గత వారం అస్సాం,మైన్మార్లలోని ముస్లింలపై దాడుల్ని ఖండించడం పేరుతో ముంబైలో జరిగిన ర్యాలీ సంధర్భంగా ముస్లింలు విధ్వంసానికి ఒడిగట్టారు. మంద బలానికి రెచ్చిపోయి పొలీసు,మీడియా లకు సంబంధించిన వాహనాలు తగులపెట్టడంతో పాటు, అనేక మంది పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వీరిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
అస్సాం, మైన్మార్లలో ఏం జరుగుతుంది, అక్కడ జరిగే హింస కేవలం మత ప్రాతిపదికమీదేనా..? అక్కడ నిజంగానే ఏక పక్ష దాడులు జరుగుతున్నాయా అనే విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ఒకవేళ ముంబై ముస్లింలు భావిస్తున్నట్లు అస్సాం లో ముస్లింలపై దాడులు నిజమైనవే అనుకున్నప్పటికీ.. దానికి వీరు ప్రతిస్పందించిన తీరు మాత్రం అత్యంత గర్హనీయమైంది.ఎక్కడో అస్సాంలో జరుగుతున్న చర్యలకి వీరు ముంబైలో ప్రతిచర్య చేద్దామనుకుంటే, అది 2002 లో గొధ్రా అనంతరం మోడీ చెప్పిన చర్య-ప్రతిచర్యను సమర్థించటం తప్ప మరేం కాదు. అస్సాంలో జరుగుతన్న హింసను తలుచుకుని ముంబైలోని పోలీసుల మీద, పాత్రికేయుల మీద దాడులకి తెగబడ్డారంటే అది వీరి మూర్ఖత్వానికి,వెర్రి ఆవేశానికి నిదర్శనం. అలాంటప్పుడు ఇదే వెర్రి ఆవేశంతో గోధ్రా అనంతరం ముస్లింలపై దాడులకి పాల్పడిన నిందితుల్ని శిక్షించమని అడిగే అర్హత వీరికెక్కడుంది.
వీరి దాడుల్ని లైవ్ ప్రసారాల ద్వారా,ఫోటోల ద్వారా దేశం మొత్తం చూసింది.
మల్లీ ఇంకోసారి ఇలాంటి దాడులు జరగకుండా ఇప్పుడు నిందితులకి కనీసం శిక్షలైనా విధిస్తారా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే మైనారిటీ వోట్లకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ ఆ పని చేయలేదు. పోనీ భవిష్యత్తులో ఎప్పుడైనా అక్కడ శివసేన ఆధ్వ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడైనా వీరికి శిక్షలు విధిస్తారా అంటే.. అదీ జరగదు. ఎందుకంటే, ఈ ఒక్క దాడుల నిందితుల్ని శిక్షిస్తే, గతంలో జరిగిన అనేక దాడుల నిందితుల్ని కూడా శిక్షించాల్సి ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి 1993లో ముంబై అల్లర్ల దాడులపై శివసేన అధినాయకునితో సహా అనేకమంది శివసేన కార్యకర్తల్ని నిందితులుగా నిర్థారిస్తూ జస్టిస్ శ్రీక్రిష్ణ సమర్పించిన రిపోర్టును అన్ని పార్టీలు కలిసి అటకెక్కించాయి. ఆ రిపోర్టుని కదిలిస్తే మెజారిటీల వోట్లు పోతాయని ఈ పార్టీలకి భయం. తిలా పాపం తలా పిడికెడు అన్నమాట.
అసలు అస్సాంలో ఏం జరుగుంది అనే దాని మీద భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుండి ముస్లింలు తండోపతండాలుగా వచ్చి అక్కడి స్థానిక బోడో లపై పెత్తనం చలాయించాలని ప్రయత్నించడం వల్ల సమస్య మొదలైందని చెప్పే వారు కొందరైతే, అలాంటిదేమీ లేదనీ అస్సాంలో ఇతర విభిన్న జాతులపై ఆధిపత్యం కోసం బోడోలే ఈ దాడులకి పాల్పడుతున్నారని, దానికోసం బ్రిటిష్ వారి కాలంలో బెంగాల్ నుండి అస్సాంకి వలస వెల్లి అక్కడే స్థిరపడిన బెంగాలీ మాట్లాడే భారత ముస్లింలందరినీ బంగ్లాదేశీయులుగా చిత్రించి దాడులకి పూనుకుంటున్నారనీ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వాదనల్లో నిజానిజాలేమిటో వెలికి తీయాల్సిన భాధ్యత ప్రభుత్వంపై వుంది. చొరబాటుదారుల్నందరినీ(నిజంగానే ఉంటే) తక్షణమే దేశం నుండి పంపించి వేయాల్సిన అవసరం ఉంది. అట్లే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా దేశ సరిహద్దుల చుట్టూ హైవోల్టేజ్ ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయాలి. కానీ, ఎన్నికల్లో గెలుపోటములు తప్ప మరేం పట్టని మన ఘనతవహించిన పార్టీలు దీనికి పూనుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.
కొసమెరుపేంటంటే.. అస్సాం ని సందర్శించిన అద్వానీ గారు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింల వల్లనే సమస్యలు వస్తున్నాయని ఏ మాత్రం అణుమానం లేకుండా అనౌన్స్ చేసేశారు. అద్వానీ అంతటోడు చెబితే అది నిజం కాకుండా ఉంటుందా అంటూ అతని అభిమానులందరూ ఈ వాదనకే ఫిక్స్ ఐపోయారు. కానీ ఇదే అద్వానీ, గతంలో ఓ సారి పాకిస్తాన్ సందర్శించి జిన్నా గొప్ప లౌకిక వాది అని అనౌన్స్ చేయగానే, ఇదే అభిమానులు అతనిపై అంతెత్తున లేచి, అతనికేం తెలీదని డిసైడ్ చేసేసి అతన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేశారు.
కొన్నిసార్లంతే.. మైండ్ తనకి నచ్చిన వాటినే రిసీవ్ చేసుకుంటుంది. నిజానిజాలు, ఆధారాల్తో సంబంధం లేకుండా..