేజీలో వచ్చిన ఫోటో మరియు వార్త ఇది..
60 ఏళ్ళక్రితం తీసిన పాత చార్మినార్ పోటోకి ఇప్పటి ఫోటోకి ఉన్న తేడా స్పష్టంగానే కనబడుతుంది.

అప్పుడు లేని గుడి ఇప్పుడు అక్కడికి ఎలా వచ్చింది? ఒక చిన్న రాయిగా మొదలైన నిర్మాణం ఇప్పుడు ఓ స్పష్టమైన గుడి రూపాన్ని సంతరించుకుంది. ఇది క్రమంగా విస్తరిస్తుంది. దీని వెనక ఎవరున్నారు.? సగటు హిందువులెవరికీ ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉండదు. ఇలాంటి వివాదాల్ని ఉపయోగించుకుని లబ్ధిపొందాలనుకునే రాజకీయ రాబందులే ఇలాంటివి సృష్టిస్తుంటారు. ఇది ఆల్రెడీ ఓ సారి నిరూపితమైంది.
బట్ట కాల్చి ముఖాన వేయడం:
రాయలసీమలో ఒక సామెత ఉంది. అది బట్టకాల్చి ముఖాన వేయడం. ఎవరి ముఖంపై అయినా బట్టకాల్చి  వేస్తే ముఖం కాలిపోతుంది. దానిని తీసేద్దామని ప్రయత్నిస్తే ఆ మసి అతని చేతులకి అంటుకుంటుంది. ఆ బట్ట వేసిన వ్యక్తిని ఎందుకు అలా చేశావని అడిగితే- నేను వేయలేదు, అతనే వేసుకున్నాడు, కావాలంటే అతని చేతులకి మసి ఉంది చూసుకోండి అంటాడు. ఇప్పుడు పాతబస్తీ ముస్లింలది ఇదే పరిస్తితి. తమ చారిత్రక వారసత్వానికి గుర్తుగా 4 శతాబ్ధాలనుండి ఠీవిగా నిలబడి ఉన్న చార్మినార్ పక్కనే ఇప్పుడు ఓ గుడి వెలుస్తుంది. దానిని చూసి ఆవేశంలో 4 రాల్లు వేస్తారు. మరుసటి రోజు మన తెలుగు పేపర్లలో  మొదటి పేజీలో ఈ ఘటనల గురించి వార్తలు వస్తాయి. "పాతబస్తీలో అల్లరి మూకల విధ్వంసం"  అని. ఆ పక్కనే కిషన్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి వారి ఖండనలు.  మరి దీనికి కారణమైన వారు ఎవరు, ఎవరి ప్రొద్బలంతో అక్కడ గుడి నిర్మానం జరుగుతుంది లాంటి వివరాల జోలికి మన తెలుగు పేపర్లు వెల్లవు. ఎందుకు వెల్లవంటే..  మెజారిటీ పాఠకులకి ఇలాంటి వార్తలు నచ్చవు కాబట్టి, దీనినే మెజారిటీ అప్పీస్మెంట్ అంటారు.
ఈ వివాదం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.
ఇది ఊహించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మన అతివాద హిందూ గ్రూపులు ఫాలో అయ్యేది ఒకప్పటి హిట్లర్ వ్యూహాలనే.( మన దేశభక్త బాల్ థాకరే హిట్లర్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా) వీరి వ్యూహాల్లో మొదటిది- నిజాల్ని నాశనం చేయడం, అబద్ధాల్ని పదే పదే ప్రచారం చేసి వాటినే నిజాలుగా నమ్మించడం. ఈ పని కోసం హిట్లర్ ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాడు, దానికి అధిపతిగా గోబెల్ ని నియమించాడు.)
