Showing posts with label politics. Show all posts
Showing posts with label politics. Show all posts

Friday, March 21, 2014

చరిత్ర పునరావృతం కాబోతుందా..?

1933 లో హిట్లర్  జర్మనీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే నాటికి  యూరప్ లో యూదుల మొత్తం జనాభా 90 లక్షలు.  యూదులపై విద్వేషం నరనరానా జీర్ణించుకున్న హిట్లర్ , వారికి వ్యతిరేకంగా ఓ పద్ధతి ప్రకారం సాగించిన   నరమేధం వల్ల వారి జనాభా పదేళ్ళలో 30 లక్షలకి పడిపోయింది.  రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ  ఘోరంగా ఓడిపోయి, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాక  కానీ   ఈ జనహననం ఆగలేదు.  'నాజీ '  అనే పదానికి ఎప్పటికీ చెరగని రక్తపు  మరకలు అంటించడమే కాక,  రెండవ ప్రపంచ యుద్ధానికీ, తద్వారా కలిగిన అనంత ప్రాణ,ఆస్తి నష్టానికి  ప్రపంచం ముందు జర్మనీని దోషిగా నిలబెట్టిన హిట్లర్,  నిజానికి ఒకప్పుడు జర్మనీ  ప్రజలకు అత్యంత ఆరాధ్యనీయుడు.  సహజంగా రాచరిక వ్యవస్థల్లోనో,  దొడ్డిదారుల్లో అధికారంలోకి వచ్చిన సైనిక నియంతల్లోనో  కౄరులైన పాలకులుంటారు. కానీ, హిట్లర్ పూర్తి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన నేత. హిట్లర్ లాంటి  రక్త పిపాసిని నాజీలు ఎందుకు ఓట్లేసి ఎన్నుకున్నారనే అంశం  మీద అనేక పరిశోధనలు కూడా జరిగాయి.  1918 లో ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.అక్కడ  నిరుద్యోగం, ఆకలి చావులు సర్వ సాధారణమైపోయాయి.  సూపర్ ఇన్ ఫ్లేషన్ ఫలితంగా కనీస వస్తువుల ధరలు గంట గంటకూ పెరుగుతూ పోతుండేవి.  ఇలాంటి పరిస్థితుల్లో సుస్థిర పాలన, ఆర్థికాభివృద్ధిని అందిస్తాననే నినాదంతో హిట్లర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు.  సహజంగానే అధ్భుతమైన  వక్త కావడంతో, దేశభక్తిని రంగరించి హిట్లర్ చేసే ఉపన్యాసాలను జనం మైమరచి వినేవారు.  కమ్యూనిస్టులు, యూదులు వంటి మైనారిటీ నాజీయేతరుల పట్ల  తన ఏహ్యభావాన్ని అనేక మార్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నప్పటికీ,  ఆకలితో అలమటిస్తున్న నాజీలకు ఆర్థికాభివృద్ధి తప్ప మిగతా ఏ విషయాలు అంత ప్రముఖమైనవిగా అనిపించేవి కాదు.  దీని ఫలితంగా హిట్లర్ లోని అవలక్షణాలను పెద్దగా పట్టించుకోని నాజీలు రెండు సార్లు అఖండ మెజారిటీతో   జర్మనీ చాన్సలర్ గా  గెలిపించారు.హిట్లర్ ఎన్నికల్లో గెలిచాక, బందులు, ధర్నాలను నిషేధించడం,  కార్మిక సంఘాలను రద్దు చేయడం,   సైనిక ఆయుధ కర్మాగారాలను భారీ ఎత్తున స్థాపించడం వంటి చర్యల వల్ల  పారిశ్రామికాభివృద్దిని  సాధించాడు గానీ,  ఆ అభివృద్ధికి జర్మనీ ప్రజలు అసాధారణ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. 
ఇక ప్రస్తుత భారత రాజకీయాలకు వస్తే,  భారత ప్రధాన ప్రతిపక్షం తరపున బరిలో ఉన్న ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ని  హిట్లర్తో పోల్చడం  చాలా మంది పాఠకులకి నచ్చకపోవచ్చు. కానీ,  గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ హయాంలో జరిగిన అల్లర్లకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు  బాధ్యులు ఎవరనే విషయం లెక్కతేలకుండా   మోడీని ప్రధాని పీఠం పై కూర్చోబెట్టడమంటే చరిత్రలో నాజీలు చేసిన పొరబాటునే  ఇక్కడ కూడా  పునరావృతం చేసినట్లు అవుతుంది.  మోడీని ప్రధాని అభ్యర్థిగా   సమర్థిస్తున్న వారి నుండి  రెండు రకాల వాదనలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. అవి . 1. గుజరాత్ అల్లర్లలో  మోడీ పాత్ర ఏ మాత్రం లేదని వాదించేవారు.  ఇప్పటిదాకా ఏ కోర్టూ మోడీ మీద ఆరోపణలను నిర్ధారించలేదనే విషయాన్ని వీరు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత లేకపోలేదు. కాకపోతే,  వీరు మరికొన్ని హేతుబద్ధ ప్రశ్నలకు, కనీసం తమకు తాము జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. 59 మంది అమాయకుల్ని బలిగొన్న గోధ్రా రైలు దహణం ముమ్మాటికీ ఓ హేయమైన చర్యే.   సమర్థుడైన, బలమైన నాయకుడనే వారు ఎవరైనా   దీనిపై  నిష్పాక్షిక,శీఘ్రతర విచారణ  జరిగే ఏర్పాట్లు చేసి, బాధ్యులను గుర్తించి వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయగలగాలి. కానీ, గోధ్రా రైలు దహణం మీద విచారణకై మోడీ ప్రభుత్వం 2002 లో నియమించిన నానావతి కమీషన్ 12 ఏళ్ళ తర్వాత కూడా  ఇప్పటికీ విచారణను పూర్తి చేయలేదు. ఈ పన్నెండేల్ళు  గుజరాత్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోడీ  ఈ జాప్యానికి ఏం సమాధానం చెబుతారు.  గోధ్రా   రైలు దహణం చేసిన వారిని  శిక్షించడం సంగతి అటుంచితే,   రైలు దహనం అనంతరం  గుజరాత్ మొత్తం  మీద 3 రోజుల  పాటు  యదేచ్చ్చగా జరిగిన  అల్లర్లలో, గుజరాత్ అధికారిక లెక్కల ప్రకారమే   1044 మంది  అమాయక పౌరులు చంపబడ్డారు. వీరిలో 254 మంది హిందువులు  కూడా ఉన్నారు. గాయపడిన, కనిపించించకుండా పోయిన, నిరాశ్రయులైన వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. గుజరాత్ లాంటి చిన్నరాష్ట్రం లోనే, ఒక దుర్ఘటన తర్వాత శాంతి భద్రతల్ని అదుపు చేయలేని వ్యక్తి,   నిత్యం  నక్సలిజం, తీవ్రవాదం,   మరియు వివిధ వేర్పాటు వాద ఉద్యమాలను ఎదుర్కొంటున్న  భారత్ లాంటి  సువిశాల దేశానికి ఏ విధంగా సమర్థ నాయకత్వాన్ని అందివ్వగలడు?
ఇక  మత కలహాలు, మానవహక్కులు వంటి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ఆర్థికాభివృద్ధి నినాదంతో మోడీ ని సమర్థిస్తున్న  మరో వర్గం దేశంలో క్రమంగా పెరుగుతుంది.  వీరికి సంబంధించినంత వరకు,   రైలు దహనంలో కొంతమంది హిందువులు మరణించారు,  దానికి ప్రతిగా మరికొంతమంది ముస్లింలు చంపబడ్డారు. రెండింటికీ  లెక్క సరిపోయింది. దీనిలో మోడీ పాత్ర ఉందా లేదా అనేది వీరికనవసరం.  అసలు ఆ  కేసుల గురించి విచారణలు కూడా  కేవలం కాంగ్రెస్ కుట్రలే అంటారు వీరు. అక్కడ  అమాయకులపై జరిగిన అనేక  ఫేక్ ఎంకౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలు అసలు  చర్చించు కోవలసిన అంశాలే కాదంటారు.   మోడీ గుజరాత్ లో వేశాడంటున్న విశాలమైన రోడ్లు,  పెద్ద, పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు  ఇవే తమకు ముఖ్యమనే విషయాన్ని ఏ మాత్రం సంకోచం, మొహమాటం  లేకుండా చెబుతారు. ఇలా చెప్పేవారు, మొదటి ప్రపంచయుద్ధానంతర నాజీల వలే  ఉద్యోగం లేక నైరాశ్యంలో ఉన్న నిరుద్యోగులో,  కటిక దారిధ్ర్యంలో ఉన్నవారో అయితే, మానవహక్కులు, సమన్యాయం వంటి అంశాలపై వీరి నిరాసక్తతను అర్థం చేసుకోవచ్చు.  కానీ,   ఉన్నత విద్యావంతులు,    అధిక జీతాలు తీసుకుంటున్న ఐ.టి. ఉద్యోగులు, ఆర్థిక సరళీకరణల ఫలితాల్ని అనుభవిస్తున్న ఎగువ మధ్యతరగతి ప్రజలు  కూడా ఇలాంటి అభిప్రాయాల్ని కలిగి ఉండటం ఒకప్పటి నాజీలకన్నా ప్రమాదకరమైన ధోరణి. అందుకే  ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయపరిణామాలు,  మైనారిటీల్లోని ఆలోచనాపరుల్ని, సెక్యులరిస్టుల్ని భీతావహుల్ని చేస్తున్నాయి.
ఇటీవలి ఒక సర్వేలో,  ప్రస్తుత తరం నాజీలు హిట్లర్ కాలం నాటి  తమ చరిత్ర గురించి పూర్తి అపరాధ భావంతో కుమిలిపోతున్నారని తేలింది.  హిట్లర్ పార్టీ పేరైన 'నాజీ ' , స్వస్తిక్ గుర్తు  లాంటివి ఇప్పుడు అక్కడ పూర్తి నిషిధ్ధం.  ఆర్యన్ జాతికే ప్రపంచంపై ఆధిపత్యం వహించే  హక్కువుందని జీవితాంతం  విర్ర వీగిన హిట్లర్, జర్మనీని వినాశనం వైపుకు పయనింపజేసి చివరికి తన పిస్తోలుతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   గోబెల్స్ ప్రచారం ఆధారంగా,  హిట్లర్ నిర్మించిన ఊహల సౌధంలో విహరించిన నాజీలకు, నిజం కల్ల ముందు సాక్ష్యాత్కరించేటప్పటికి  బూడిద, రక్తపు మరకలు తప్ప మరేం మిగల్లేదు.  ఈ 21 వ. శతాబ్ధంలో మళ్ళీ చరిత్ర పునరావృతం కాబోతుందా..?

