Saturday, April 14, 2012

ఈ పాడు పని కూడా వారిదే!!!

టైంస్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఈ వార్త చూడండి.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Saffron-extremists-desecrated-temple-to-trigger-riots-Cops/articleshow/12657326.cms

 వారికి కావలసింది -ప్రజలు మతాల వారిగా విడిపోవాలి, ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాలి-ఒకరిపై ఒకరికి ద్వేషం కలగాలి. అప్పుడు హిందూ పరిరక్షకులమని వీరు ఎంటరవుతారు. ప్రభుత్వం, పోలీసులు,కోర్టులు అందరూ ముస్లింల పక్షం వహించి హిందువులకు ద్రోహం చేస్తున్నాయని గొంతు చించుకుంటారు. తాము అధికారంలో ఉంటే ఇలా జరగదని నమ్మబలుకుతారు. క్రమంగా ఓటుబ్యాంకును పెంచుకుంటారు. Fishing in Troubled waters అనేది వీరికి బాగా ఒంటబట్టింది.దీని ద్వారా వీరికి కావలసిన రాయకీయాధికారం విజయవంతంగా పొందుతారు. పాపం.. వీరి వలలో పడే ఆ అమాయక చేపలే బలయ్యేది..
Related Previous posts - 

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )  http://andamainacheekati.blogspot.in/2012/01/blog-post.html 

'ఆత్మస్థుతి-పరనింద ' మాంచి కిక్ ఇచ్చే కాంబినేషన్ http://andamainacheekati.blogspot.in/2010/12/blog-post_24.html