ఇక మన చార్మినార్ కి సంబంధించి గోబెల్స్ ప్రచారం ఇలా ఉండబోతుంది.
1. అక్కడ చార్మినార్ కన్నా ముందునుండే  దేవాలయం ఉండేదని, దానిని కూలగొట్టి ముస్లిం రాజులు చార్మినార్ నిర్మించారని ప్రచారం చేస్తారు.     
2. ప్రతి పండుగకి అక్కడికి జనాలని అసంఖ్యాకంగా తరలించి అక్కడ చాలా మహిమలున్నాయనీ, అక్కడ దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని ప్రచారం కల్పిస్తారు.
3. భక్తుల ముసుగులోనే ఈ కుట్రదారులు కూడా వెల్లి అప్పుడొక ఇటుక,అప్పుడొక ఇటుక తో నిర్మానాన్ని క్రమంగా విస్తరిస్తారు. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, "ప్రభుత్వం ముస్లింలకి కొమ్ముకాస్తూ, హిందువుల్ని కనీసం దేవాలయాలకు కూడా వెల్లనీకుండా చేస్తుందని, BJP మరియు ఇతర ధార్మిక సంస్థల ప్రతినిధులూ ఊరూ వాడా తిరిగి నెత్తీ నోరూ బాదుకుంటారు. వీరి ఆక్రోశాన్నిపత్రికలు మొదటిపేజీలో ప్రచురిస్తాయి.
4. ముస్లింల ఓట్లు మహా అంటే 15 శాతం, అవి కూడా చాల వరకూ MIM కే వెల్తాయి, కానీ హిందువుల ఓట్లు సుమారు 80%, కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ' హిందూ వ్యతిరేకి అనే విమర్శని తట్టుకోని నిలబడలేవు. కాబట్టి ప్రభుత్వాలేవీ వీరిని నిలువరించే ప్రయత్నం చేయవు. పైగా ప్రస్తుతం ఉన్న కిరన్ కుమార్ రెడ్డి లాంటి ఎప్పుడు ఊడుతుందో తెలీని, అసమర్థ నాయకత్వం ఉంటే ఇక వీరి ఆగడాలు వేగవంతం అవుతాయి.  
ఈ వివాదం వల్ల లాభ నష్టాలు- ఎవరికెంత..?
ఈ వివాదం వల్ల BJP,MIMలు ప్రజల్ని మతాల వారిగా విభజించి, తమ వర్గం వారి ఓట్లను గంపగుత్తగా పొందే అవకాశం ఉంది. ఈ విధంగా అత్యధికంగా లాభపడేది- BJP
ఇలాంటి విషయాల్లో TDP,కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏ వర్గాన్ని నొప్పించకూడదని తటస్థంగా ఉండటానికి ప్రయతించి దారునంగా విఫలమవుతాయి. కాబట్టి  భవిష్యత్తులో వీటి మనుగడ ప్రశ్నార్థక మవుతుంది.