 ===
Added
2002 లో జరిగిన అల్లర్లో, నరోడా పాటియా అనే కాలనీలో 90 మందిని సజీవ దహనం చేసిన కేసులో మాయాకొందాని అనే ఆవిడకి కోర్టు గతేడాది యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ పదేల్లూ ఆమె మోడీ క్యాబినెట్లో మంత్రి గా ఉండింది. ఇప్పుడు ఈ క్రింది రెండింట్లో ఏది సరైనదో మీరే చెప్పండి.
A. మోడీకి, అల్లర్లలో ఆవిడ పాత్ర ఉందనే విషయం తెలీదు.
B. ఆవిడ పాత్ర ఉందనే విషయం తెలుసు, అయినా ఆమెని మంత్రిని చేశాడు.
మీ ఆప్షన్ A అయితే, దానర్థం గుజరాత్ లాంటి చిన్నరాష్ట్రం, సొంత రాష్ట్రం లోనే 90 మందిని చంపిన ముద్దాయి తన పక్కనే తిరుగుతున్నా తెలుసుకోలేని వెధవ, అమాయకుడు, మూర్ఖుడు. అనే కదా.అలాంటోడు మన దేశ ప్రధానా.? సిగ్గు. సిగ్గు.
మీ ఆప్షన్ B అయితే, దానర్థం 90 మంది అమాయక స్రీలను, పిల్లల్ని చంపిన ఓ కిరాతకురాలిని మంత్రిని చేశాడంటే ఇక మోడీ ఎంత నరరూప రాక్షసుడో వేరే చెప్పాలా..? ఇట్టాంటోడు భారత దేశ ప్రధానా..? భారత జాతికి ఇంత కంటే అవమానం ఉంటుందా? 

