బీఫ్ తినడం- కొంతకాలం క్రితం వరకూ అతివాద హిందూ గ్రూపులకి ఇది చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే, వీరిదృష్టిలో హిందువులెవ్వరూ బీఫ్ తినరు. కేవలం ముస్లింలు మాత్రమే తింటారు. అది కూడా హిందూ సంస్కృతిని పరిహాసం చేయడానికే తింటారు. బీఫ్ తినని 80% శాతం మంది హిందువుల(క్రిష్టియన్లు,ముస్లింలూ కానివారందరూ హిందువులేననే వీరి లెక్క ప్రకారం) మనోభావాలు గాయపరచడం కోసమే తింటారు... ఇలాంటి పలు ఆవేశపూరిత విషయాల్ని హిందూ ఓటర్లకి వివరించి వారిని ముస్లింల పైకి ఉసిగొల్పడంలో, తద్వార వారి ఓట్లను కొల్లగొట్టడంలో ఇన్నాల్లూ ఈ విషయం వారికి బాగా ఉపయోగపడింది. కానీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో దలిత విద్యార్థి సంఘాల నాయకత్వంలో జరుగుతున్న బీఫ్ ఫెస్టివల్ వీరి ఆశలకి భారీగా గండికొడుతుంది. ఈ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన అనేక అవగాహన సదస్సుల్లో పాల్గొన్న వక్తలు, పెద్ద కూరతినడం దలిత సంస్కృతిలో అనాదిగా ఎలా భాగమైందో వివరించడంతో పాటు, ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్ మెనూల్లో బీఫ్ ని చేర్చాల్సిన అవసరాన్ని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. వీరు చెప్పేదేమిటంటే, బీఫ్ లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. ఇతర మాంసాహారాలైన చికెన్,మటన్ లాంటివి ప్రస్తుతం చాలా ఖరీదైపోయాయి. 100 రూపాయలకి వచ్చే చికెన్,మటన్లతో పోల్చితే, అదే రేటుకు వచ్చే బీఫ్ పరిణామం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున పేదరికం,పౌష్టికాహార లోపంతో బాధపడే దలిత విధ్యార్థులకి బీఫ్ తినడం అనేది అత్యావశ్యకం. ఈ విధంగా, ఇన్నాల్లూ అదేదో ముస్లింలు మాత్రమే చేసే (బీఫ్ ముట్టని ముస్లింలు కూడా అనేక మంది ఉన్నారు. వీరిలో కూడా పేద ముస్లింలే ఎక్కువగా బీఫ్ తింటారు. ) ఘోర అపరాధంగా,దేశద్రోహ సమానమైన నేరంగా చాటింపు వేసుకుంటూ బతికేసిన BJP,RSS,ABVPలాంటి సంఘాలకు, తీరా ఇప్పుడు దానికి ప్రతికూలమైన వాదనలు దేశజనాభాలో అత్యధికంగా ఉన్న దలిత,వెనుకబడిన వర్గాల నుండి రావడంతో, గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టుగా ఐంది. ఇప్పుడు సంస్కృతి,మనోభావాలు లాంటి భారీ డైలాగులతో, భౌతిక దాడులతో ఈ దలిత సంఘాలతో పెట్టుకుంటే, 'అంటే మేము బీఫ్ తిన్నంత మాత్రాన హిందువులం కాకుండా పోతామా?' అని వీరు అనేయగలరు. దానికి అవునంటే, ఆ నిర్వచనం ప్రకారం దేశ హిందూ జనాభా ఎంతో మరో సారి లెక్కించ వలసి ఉంటుంది. అంటే BJP ఓటుబ్యాంకుకు పెద్ద గండి అన్నమాట. (హిందూయేతరులు BJPకి ఎట్టిపరిస్తితుల్లో ఓటు వేయరు. అసలు వారి ఓట్లను పొందాలనే ప్రయత్నం కూడా ఆ పార్టీ ఎప్పుడూ చేయదు.). 'సరే తినండి' అంటే, ఇన్నాల్లూ ముస్లింల మీద ఇదే సాకు చూపి విద్వేషం చిమ్ముతూ, తమ పాలన ఉన్నరాష్ట్రాల్లో గోవధకి, మనుషుల వధకన్నా కృరమైన చట్టాలు చేసిపెట్టుకుని,(ఉదాహరణకి, మధ్యప్రదేశ్లో పోలీసులు ఎవరైనా ఓ వ్యక్తిపై ఓ మనిషిని చంపినట్లు నేరం మోపితే అతడు ఆ నేరం చేశాడని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అదే ఓ వ్యక్తిపై గోవధ చేసినట్లు నేరం మోపితే, అతడు నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ నిందితునిపై మాత్రమే ఉంటుంది. ఒకవేల అతను నిరూపించుకోలేకపోతే అత్యధికంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు. ) వీటి ద్వారా అక్కడి మైనారిటీల్ని హింస్తిస్తున్న తమ కపటత్వం బయటపడుతుంది.
కావున ఎలా చూసుకున్నా, ఉస్మానియా లో మొదలైన ఈ బీఫ్ ఫెస్టివల్, భవిష్యత్తులో BJP కి పెనుసవాలుగా మారనున్నటం సుష్పష్టం.
కావున ఎలా చూసుకున్నా, ఉస్మానియా లో మొదలైన ఈ బీఫ్ ఫెస్టివల్, భవిష్యత్తులో BJP కి పెనుసవాలుగా మారనున్నటం సుష్పష్టం.