Wednesday, August 22, 2012

Sunday, August 19, 2012

మోడీని సమర్థిస్తున్న ముంబై ముస్లింల చేష్టలు


గత వారం అస్సాం,మైన్మార్లలోని ముస్లింలపై దాడుల్ని ఖండించడం పేరుతో ముంబైలో జరిగిన ర్యాలీ సంధర్భంగా ముస్లింలు విధ్వంసానికి ఒడిగట్టారు. మంద బలానికి రెచ్చిపోయి పొలీసు,మీడియా లకు సంబంధించిన వాహనాలు తగులపెట్టడంతో పాటు, అనేక మంది పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వీరిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
అస్సాం, మైన్మార్లలో ఏం జరుగుతుంది, అక్కడ జరిగే హింస కేవలం మత ప్రాతిపదికమీదేనా..? అక్కడ నిజంగానే ఏక పక్ష దాడులు జరుగుతున్నాయా అనే విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. 
ఒకవేళ ముంబై ముస్లింలు భావిస్తున్నట్లు అస్సాం లో ముస్లింలపై దాడులు నిజమైనవే అనుకున్నప్పటికీ.. దానికి వీరు ప్రతిస్పందించిన తీరు మాత్రం అత్యంత గర్హనీయమైంది.ఎక్కడో అస్సాంలో జరుగుతున్న చర్యలకి వీరు ముంబైలో ప్రతిచర్య చేద్దామనుకుంటే, అది 2002 లో గొధ్రా అనంతరం మోడీ చెప్పిన చర్య-ప్రతిచర్యను సమర్థించటం తప్ప మరేం కాదు.  అస్సాంలో  జరుగుతన్న హింసను తలుచుకుని ముంబైలోని పోలీసుల మీద, పాత్రికేయుల మీద దాడులకి తెగబడ్డారంటే అది వీరి మూర్ఖత్వానికి,వెర్రి ఆవేశానికి నిదర్శనం. అలాంటప్పుడు ఇదే వెర్రి ఆవేశంతో గోధ్రా అనంతరం ముస్లింలపై దాడులకి పాల్పడిన నిందితుల్ని శిక్షించమని అడిగే అర్హత వీరికెక్కడుంది.

వీరి దాడుల్ని లైవ్ ప్రసారాల ద్వారా,ఫోటోల ద్వారా దేశం మొత్తం చూసింది.  
మల్లీ ఇంకోసారి ఇలాంటి దాడులు జరగకుండా ఇప్పుడు నిందితులకి కనీసం శిక్షలైనా విధిస్తారా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే మైనారిటీ వోట్లకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ ఆ పని చేయలేదు. పోనీ భవిష్యత్తులో ఎప్పుడైనా అక్కడ శివసేన ఆధ్వ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడైనా వీరికి శిక్షలు విధిస్తారా అంటే.. అదీ జరగదు. ఎందుకంటే, ఈ ఒక్క దాడుల నిందితుల్ని శిక్షిస్తే, గతంలో  జరిగిన అనేక దాడుల నిందితుల్ని కూడా శిక్షించాల్సి ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి  1993లో ముంబై అల్లర్ల  దాడులపై శివసేన అధినాయకునితో సహా అనేకమంది శివసేన కార్యకర్తల్ని నిందితులుగా నిర్థారిస్తూ జస్టిస్ శ్రీక్రిష్ణ సమర్పించిన రిపోర్టును అన్ని పార్టీలు కలిసి అటకెక్కించాయి. ఆ రిపోర్టుని కదిలిస్తే మెజారిటీల వోట్లు పోతాయని ఈ పార్టీలకి భయం. తిలా పాపం తలా పిడికెడు అన్నమాట.


అసలు అస్సాంలో ఏం జరుగుంది అనే దాని మీద భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుండి ముస్లింలు తండోపతండాలుగా వచ్చి అక్కడి స్థానిక బోడో లపై పెత్తనం చలాయించాలని ప్రయత్నించడం వల్ల సమస్య మొదలైందని  చెప్పే వారు కొందరైతే, అలాంటిదేమీ లేదనీ అస్సాంలో ఇతర విభిన్న జాతులపై ఆధిపత్యం కోసం బోడోలే ఈ దాడులకి పాల్పడుతున్నారని, దానికోసం బ్రిటిష్ వారి కాలంలో బెంగాల్ నుండి అస్సాంకి వలస వెల్లి అక్కడే స్థిరపడిన బెంగాలీ మాట్లాడే భారత ముస్లింలందరినీ బంగ్లాదేశీయులుగా చిత్రించి దాడులకి పూనుకుంటున్నారనీ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వాదనల్లో నిజానిజాలేమిటో వెలికి తీయాల్సిన భాధ్యత ప్రభుత్వంపై వుంది. చొరబాటుదారుల్నందరినీ(నిజంగానే ఉంటే) తక్షణమే దేశం నుండి పంపించి వేయాల్సిన అవసరం ఉంది. అట్లే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం  కాకుండా దేశ సరిహద్దుల చుట్టూ హైవోల్టేజ్ ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయాలి. కానీ, ఎన్నికల్లో గెలుపోటములు తప్ప మరేం పట్టని మన ఘనతవహించిన పార్టీలు దీనికి పూనుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.
కొసమెరుపేంటంటే.. అస్సాం ని సందర్శించిన అద్వానీ గారు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింల వల్లనే సమస్యలు వస్తున్నాయని ఏ మాత్రం అణుమానం లేకుండా అనౌన్స్ చేసేశారు. అద్వానీ అంతటోడు చెబితే అది నిజం కాకుండా ఉంటుందా అంటూ అతని అభిమానులందరూ ఈ వాదనకే ఫిక్స్ ఐపోయారు. కానీ ఇదే అద్వానీ, గతంలో ఓ సారి పాకిస్తాన్ సందర్శించి జిన్నా గొప్ప లౌకిక వాది అని అనౌన్స్ చేయగానే, ఇదే అభిమానులు అతనిపై అంతెత్తున లేచి, అతనికేం తెలీదని డిసైడ్ చేసేసి  అతన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేశారు. 
కొన్నిసార్లంతే.. మైండ్ తనకి నచ్చిన వాటినే రిసీవ్ చేసుకుంటుంది. నిజానిజాలు, ఆధారాల్తో  సంబంధం లేకుండా..