Saturday, January 21, 2012

లోకాయుక్త పై సుప్రీం కి మోడీ: అసలు లక్ష్యం వేరే!!!


లోకాయుక్త – రాష్ట్ర పరిథిలో ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ శాఖల కార్యకలాపాలపై డేగ కన్నేసి ఉంచి అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించే ఓ రాజ్యాంగ బద్ధ పదవి. సహజంగా లోకాయుక్తలుగా రిటైర్డ్ న్యాయమూర్తుల్నే నియమిస్తారు. వారు అప్పటికే రిటైరైపోయి ఉంటారు కాబట్టి, పెద్దగా రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి పోకుండా ఏదో తూతూ మంత్రంగా అవినీతిపై సాంవత్సరిక రిపోర్టులు సమర్పించేసి మమ అనిపిస్తుంటారు.  కానీ నిజాయితీ నిబద్ధత, అవినీతి భరతం పట్టాలనే కసి ఉన్న వ్యక్తి లోకాయుక్త గా నియమించబడితే దాని ప్రభావం ఎంతగా ఉంటుంది అనేదానికి, ఇటీవలే కర్ణాటక లోకాయుక్తగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే ఓ చక్కని ఉదాహరణ. అవినీతి వ్యవహారంలో ఇతను సమర్పించిన పరిశోధనాత్మక రిపోర్టులే యెడ్యూరప్పను పదవీచ్యుతున్ని చేశాయి.

ఇక గుజరాత్ విషయానికి వస్తే,  మన మోడీ ఎంతైనా మహా తెలివి పరుడుకదా,  యెడ్యూరప్పకి వచ్చిన సమస్య లాంటిదాన్ని ముందే ఊహించి, ఎందుకొచ్చిన గొడవ అనుకున్నడేమో కానీ..  గుజరాత్లో 2002లో ఖాలీ అయిన లోకాయుక్త స్థానాన్ని తిరిగి భర్తీ చేయకుండా ఇప్పటి వరకూ అలాగే ఉంచేశాడు. ఇటీవల గుజరాత్ గవర్నర్ గా నియమితులైన కమలా బెనివాల్  లోకాయుక్త పదవిని భర్తీ  చేయడానికి తగిన వ్యక్తిని సూచించవలసిందిగా గుజరాత్ హైకోర్టుని పురమాయించింది. అందుబాటులో ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తులనుండి ఒకరిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసి, రాష్ట్రప్రభుత్వ సలహా కోసం పంపారు. మన మోడీ గారు, ఆ న్యాయమూర్తిని కాదని తనకి అనుకూలంగా ఉన్న మరో న్యాయమూర్తి పేరును సూచిస్తూ  ప్రధాన  న్యాయమూర్తి ప్రతిపాదనని పునహ్ పరిశీలించ వలసిందిగా కోరారు.  HCJ  మల్లీ అదే పేరును పంపడం, మోడీ మల్లీ తిరస్కరించడం జరిగిపోయాయి. విషయం ఇలా నానుతుండగానే, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో సంబంధం లేకుండా HCJ చెప్పిన వ్యక్తిని  లోకాయుక్తాగా నియమించాలని గవర్నర్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. వెంటనే అలెర్ట్ ఐన మన మోడీ,  లోకాయుక్తని నియమించే అధికారం గవర్నర్ కి లేకుండా చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయాలనే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చాడు. ఆదే రోజు  HCJ  ప్రతిపాదించిన వ్యక్తిని లోకాయుక్తాగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా గవర్నర్ చేసిన ఈ నియామకం చెల్లదని మోడీ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. మొదట ఇద్దరు జడ్జిలు గల కమిటీ దీనిని విచారించి, ఒక జడ్జి గవర్నర్ నిర్నయాన్ని సమర్థించగా, మరో జడ్జి గవర్నర్ కి ఆ అధికారం లేదని పరస్పర విరుద్ధ తీర్పు లిచ్చారు. ఇలాంటి పరిస్తితుల్లో మూడో జడ్జి నిర్ణయం అవసరం కాబట్టి,  HCJ దీనిని పరిశీలించి గవర్నర్ కి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఫైగా  HCJ  సూచించిన వ్యక్తిని  లోకాయుక్తగా నియమించకుండా ఇలా ‘మినీ రాజ్యాంగ సంక్షోభం’ సృష్టించడానికి ప్రయత్నించాడని మొడీని తీవ్రంగా దుయ్యబట్టారు.  