Sunday, April 8, 2012

మతకలహాలు--లాభనష్టాలు

"మతకలహాలు కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే చేయిస్తున్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. నిందితుల్ని తొందర్లోనే అరెస్టు చేస్తాం- వారిని వదిలేది లేదు-" మతకలహాలు జరిగిన ప్రతిసారీ మన పోలీసు బాసులు వల్లె వేస్తున్న రొటీన్ డైలాగులు ఇవి. కానీ ఇప్పటిదాకా జరిగిన అనేక మతకలహాల్లో ఏ ఒక్కరికైనా శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఆ కుట్రదారులు ఎవరో, దేనికోసం వారు ఈ దారుణాలకి ఒడిగడుతున్నారో ఏ ఒక్కసారైనా ఆధారాలతో నిరూపించలేదు. 
మత కలహాల్ని సృష్టించేది ఎవరైనా వారు ఏదో ప్రయోజనాన్ని ఆశించే చేస్తుంటారనేది మాత్రం సుస్ఫష్ఠం. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న మతకలహాల్నే తీసుకుంటే, మొదట ఎవరు ప్రారంభించినా, గొడవలన్నీ ముగిసే సరికి బాధితులు,నిందితులు ఇరువైపులా ఉంటున్నారు. ఈ బాధితుల్ని పరామర్శించటం, పోలీసులు నిందితులుగా అణుమానించి అరెస్టులు చేసిన వారిలో నిజంగానే ఎవరైనా అమాయకులు ఉంటే వారి తరపున న్యాయపోరాటం చేసి, చట్ట ప్రకారం వారిని విడిపించేలా ప్రయత్నించటం ఆ ప్రాంత రాజకీయ నాయకుల బాధ్యత. పరామర్శల విషయమే తీసుకుంటే ఇరు మతాల్లో ఓటు బ్యాంకులు ఉన్నాయనుకునే తెలుగుదేశం, కాంగ్రెస్ లాంటి పార్టీల నాయకులు ఇరు వర్గాల బాధితుల దగ్గరికీ వెల్తారు. ఆల్రేడీ ప్రత్యర్థి వర్గం చేతిలో అప్పుడే గాయపడి/నష్ట పోయి ఉండటం వల్ల వీరు తమ ఆవేదనని కాస్త గట్టి గానే వెల్లగక్కుతారు. ఆ మతం వారే మొదట తమ మీద దాడి చేశారని, తాము మాత్రం పూర్తి అమాయకులమని,  అసలు తాము వారి మీద ఒక్కరాయిని కూడా విసరలేదనీ ఇలా తమ వైపు వాదనల్నే వినిపిస్తారు. ఇది సహజం. ఈ విషయం ఆ నాయకులకి కూడా తెలుసు కాబట్టి, ఓ అవునా, అలా చేశారా, సరే.. వారిని చట్ట ప్రకారం విచారించి శిక్షిస్తాం లాంటి రొటీన్ డైలాగులు ఇరువర్గాలకీ  చెప్పి పరామర్శల కార్యక్రమం  మమా అనిపించేస్తారు. అదే మతతత్వ పార్టీలైన BJP.MIM లైతే ఇరువర్గాలనీ కాకుండా, కేవలం తమ వర్గ బాధితుల్ని మాత్రమే  పరామర్శిస్తారు. ఎదుటి వర్గం గురించి వారు చెప్పే విషయాలకు చలించి పోతున్నట్లుగా, రెచ్చిపోతున్నట్లుగా నటిస్తారు. బేసికల్గా ఆ వర్గం వారు అంతేననీ, వారికి ఓ గట్టి గుణపాఠం చెప్తే తప్ప బుద్దిరాదని, ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల కోసం వారికి వంత పాడుతుందని అదే తమ ప్రభుత్వం గనక అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదనీ.. ఐనా సరే వారి రక్షణకోసం తాము ప్రాణాలకు తెగించైనా పోరాడతామనీ.. ఇలా అప్పటికే వారిలో ఉన్న ఆవేశాన్ని మరింతగా రగిలించడానికి ప్రయత్నిస్తారు.  ప్రజలకి  అభివృద్ధి,మంచి పాలన,పారదర్శకత - వీటన్నిటికన్నా 'రక్షణ ' అనేది అత్యంత ముఖ్యమైనఅంశం కాబట్టి, ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లలో, ఏ పార్టీ ఐతే తమకు పూర్తి రక్షణని కల్పించగలదో దానికే ఓట్లేస్తారు. అంటే ఇరువైపులా సమ్యమనం పాటించండి అని తటస్థంగా చెప్పే తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్మ్యూనిస్ట్ ల  లాంటి లౌకిక వాదపార్టీలకంటే, 'వారి ' నుండి మీకు రక్షణ కల్పిస్తామని  కాటగారికల్ గా చెప్పే MIM,BJP లాంటి పార్టీలకే ఆయా వర్గాలు ఓట్లేస్తాయి. ఈ రకంగా మత పరమైన గొడవలు జరిగినప్పుడు, ప్రజలు  మతాల వారీగా చీలిపోయి మతతత్వ పార్టీలు బలపడతాయి. ఒకప్పుడు పార్లమెంట్లో  కేవలం 2 స్థానాలున్న BJP అనతి కాలంలోనే కేంద్రంలో అధికారంలోకి రావడానికీ(రామ మందిర వివాదం ప్రధాన ఎజెండాగా), అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా పాతబస్తీ ప్రజలు ప్రతిసారీ MIM నే గెలిపించడానికీ ఈ మతపరమైన విభజనలే కారణం. కాబట్టి ఇలాంటి మతపరమైన విభజనలవల్ల అత్యధికంగా లాభపడేది ఇలాంటి పార్టీల నాయకులు, వారి అనుచరులు మాత్రమే. ఇక నష్టపోయేది మాత్రం ఇరువైపులా ఉన్న సాధారణ జనం. 
Related Previous posts - 

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )  http://andamainacheekati.blogspot.in/2012/01/blog-post.html 

'ఆత్మస్థుతి-పరనింద ' మాంచి కిక్ ఇచ్చే కాంబినేషన్ http://andamainacheekati.blogspot.in/2010/12/blog-post_24.html

Wednesday, February 29, 2012

చర్య-ప్రతిచర్య సిద్ధాంతానికి పెడర్థాలు..