Friday, August 3, 2012

ఆ ముష్కరులు చేసింది తప్పే..కానీ..


మంగుళూరులో తమని తాము సంస్కృతీ పరిరక్షకులుగా, పుట్టు దేశభక్తులుగా చెప్పుకునే అల్లరి మూకలు మల్లీ రెచ్చిపోయారు. ఓ బర్త్ డే పార్టీ పై దాడిచేసి అక్కడి అమ్మాయిలు,అబ్బాయిలను కొట్టి నానా హంగామా సృష్టించారు. దానికి సంబంధించిన 'ది హిందూ' పత్రిక కధనాలు - ఇక్కడ
విషయం ఏంటంటే.. ఈ దాడికి నాయకత్వం వహించిన వ్యక్తి, 2009లో మంగులూర్లోనే ఓ పబ్ లోకి చొరబడి అక్కడి మహిళలపై దాడిచేసిన వీరుడు. ఇతని వీరత్వాన్ని అప్పుడు కూడా దేశవ్యాప్తంగా T.Vలు వీడియో  ప్రసారం చేశాయి. కానీ కర్నాటకలో ఉన్నది BJP ప్రభుత్వం కాబట్టి, అందరూ ఊహించినట్లుగానే ఇతడిమీద చర్యలేవీ తీసుకోలేదు. దానితో మళ్ళీ ఇప్పుడిలా తెగబడ్డాడు. అసలే అలవాటైన పని, పైగా దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ, అపై శిక్షలేవీ ఉండవనే భరోసా.. ఇంకేం కావాలి..? 