మరో రాష్ట్ర CM ఐతే , ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి,లోకాయుక్తగా కోర్టు చెప్పిన వారిని నియమించి సైలెంటైపోయేవారు. కానీ మన మోడీ తేడా కదా.. పైగా కోర్టులతో తిట్టించుకోవడమంటే మహా  సరదా.. కాబట్టి  హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెల్లాడు.  ఇక్కడ సుప్రీం  కోర్టు  తీర్పు , దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.


కేస్ 1:  హైకోర్టు వాదనతో వ్యతిరేకిస్తే..

ఇది మోడీ కి గొప్ప శుభవార్తే అవుతుంది. సుప్రీం కోర్టు ఆరు కోట్ల గుజరాతీయుల్ని బలపరచింది అని,"ఆరు కోట్ల గుజరాతీల తరుపున సుప్రీం కోర్టుకి ధన్యవాదాలు" అనీ   మోడీ అలవాటైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు.  ఆపైన తనకు కావలసిన  వారిని లోకాయుక్తగా నియమించుకుని, తనకు కావలసిన విధంగా అతని నుండి రిపోర్టులు రాయించుకుంటూ.. గుజరాత్ వెలిగి పోతుందని చాటింపు వేయించుకోవచ్చు.కానీ తీర్పు ఇలా రావడానికి అవకాశం చాలా తక్కువ.


కేస్2: హైకోర్టు వాదనతో ఏకీభవిస్తే.. 

‘మోడీకి మరో ఎదురు దెబ్బ’అని పత్రికలు వార్తలు రాసుకుంటాయి. మోడీకి ఇదీ అలవాటే కాబట్టి దులిపేసుకుని లైట్  తీసుకుంటాడు. లోకాయుక్తగా HCJ చెప్పిన వ్యక్తిని  అంగీకరించడం మినహా మరో గత్యంతరం ఉండదు.కాకపోతే.. లోకాయుక్త మాకు వ్యతిరేకంగా రిపోర్టులు ఇస్తాడేమోననే సందేహాన్ని సుప్రీం కోర్టు సాక్షిగా వ్యక్తపరచే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ కొత్త లోకాయుక్త గత  10ఏళ్ళ కాలంలోని స్కాములు ఏవైనా వెలికి తీస్తే.. మన మోడీ గారు మరియూ వారి భజనపరులైన అరున్ జైట్లీ లాంటి వారు.. ఏమాత్రం  కంగారు పడకుండా.. T.V గొట్టాలముందుకు వచ్చి, లోకాయుక్త కాంగ్రెసు మనిషని,  సోనియా గాంధీ దగ్గరుండి ఆ రిపోర్టు రాయించారనీ..అందుకే తాము ముందు నుండీ   లోకాయుక్త నియామకాన్నివ్యతిరేకిస్తున్నామనీ.. తాము భయపడిందే జరిగిందనీ..పైపెచ్చు.. కేంద్రంలోని సోనియా గాంధీ ఈ విధంగా 6 కోట్ల గుజరాత్ ప్రజల్ని అవమానిస్తున్నారని, దానినుండి కూడా ఓట్లు రాబట్టడానికి ప్రయత్నించవచ్చు.


ఈ రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. దానిని అనుకూలంగా మార్చుకునే చావు తెలివితేటలు మోడీకి చాలానే ఉన్నాయి.ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిసి కూడా సుప్రీంకోర్టు గడప తొక్కడంలో ఆంతర్యం అదే.. 


ఇక ఈ మొత్తం వ్యవహారంతో మరో సారి స్పష్టంగా నిరూపితమైంది ఏదైనా ఉందంటే అది, 'అవినీతి పై అన్నాకు మద్ధతు' పేరుతో BJP సాగిస్తున్న కపట నాటకం. ఒక వైపు కేంద్రంలో బలమైన లోక్ పాల్ ని తేవాలని అన్నాతో కలిసి ఆందోళనలు చేస్తూ మరో వైపు తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లోకాయుక్తని గత 10ఏళ్ళుగా నియమించలేదంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి..?  

Friday, August 26, 2011

ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు - అయ్యేపనేనా?



రిజర్వేషన్ల గురించి TVల్లో, వివిధ బ్లాగుల్లో ఎప్పుడు చర్చ జరిగినా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలనే ఒక వాదన చాలా మంది వినిపిస్తుంటారు. ఆర్థిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు అనేది ఓ మాంచి రొమాంటిక్ థాట్. ఆర్థికంగా వెనబడిన వాల్లకు రిజర్వేషన్లు ఇస్తాం, పేదోల్లెవరో వచ్చి క్యూ లో నిలబడండి అని ఒకసారి అనౌన్స్ చేసి చూడండి. బాగా డబ్బున్న మారాజులందరూ సొంత వాహనాల్లో వెల్లి, మేము చాలా పేదోల్లమంటూ క్యూ లో ముందు నిలబడ్తారు, చేతుల్లో MRO ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా.(MRO చేతిలో ఎంత ఎక్కువ పెడితే, మన ఆదాయం అంత తక్కువగా రాస్తాడనేది తెలిసిందేగా) పాపం నిజంగానే డబ్బులేనోల్లేమో బస్సుల్లో,పాసింజర్ రైల్లలో వెల్లి క్యూ లో ఆఖరున నిలుచుంటారు.

