తమ పార్టీకి తప్ప వేరే ఏ ఇతర పార్టీలకూ సిద్ధాంతాలు లేవనీ, ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించటానికే తమ పార్టీ పుట్టిందనీ, గంగాజలం లాంటి తమ పార్టీ ఏ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోదనీ ఇన్నాల్లూ నీతి వచనాలు ప్రవచిస్తూ వచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఇటీవల తనకు అకస్మాత్తుగా ఙ్నానోదయమైనట్లు భాజపా తో పొత్తుకు సిద్ధమని ప్రకటించేశారు. ఇక కమ్యూనిస్టు విప్లవ యోధుడు చేగువేరా బొమ్మతో జనసేనను ప్రకటించిన పవన్ కళ్యాన్, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేక భావజాలాలైన కమ్యూనలిజం, క్యాపిటలిజంలకు నిలువెత్తు రూపమైన మోడీ భజన చేయడం మొదలుపెట్టాడు. గుజరాత్లో వేల మంది అమాయకుల మృతికి కారకుడుగా మైనారిటీలు, సెక్యులరిస్టులూ విమర్శిస్తున్న నరేంద్ర మోడీకి దేశాన్నేలే అన్ని అర్హతలు ఉన్నాయని వీరిద్దరూ క్లీన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. భారత దేశ రాజ్యాంగం తనకు గీత, బైబిల్, ఖురాన్ లాంటివనే భారీ డైలాగుల్ని అలవోకగా వల్లెవేసే జె.పి,పవన్ లు , మోడీని వెనకేసుకొస్తున్నందుకు లౌకిక వాదుల క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
1. మీరు రాజకీయాలు కలుషితమైపోతున్నాయని, రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశిస్తున్నారనీ తెగ ఇదై పోతుంటారు. గుజరాత్ లో 97 మంది అమాయక స్త్రీలను, పిల్లల్ని నిర్దాక్షిన్యంగా చంపిన కేసులో మాయా కొందానికి కోర్టు 28 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ నేరం 2002 లో జరగ్గా, తీర్పు 2013లో వెలువడింది. 2007 లో ఈమెను మోడీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా నియమించాడు. అల్లర్లలో ఆమె పాత్ర ఉందనే విషయం తెలీని అఙ్నానం, అసమర్థత వల్ల మోడీ ఆమెను మంత్రిని చేశాడా లేక, ముస్లింలను చంపినందుకు ప్రతిఫలంగా ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడా? అవినీతి కంటే, అమాయకుల్ని చంపడం అనేది పెద్ద నేరమేమీ కాదని మీరు భావిస్తున్నారా?
2. మీరు బలమైన లోక్పాల్ వ్యవస్థ గురించి, అవినీతి గురించి TV స్టూడియోల్లో గంటలకొద్దీ మాట్లాడు తుంటారు. కానీ, మోడీ గుజరాత్ లో లోకాయుక్తను నియమించకుండా పదేళ్ళపాటు ఖాళీగా ఉంచాడు. చివరికి గుజరాత్ గవర్నర్ చొరవ తీసుకుని ఓ లోకాయుక్త ని నియమిస్తే, మోడీ ఆ నియామకానికి వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. అక్కడ చుక్కెదురవడంతో, కోట్ల కొద్దీ ప్రజాధనాన్ని ఫీజుగా చెల్లించి రాం జెఠ్మలానీ ని లాయర్ గా పెట్టుకుని సుప్రీం కోర్టుకి వెల్లాడు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో, విధిలేని పరిస్తితుల్లో హడావుడిగా గుజరాత్ లోకాయుక్త చట్టాన్ని సవరించి, తూ తూ మంత్రంగా లోకాయుక్త నియామకాన్ని కొన్ని నెలల క్రితం పూర్తి చేశాడు. ఇప్పుడు మీరు మోడీని సమర్థిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మోడీ విధానమే సరైనదని మీరు భావిస్తున్నారా?
3. భారత రాజ్యాంగ ఔన్నత్యం గురించి మీరు అనర్గళంగా ప్రసంగిస్తుంటారు. ఏవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని శిక్షించే అధికారం రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలకు ఇవ్వబదింది. కానీ మోడీ పాలనలోని గుజరాత్లో అనేకమంది మైనారిటీ యువకుల్ని కేవలం టెర్రరిస్టులనే అనుమానం మీద పోలీసులు కాల్చిచంపడం జరిగింది. మృతుల్లో కొందరికి టెర్రరిజం తో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే నిరూపించబడింది. మిగతా కేసులు కూడా వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. నకిలీ ఎంకౌంటర్ల అభియోగంపై సుమారు 20 మంది గుజరాత్ ఉన్నత స్థాయి పోలీసు అధికారులు సస్పెండ్ కావడమో జైలు శిక్ష అనుభవించడమో జరిగింది. గుజరాత్లో శాంతి భద్రతలు ఈ స్థాయిలో విఫలమవడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో బాటు హోం శాఖను కూడా వెలగబెడుతున్న మోడీ పాత్ర లేదంటారా?