2009లో పబ్ మీద దాడి చేసినప్పుడే ఇతన్ని సరైన రీతిలో 'సత్కరించి ' ఉంటే ఇప్పుడు ఇలా చేసి ఉండే వాడు కాదు. కానీ 2009 పబ్ పై దాడిని ఖండిస్తూనే, మన సంస్కృతి, విలువలు అంటూ అనేక మంది కుహన దేశభక్తులు/సంస్కృతి భక్తులు ఇతన్ని ఇండైరెక్ట్ గా వెనకేసుకొచ్చారు. దాని ఫలితంగానే ఇతను ఇప్పుడిలా బరితెగించాడు. ఇప్పుడు కూడా ఈ సర్టిఫైడ్ దేశభక్తుల స్పందనలో మార్పులేదు. తప్పే కానీ.. సంస్కృతి,విలువలూ అంటూ నీళ్ళు నములుతున్నారు.వీరిలా స్పందించడానికి రెండు కారణాలు ఉండొచ్చు.
1. ఎప్పుడూ పబ్బులకీ,పార్టీలకీ వెల్లక, వెల్లే అవకాశం రాక, అలా వెల్లే వాల్లందరూ అక్కడ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారేమో ననే ఓ విధమైన అక్కసు(జెలసీ ) వీరి స్పందనకి కారణం కావచ్చు.(తాను చేయలేని పనిని ఇంకెవరైనా చేస్తూ.. అతను దానిలో ఆటంకాలు ఎదుర్కొంటేనో లేక విఫలమైతేనో, పక్కనుండి చూసే వారికి ఓ విధమైన తుత్తి ఉంటుంది. ఇది సగటు మానవ నైజం) . 
2. నేను కానీ, మా ఇంట్లో వారు కానీ పబ్బులకి,పార్టీలకీ  వెల్లం కాబట్టి, అలా వెల్లేవారిని ఎవరేం చేసినా నాకు పోయేదేం లేదనే ఓ విధమైన నిర్లిప్తతతో, ఈ దాడుల వల్ల మన సంస్కృతి కాస్తైనా బాగుపడుతుందేమోననే ఆశ కావచ్చు.

దాడులు,సంస్కృతి అవేని రెండు వేర్వేరు విషయాలు. వీటిని ఎప్పటికీ కలిపి చూడకూడదు. ఆ పార్టీల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలేవైనా జరుగుతున్నాయనుకున్నప్పుడు దానిని చట్టప్రకారమే ఎదుర్కోడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా  మృగాల్లా దాడులు చేయకూడదు. దీనిని ఖండించడంలో, ఆ ముష్కరుల్ని తీవ్రంగా శిక్షించమని అడగడంలో మీనమేశాలు లెక్కించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
ఇక సంస్కృతి అనేది మరో అంశం. సంస్కృతిని పరిరక్షించమనీ, పబ్బులకీ,పార్టీలకీ వెల్లకండనీ శంకరాచార్యలాంటి మఠాధిపతులో, TTD లాంటి ధార్మిక సంస్థలో ప్రచారం చేస్తే బాగుంటుంది తప్ప, ఓ నలుగురు ఆకతాయిల్ని వెంటేసుకు తిరిగే ప్రతివాడు సంస్కృతి పరిరక్షకున్నని చెప్పుకోవడం, ప్రస్తుతం మన సంస్కృతి యొక్క దౌర్భాగ్యం.


సంస్కృతి-పబ్బులు-పార్టీలు


మా నాన్న యువకుడిగా ఉన్నప్పుడు వాల్ల పల్లెలో వీధినాటకాలు, కోలాటాలూ లాంటివి తెగ ఆడేవాడంట. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని వాల్ల నాన్న మా నాన్నని రోజూ తిట్టేవాడంట.
కాలేజీ రోజుల్లో నేను సినిమాలు తెగ చూసేవాన్ని. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని మా నాన్న నన్ను రోజూ తిట్టేవాడు. 
రేపు నా కొడుకు పెద్దయ్యాక పబ్బులకు,డిస్కోలకు వెల్తాడు. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని నేను కూడా వాన్ని తిడతాను. అదే సంస్కృతి అంటే..
"ఏ సంస్కృతీ ఏనాడూ కాదొక స్థిర బిందువు. అనైక నదీనదాలు కలిసిన అంతస్సింధువు"- అన్నాడో కవి.
మార్పు చెందని జాతులు,సంస్కృతులు త్వరగా అంతరిస్తాయి. ఆ కొత్తగా వచ్చే సంస్కృతికి అప్పటికే ఉన్న సంస్కృతికీ మధ్య కొంత ఘర్షణ అనేది సహజమే. తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడం అనేది అలాంటిదే..
కానీ ఇలా మందలుగా వెల్లి దాడులు చేయడమనేది సంస్కృతి కాదు. దీనికి సరైన పేరు-కుల్లు రాజకీయం.