అసలు మనదేశంలో ఎవరిదగ్గర ఎంత సంపద ఉందో, ఎవరి ఆదాయం ఎంతో,వంశపారంపర్యంగా అప్పణంగా వచ్చి పడుతున్న ఆస్తులెంతో ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలున్నాయా? పన్నులు ఎగ్గొట్టడానికీ, ప్రభుత్వ సంక్షేమ పధకాలు పొందటానికి ఉన్న అదాయాన్ని/సంపదను బయటపెట్టకుండా, మేము పేదోల్లమని ప్రకటించుకోవడానికి ఏమాత్రం సంకోచం లేని 120 కోట్ల ప్రజలున్న దేశంలో, అసలు అలా ఆర్థిక వెనుకబాటు లిస్ట్ తయారు చేయడం సాధ్యమయ్యే పనేనా..?
సాధ్యం కాని ప్రాత్యమ్నాయాలతో ఆదర్శాలు వల్లెవేయకుండా ఉన్న వ్యవస్థను కొనసాగిస్తూనే దానిలోని లోపాలను సవరించడంపై దృష్టిపెడితే బాగుంటుంది.

Tuesday, August 16, 2011

ఎలక్షన్లు,పార్లమెంట్,అసెంబ్లీలను నిషేధించాలి!!!

తిండి మానేసి నేను చెప్పినట్లు చేయకుంటే చస్తానని బెదిరించే ప్రతివాడూ గాంధీగారిలా ఫీలైపోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని ఎవరు చేసినా వారికి గుడ్డిగా మద్దతు పలికే ప్రతిపక్షాలు, TRP రేటింగ్ల కోసం గోరంతను కొండత చేసి చూపడంలో పోటి పడుతున్న మీడియా, వీరందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న, తెలంగాణా ప్రకటించకపోతే చస్తానంటూ KCR నిరాహారదీక్షకు పూనుకున్నాడు. ఇంకేముంది పోతాండంట..పోబోతున్నాడంట..కోమా అంట.. అంటూ ఒకటే ఫ్లాష్ న్యూసులు. సహజంగానే చావు అనేది బలమైన సెంటిమెంట్ కాబట్టి ప్రజల్లో కూడా ఎక్కడలేని సానుభూతి. ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్లుగా, నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అంటూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.ఇక వేరే గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటన చేయడం, చర్చలు,సంప్రదింపులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ తర్వాత జరిగిన సంఘటనలు తెలిసిందే.
KCR దీక్ష నుండి స్పూర్తి పొందాడో ఏమో గానీ, అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్లుగా, ఇప్పటికిప్పుడే దానిని అంతమొందిస్తానన్నట్లుగా దీక్షలకు పూనుకుంటున్నాడు అన్నా హజారే. ఇక peepli live మీడియా, ప్రభుత్వానికి మైనస్ ఐతే, మనకు ప్లస్సే అనుకునే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.

సరే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అన్నా హజారే బృందం చెబుతున్నట్లుగా వారు తయారు చేసిన లోక్పాల్ బిల్లుని పార్లమెంటులో పెట్టి ఆమోదించేయడమా? ఇక ఆ తర్వాత వీరు మల్లీ ఇలాంటి దీక్షలకు పూనుకోకుండా మూటా ముల్లే సర్దుకుని,పౌర సమాజాన్ని మూసేసుకుని హిమాలయాలకు వెల్లిపోతారా..? లేక,  దేశ ప్రజలకు  ప్రభుత్వం పైన కంటే, ఇలాంటి పౌర సమాజం పైన మాత్రమే నమ్మకముంది కాబట్టి పార్లమెంటుని, అసెంబ్లీలని రద్దు చేసి, అన్నా హజారే గారి అధ్యక్షతన పౌరసమాజాన్నే పాలించమందామా..?
అన్నా హజారే దీక్షకు వస్తున్న స్పందనను చూసి, భవిష్యత్తులో మరికొంత మంది నాయకులు ఇలా దీక్షల బాట పడితే పరిస్తితి ఏంటి..?
ఉదాహరణకి ముంబై లోని మరాఠా ప్రజలకి అన్యాయం జరిగి పోతుందని బాల్ ధాకరే గారు మహారాష్ట్ర లోని ఊరూ వాడా తిరిగి, ఉన్నవి లేనివీ జనాలకి నూరిపోసి, ముంబై నుండి ఇతరుల్ని తరిమి వేయాలని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే..?
తమిళులకి దేశంలో తీరని అన్యాయం జరుగుతుందనీ, తమిలులకి, కాష్మీర్ తరహా ప్రత్యేక మినహాయింపులో,లేక ప్రత్యేక దేశమో కావాలని కరుణానిధి నిరాహార దీక్షకు పూనుకుంటే..?
దేశంలో రిజర్వేషన్ల వల్ల అగ్రకులాల యువకులకు తీరని అన్యాయం జరుగుతుందనీ, రిజర్వేషన్లను ఎత్తేయ్యాలనీ ఏ సుబ్రమన్య స్వామి లాంటి వారో ఆమరణ నిరాహార దీక్ష కి సిద్ధపడితే. సహాజంగానే అగ్రకులాల ప్రజలు ఆయన దీక్షకు మద్దతుగా తండోపతండాలుగా తరలి వస్తారు.ఇక peepli live మీడియా ఉండనే ఉంది.
ఇక అప్పుడు రిజర్వేషన్లను తీసేద్దామా..?

ఇప్పటికే ఎలక్షన్ల నిర్వహణకి బోలెడంత ప్రజాధననం ఖర్చవుతుందంట. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్లను నిషేధించి వాటి స్థానంలో దీక్షల పోటీలను  పెట్టాలి. అంటే ఎవరు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ నాయకునికి దేశంపైన,ప్రజలపైన అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు నిర్ధారించి వారికే పాలించే అవకాశం ఇవ్వాలి. జై దీక్షలు..జై జై దీక్షలు.