4. మీరు టి.వి. చర్చల్లో ఏ విషయాన్ని ఐనా హేతుబద్ధంగా విశ్లేషిస్తుంటారు. అదే హేతుబద్ధత ఆధారంగా దీనికి సమాధానం చెప్పండి. ఓ విద్యార్థి 9వ తరగతివరకు ప్రతి ఏడూ మంచి మార్కులు సాధిస్తే, 10 వ తరగతిలో కూడా మంచి మార్కులే సాధిస్తాడు. ఆ మాత్రం దానికి కేవలం తనవల్లే అతనికి మంచి మార్కులు వచ్చాయని 10వ తరగతి టీచరు చాటింపు వేస్తే ఎలావుంటుంది? ఆ విద్యార్థి అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులు సాధించిన విషయం తెలీని అమాయకులు ఎవరైనా ఆ టీచర్ని నమ్మితే ఆది వేరే విషయం. కానీ, బ్రిటీష్ వారి కాలం నుండే గుజరాత్ పారిశ్రామికంగా ఇతర రాష్ట్రాల కన్నా ఏంతో అభివృద్ధి చెందిందనే విషయాన్ని సివిల్ సర్వీసెస్ పుస్తకాలలో చదువుకున్న మీరు కూడా మోడీ కారణంగానే గుజరాత్ అభివృద్ధి చెందిందనే నిర్ణయానికి ఎలా వచ్చారనేదే ఆశ్చర్యకరం. బాల బాలికల్లో పౌష్టికాహార లోపం, గ్రామీణ విద్య, వైద్యం లాంటి అనేక సంక్షేమ రంగాల్లో గుజరాత్ స్థాయి నానాటికీ దిగజారిపోతున్న విషయం మీ దృష్ఠికి రాలేదా? లేక అధిక పారిశ్రామికాభివృద్ధి ముందు, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కాదని మీ అభిప్రాయమా?
5.కొన్నేళ్ళక్రితం వచ్చిన 'ఒకే ఒక్కడు ' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో టి.వి. వ్యాఖ్యాతగా పనిచేసే కధానాయకుడు, విలన్ పాత్రధారి అయిన రాజకీయనాయకుడ్ని కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానాలు చెప్పలేని ఆ రాజకీయ నాయకుడు ఆ ఇంటర్వూ మధ్యలోనే ఆపేసి స్టూడియో నుండి వెల్లిపోతాడు. 'గుజరాత్ అల్లర్లలో అన్ని వేల మంది అమాయకులు మరణించినందుకు మీరు చింతిస్తున్నారా?' అని విలేఖరి కరన్ ధాపర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని మోడీ, విలన్ రఘువరన్ లాగానే స్టూడియో నుండి హడావుడిగా వెల్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూటూబ్ లో ఉన్నాయి. గోధ్రా రైలు దహనంలో, అనంతరం జరిగిన అల్లర్లలో మరణించిన కొద్దిపాటి హిందువుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించటంలో ఏ మాత్రం ఆలస్యం చేయని మోడీ, అల్లర్లలో మరణించిన అమాయక ముస్లింల కుటుంబాలను మాత్రం ఇప్పటికీ కలవలేదు, వారికి కనీస సానుభూతిని కూడా ప్రకటించలేదు. మోడీ మతోన్మాదం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా మీలాంటి వారి కళ్ళకి అతను సెక్యులరిస్టుగా కనిపించడం విచారకరం. అమాయకుల చావుల విషయంలో, చనిపోయిన వారి మతాన్ని బట్టి, ఒక్కో మతానికి ఒక్కో రకంగా స్పందిస్తున్న మోడీ లాంటి మతోన్మాది భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే దేశానికి ఎలా ప్రధానిగా అర్హుడని మీరు భావిస్తున్నారు?
నిజానిజాలతో సంబంధం లేకుండా గోబెల్స్ ప్రాపగాండా సఫలీకృతం అవడం, వ్యక్తి పూజ, అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కావడం లాంటివి అంతిమంగా దేశాన్ని నియంత పాలనలోకి నెట్టేస్తాయనే విషయం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ తో నిరూపితమైంది. అప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి ఎందరో నాయకుల పోరాటాల ఫలితంగా మళ్ళీ దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. కానీ, అదే పేరు పెట్టుకున్న లోక్ సత్తా జె.పి మరో కాబోయే నియంత పాలనకి మంగళహారతులివ్వడం శోచనీయం. నిజానికి పైన అడిగిన ప్రశ్నలు, మోడీని డైరెక్టుగా అడగాలని, అతని నుండి సమాధానాలు రాబట్టాలని చాలా మంది జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు. కానీ, మోడీ ఇలాంటి వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడు. కేవలం తనకు అనుకూల వార్తలు రాసే మీడియాల్లోనే, అది కూడా తాను ముందుగా ఎంచుకున్న ప్రశ్నలకు మాత్రమే అందమైన సమాధానాలు ఇస్తారు. ఇక ఆ తర్వాత వందల కోట్లు చెల్లించి ఏర్పాటు చేసుకున్న ప్రాపగాండా ఏజెన్సీలు ఆ అందమైన సమాధానాల్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాయి.
ఈ వ్యూహం ఇప్పటిదాకా విజయవంతం కాబట్టే, మోడీ వస్తే ఏదో ఉద్ధరిస్తాడనే భ్రమలు అనేక మందిలో కనిపిస్తున్నాయి. కానీ, తాము అందరికంటే చాలా విభిన్నమైన వారమనీ, తమకు గొప్ప, గొప్ప విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయనీ ప్రగల్బాలు పలికే జె.పి, పవన్ కళ్యాన్ లాంటి వారైనా, మోడీ తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నలకు సమాధాన మివ్వాల్సిన అవసరం ఉంది.