My previous post on the similar topic:

http://andamainacheekati.blogspot.com/2011/06/blog-post.html

Friday, July 29, 2011

ఆజాద్ చర్చలు - ఫ్లాప్ మూవీకి రీమేక్!!!

2010లో, తెలంగాణాపై తేల్చటానికని కేంద్ర ప్రభుత్వం ఓ ఐదుగురు తటస్థులతో నీతి నిజాయితీ గల నికార్సైన వ్యక్తిగా పేరున్న జస్టిస్ శ్రీక్రిష్ణ గారి అద్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు ఈ కమిటీ ఎదుట హాజరై తమ వాదనలు, అభిప్రాయాలు వెలిబుచ్చారు. దినపత్రికలు,వార్తలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఎవరికైనా అప్పట్లో చర్చల అనంతరం బయటికి వచ్చిన తెలంగాణా నాయకులు T.V మైకుల ముందు ఏమన్నారో గుర్తుండే ఉంటుంది. "కమిటీ సభ్యులు మేం చెప్పింది పూర్తిగా,శ్రద్ధగా విన్నారు", "తెలంగాణాకు అనుకూలంగా రిపోర్టు ఇస్తారని మాకు పూర్తి నమ్మకం కలిగింది" లాంటి అభిప్రాయాలు దాదాపు అందరి నోటినుంచి వచ్చాయి. KCRగారైతే మరో అడుగు ముందుకు వేసి, జస్టిస్ శ్రీక్రిష్ణ గారి నైతికత హిమాలయాలంత ఎత్తు అనీ, రిపోర్టును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగ ఇస్తారనే నమ్మకముందని స్టేట్మెంట్లిచ్చేశారు. ఇదే రకంగా సీమాంధ్రా నాయకులు,ప్రజాసంఘాల వాదనలు కూడా విన్న శ్రీక్రిష్ణ కమిటీ, తెలంగాణా వారు చెప్తున్న అన్యాయం,దోపిడీ లాంటివి వట్టిమాటలని తేల్చెశారు.ఇక అప్పటిదాకా శ్రీక్రిష్ణ మంచోడు,మంచోడు అన్న నోల్లే, రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించేసి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు చేశారో గుర్తుండే ఉంటుంది. "జస్టిస్ శ్రీక్రిష్ణ అమ్ముడుపోయారు"," శ్రీక్రిష్ణ కమిటీ దిక్కుమాలిన కమిటీ","సీమాంధ్ర నాయకుల ప్రలోభాలకు లొంగిపోయారు" లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో తె.గ నాయకులు పోటీ పడ్డారు.
ఇక మధుయాష్కీ ఐతే- సీమాంధ్ర నాయకులు శ్రీక్రిష్ణ కమిటీ సభ్యులకు దుబాయ్ లో ఫ్లాట్లు కొనిచ్చారనీ, దీనికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయనీ సమయమొచ్చినప్పుడు బయట పెడతాననీ నిస్సిగ్గుగా చెలరేగిపోయాడు. ఆ ఆధారాలు ఎప్పుడు చూపిస్తావని తర్వాత తెలంగాణాలో ఎవరూ మధుయాష్కీని అడగలేదు, ఈయన చూపించనూ లేదు. తమ ప్రజల అమాయకత్వం మీద ఈ నాయకులకి ఎంత నమ్మకమో!

ఇలాంటి నిరాధార,అడ్డగోలు ఆరోపణలతో శ్రీక్రిష్ణ రిపొర్టు 'ఓపెనింగ్స్ బాగున్నా, కమర్షియల్ గా ఫ్లాప్' ఐన సినిమాలా తయారయ్యింది.ఇక లేటెస్టు గా, ఈ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేయడానికన్నట్లుగా  ఆజాద్ మల్లీ చర్చలు షురూ చేసి, తె.గ కాంగ్రెస్ నాయకులతో గంటలు గంటలు మంతనాలు సాగించాడు. ఈ మీటింగుల నుంచి బయటికి వచ్చిన తె.గ నాయకుల స్పందన, శ్రీక్రిష్ణ కమిటీతో చర్చల అనంతరం లాగానే ఉంది. -"తరతరాలుగా తెలంగాణా కి జరిగిన అన్యాయాన్ని కల్లకు కట్టినట్లు ఆజాద్ కి వివరించాము, ఆయన చాలా శ్రద్ధగా విన్నడు.మద్యలో అక్కడక్కడా కంటతడి కూడా పెట్టిండు.( వెనక నుంచి- ముక్కు కూడా చీదుకున్నడు), కాబట్టి తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటడని మాకు పూర్తిగా నమ్మిక ఉన్నది". ఇక షరా మామూలుగానే తర్వాతి రీలు, సీమాంధ్ర నాయకులతో చర్చలు. వీరితో కూడా చర్చలు ముగించాక కాంగ్రేస్ హై కమాండ్ కి, ఆజాద్ రిపోర్టు సమర్పిస్తారట. ఈ రిపోర్టు కూడా ఎలా ఉండబోతుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఈ రిపోర్టును తయారు చేయటానికి ఆజాద్ 2 నెలలు సమయం కావాలన్నాడట. అంత టైం ఎందుకు అంటే రంజాన్ ఉంది కాబట్టి అనేది ఒక రీజను. రంజాను కీ, చర్చలకీ సంబంధం ఏమిటో..? ఉపవాసాలు ఉంటూనే,చర్చలు గట్రా చేయకూడదా..? ఏదేమైనా, ఆజాద్ నివేదిక ఎప్పుడు ఇచ్చినా.. శ్రీక్రిష్ణ కమిటీ లాగానే ఆజాద్ కూడా ఆరోపణలు,నిందలు భరించటానికి సిద్ధం కావాల్సిందే. "ఆజాద్ అమ్ముడు పోయాడు", "ఆజాద్ ద్రోహి"," ఆజాద్ కి సీమాంధ్రా నాయకులు చంద్ర మండలంలో ఫ్లాట్ కొనిచ్చారు,దీనికి మాదగ్గర బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి" లాంటి కామెంట్లు భవిష్యత్తులో బుల్లి తెర సాక్షిగా చూడాల్సి రావచ్చు. అప్పటిదాకా Lets wait and see..

Thursday, June 30, 2011

అవినీతి-దీక్షలు-ప్రజాస్వామ్యం-సినిమా!!!

ఫస్టాఫ్ లో ఎక్కడ చూసినా అవినీతి,అరాచకత్వం రాజ్యమేలుతుంటుంది. ప్రజలందరూ, ఈ అవినీతి వల్ల నానాకష్టాలు  పడుతుంటారు.ఇదంతా చూసి మన హీరో గారికి రక్తం ఉడికి పోతుంటుంది. చూసే ప్రేక్షకులకి కూడా సేం ఫీలింగ్... ఇంటర్వెల్ కి ముందు ఓ పెద్ద ట్విస్ట్. అప్పటిదాకా సాధారణ వ్యక్తిగా ఉన్న మన హీరో గారికి ఓ మంత్రదండం లాంటి అతీత శక్తో, లేక రాత్రికి రాత్రి, CMగానో,PMగానో మారిపోవడమో జరుగుతుంది. దానితో మన హీరో గారు రెచ్చిపోయి, "ఇక అవినీతి పరుల భరతం పడతానని ఓ పంచ్ డైలాగ్ తో శపధం చేస్తాడు. చూసే జనాలకి ఎక్కడలేని ఎక్సైట్మెంట్!!  ఇక సెకండ్ హాఫ్ లో, అవినీతి పరులతో హీరోచితంగా పోరాడి, మొత్తానికి సినిమా ఐపోయే టయానికి అవినీతిని, సంస్కారవంతమైన XXX సబ్బుతో కడిగినట్లు, కడిగిపాడేస్తాడన్నమాట.ప్రేక్షకులు మస్తు ఖుష్, సినిమా బంపర్ హిట్!!.ఇది ఇప్పటికే దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ టెస్టెడ్ సక్సెస్ ఫార్ములా. రీల్ లైఫ్, రియల్ లైఫ్ వేర్వేరని తెలిసినా, ఒక్కోసారి రీల్ లైఫ్ లోలాగా రియల్ లైఫ్ లో జరిగితే బాగుంటుందనిపిస్తుంది. అవినీతి పై యుద్ధం చేస్తానని ఎవరైనా ప్రకటించగానే, సినిమాల్లో హీరో  లాగా, వీరు కూడా విజయం సాధిస్తే అవినీతి పూర్తిగా అంతమైపోతుందేమోననే చిన్న ఆశ అందర్లోనూ.
 “ఆయనెవరో అవినీతి మీద యుద్ధం ప్రకటించాడంట, అవినీతి అంతమయ్యే వరకూ అన్నం ముట్టనని, గాంధీ గారిలాగా దీక్ష చేస్తున్నాడంట, అదేదో బిల్లు తెమ్మని అడుగుతున్నాడంట, దానికి మన పెబుత్వమోల్లు ఒప్పుకోవడం లేదంట, ఆ బిల్లు గాని తెస్తే, లోక్ పాల్ అని ఎవరో ఒకాయన వస్తాడంట, అవినీతి పరుల్నందర్నీ చిన్న పెద్ద తేడాల్లేకుండా ఎక్కడికక్కడే శిక్షిస్తాడంట, అలాగ్గాని  చేస్తే మన దేశంలో అవినీతి అనేదే ఉండదంట.
జై దీచ్చ, డౌన్ డౌన్ పెబుత్వం”.  - ఇదీ ఇంటర్నెట్లోని వివిధ సైట్లలో మెజారిటీ నెటిజన్ల కామెంట్ల సారాంశం.
                                                  
దీక్షాసీనులు, వీరి మద్దతుదార్లు అందరూ 'పౌర సమాజం' అని ఓ పేరు పెట్టేసుకుని, మేము చెప్పినట్లు బిల్లు తెస్తారా లేక మల్లీ దీచ్చ చేయాల్నా అని, ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నారు. ఈ సమాజమోల్లు చెప్పేది వినడానికి బాగానే ఉంది కానీ, కాస్త లోతుగా అలోచిస్తేనే, బొమ్మకున్న మరో కోణం పై అణుమాణాలు కలిగేది.

ఇంతకూ ఈ లోక్ పాల్ ని ఏ స్వర్గం నుంచి, ఎవరు పట్టుకొస్తరు?

ప్రధాన మంత్రి పైన ఐనా, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులపై ఐనా సూమోటో గా కేసులు బనాయించే అధికారం, శిక్షలు వేసే అధికారాలు కూడా కావాలంటున్న ఈ లోక్పాల్ ని ఎవరు ఎలా నియమిస్తారనే దానిమీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  పౌర సమాజ ప్రతినిధులు చెప్పేదాని ప్రకారమైతే,  లోక్ పాల్ సెలెక్షన్లో ప్రజలకు గానీ,ప్రజా ప్రతినిధులకు గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అంటే,ప్రజల చేత ఎన్నుకోబడిన MPలు,MPల చేత ఎన్నుకోబడిన PM, Cabinetలు ఓ పక్క, వీరితో సంబంధం లేకుండా వీరందరికంటే ఎక్కువ అధికారాలుగల లోక్పాల్ మరో పక్క అన్నమాట. ఇన్ని అధికారాలుగల లోక్పాల్ కి కుల,మత,ప్రంతీయ రాగ ద్వేషాలు గాని ఉంటే, ఇక అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ఇలాంటి రాగ ద్వేషాలు లేని నిఖార్సైన వ్యక్తి ఐనంతవరకూ ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.  అలాంటి నిఖార్సైన వ్యక్తిని ఎవరు,ఎలా ఎన్నుకుంటారనేది అసలు సమస్య. 
ఉదాహరణకి, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో NDA అధికారంలోకి వచ్చిందనుకుందాం. అప్పుడు లోక్ పాల్ గా ఏ కాంగ్రేస్ పార్టీ  సానుభూతిపరుడో ఉంటే పరిస్తితి ఎలా ఉంటుంది? కాంగ్రేస్ పార్టీ వారు ప్రతి రోజూ NDA ప్రధాని మీద ఏదో ఒక ఆరోపణ చేయడం, దాని ఆధారంగా లోక్ పాల్ ప్రధానిని విచారించడం,విసిగించడం.. వీలైతే మార్చమని అడగటం..ఇదీ తంతు.

లోక్పాల్ పాపాల్ చేస్తే..?

 "మానవుడు పాపి, పాపాల్ చేయని మానవుడు ఎవడూ ఉండడు" అని K.A.పాల్ చెప్పినట్లుగా, లోక్పాల్ ఏ మైనా తప్పులు చెస్తే, అతన్ని శిక్షించే అధికారం,పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికుంది అనే దాని మీద, పౌర సమాజా ప్రతినిధులక్కూడా స్పష్టత ఉన్నట్లులేదు. ఒక వేల, లోక్ పాల్ ని శిక్షించే అధికారం ప్రధాన మంత్రికి కానీ, న్యాయ వ్యవస్థ కి కానీ  ఉందనుకుంటే, వీరిని మల్లీ లొక్ పాల్ కిందికి తేవాలనడం అర్థరహితం. నీతి,నిజాయితీలతో పనిచేస్తామని ప్రజల వోట్లతో గెలిచి, మల్లీ ఐదేల్ల తర్వాత ప్రజల ముందుకెల్లాల్సి ఉంటుందని తెలిసిన ప్రజాప్రతినిధులే ఇంతలా అవినీతికి పాల్పడుతున్నప్పుడు, ఇవేవీ లేకుండా ఎవరో కొందరు వ్యక్తులు అపాయింట్ చేసిన ఓ అధికారి మాత్రం నీతిగా,ప్రలోభాలకు లొంగకుండా ఉంటాడని ఎలా నమ్మడం?  
ఇంతకూ వీరు ఎలక్షన్స్ లో ఎందుకు నిలబడరు?

 
ప్రజాస్వామ్యము, ఎన్నికలలో పోటీ చేయడం వంటి వాటిమీద, ఈ దీక్షాసీనుల అభిప్రాయం కాస్త కంఫ్యూజింగ్ గా ఉంది. తమకు 100 కోట్ల భారతీయుల మద్దతు ఉందనీ, తమ మీద దాడులు చేసినా,తమ అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోకున్నా దేశ ప్రజల్ని అవమానించడమే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. వీరికి అంత మంది మద్దతు ఉన్నప్పుడు, వీరే ఎలక్షన్లలో నిలబడవచ్చు కదా? నిజంగానే అంత మంది మద్దతిస్తే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బంపర్ మెజారిటీతో గెలిచి వీరే అధికారం లోకి రావచ్చు. అప్పుడు ఎన్ని బిల్లులైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దానికి మహా అంటే మరో 5 ఏల్లు పట్టవచ్చు. అవినీతిని ఇన్నేల్లు సహించాక, మరో 5 ఏల్లు ఆగలేరా..?  అప్పట్లో అంటే, చట్టం బ్రిటీష్ వారిది కాబట్టి, మరో దారి లేక గాంధీ గారు నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న చట్టం మనం రాసుకున్నది. ప్రభుత్వ పరిపాలనలో ఏమైనా లోపాలున్నాయనుకున్నప్పుడు, ఆ లోపాలేవో జనాలకు వివరించి, జనం మద్దతు ఉందనుకుంటే ఎవరైనా సరే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి, ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. దీనికి కాస్త సమయం పట్టవచ్చేమో కానీ, అసాధ్యం మాత్రం కాదు.    ఈజిప్ట్,లిబియా,టూనీషియా,బహ్రైన్ లాంటి చిన్న,చిన్న దేశాలు కూడా తమకు ప్రజాస్వామ్యం కావాలని ఉద్యమాలు చేస్తుంటే,మన దేశంలో మాత్రం, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కంటే, సర్వాధికారాలు కల ,ప్రజలతో ఎన్నుకోబడని డిక్టేటర్ లాంటి వ్యవస్థ కావలని ఉద్యమాలు జరుగుతుండటం శోచనీయం.


ఏదేమైనా, అవినీతి పైన దేశ ప్రజలకు ఎంత ఏహ్యభావం, ఆగ్రహం ఉందో నిరూపించడంలో మాత్రం, పౌర సమాజ ప్రతినిధులు పూర్తిగా విజయం సాధించారు. దానికి వీరిని  అభినందించవలసిందే. అట్లే అవినీతిని అరికట్టడానికి తీసుకునే ఏ చర్య ఐనా, ప్రజాస్వమ్య చట్టాలకు లోబడి, ప్రజాస్వామ్యాన్ని బలపరిచేదిగానే ఉండాలితప్ప , బలహీన పరిచేదిగా మాత్రం ఉండదని ఆశిద్దాం.