ఏదైనా ఓ వస్తువును ఓ చర్యకు గురిచేస్తే, ఆ వస్తువు కూడా దానికి సమానమైన ప్రతిచర్యను కలిగిస్తుంది. ఇది ప్రఖ్యాత న్యూటన్ మూడవ సూత్రం. ఇక్కడ గమనించవలసిన విషయం, ఆ చర్య-ప్రతిచర్య అనేది కేవలం ఆ కర్త-గ్రహీత లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. A, Bపై చర్య చేస్తే, B ప్రతిచర్యను Aపైనే చూపిస్తుంది తప్ప, Cపై కాదు. ఒకవేళ అలా చేసిందంటే దానిని Cపై చర్యగా పరిగనించాలి తప్ప ప్రతిచర్యగా కాదు. ఇదీ స్థూలంగా చర్య ప్రతిచర్య సిద్ధాంతం. ఈ సూత్రం ప్రాణం లేని వస్తువుల గురించి ప్రతిపాదించబడింది. ఆధిపత్యం కోసం,మనుగడ కోసం ఒక జాతి మరోజాతిపై దాడులకు,ప్రతిదాడులకు దిగే ఆటవిక యుగంలో ఇది మనుషులకు కూడా వర్తించేదేమో కానీ, ప్రత్యేక చట్ట,న్యాయ వ్యవస్థల్ని కలిగిన ఏ ఆధునిక సమాజమూ దీనిని మనుషులకి వర్తింపచేయదు. ఎందుకంటే ఆధునిక సమాజంలో జరిగే ఎలాంటి చట్టవ్యతిరేక 'చర్య'కైనా,  'ప్రతిచర్య' చేసే బాధ్యత పోలీసు,న్యాయవ్యవస్థలకీ, ఇవి సక్రమంగా తమ విధుల్ని నిర్వర్తించేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికీ  ఉంటాయి. కానీ, సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చర్య ప్రతిచర్యల్ని ప్రజలకి గుర్తుచేసి కొన్ని వేల మంది అమాయకుల ఊచకోతకు కారణమవ్వడం అనేది ఆధునిక భారత ప్రజాస్వామ్యంపై  ఎన్నటికీ మాయని మచ్చ లాంటిది.
                            పదేల్ల క్రితం Feb27, 2002న జరిగిన గోధ్రా రైలు దహనం అనేది ముమ్మాటికీ ఓ హేయమైన చర్య. ఈ చర్యకు ప్రతిచర్య గా అక్కడి పోలీసు, న్యాయవ్యవస్థ నిందితులని గుర్తించి,విచారించి, నిందితులు ఎవరైనా, ఎందరైనా వారిని కఠినంగా శిక్షించవలసింది.కానీ దానికి విరుద్ధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బాధిత వర్గానికి చెందిన వారికి ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని తీర్మాణించేసి,  దీనికి కావలసిన తోడ్పాటును అందించవలసిందిగా  అక్కడి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారనేది ప్రధాన ఆరోపణ.  ఇది ఇంకా న్యాయస్థానాల్లో నిరూపించబడనప్పటికీ, ఆ రైలు దహనం ఘటన అనంతరం గుజరాత్ మొత్తం మీద కొన్ని రోజుల పాటు యదేచ్చగా జరిగిన సామూహిక సజీవ దహనాలు, మానభంగాలు, హత్యలు, చివరికి గర్భినులని కూడా కిరాతకంగా చంపడం, ఓ మాజీ  MPని కూడా అతని కుటుంబ సభ్యులతో  పాటు ఇంట్లో బంధించి సజీవ దహనం చేయడం లాంటివి అక్కడ ఉన్నత స్థాయిలో జరిగిన కుట్రల్ని కల్లకు కట్టేవే. ఎక్కడో ఏదో ఓ సంఘటన జరిగిందని దానితో ఏ మాత్రం సంబంధంలేని అమాయకుల మీద జరిగిన ఈ దారుణాల్ని ప్రతిచర్యగా కాక,చర్యగా చూడాల్సి ఉంది. మరి ఈ చర్యకి ప్రతిచర్యని ఎవరు ఎలా చేయాలి? ఈ ప్రతిచర్యని చట్ట ప్రకారం విచారించి అమలు చేయవలసిన పోలీసు, న్యాయవ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా..? చర్య జరిగేటప్పుడు బాధితుల ఆక్రందనల్ని ఏమాత్రం ఖాతరు చేయని పాలకులు, ఇప్పుడు కనీసం న్యాయం  పొందడంలోనైనా వారికి సహకరిస్తున్నారా..? అనేవి ఆలోచించాల్సిన ప్రశ్నలు. గుజరాత్ అల్లర్లలో సామూహిక జనహనన జరిగిన అనేక కేసుల్లో, సాక్షాత్తూ సుప్రీం కోర్టు కలగ జేసుకుని ఆఞాపించేవరకూ అక్కడి పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదనేది కాదనలేని కఠోర సత్యం. ఇక 14మందిని సజీవ దహనం చేసిన బెస్ట్ బేకరీ కేసు విచారణ జరిగిన తీరు గుజరాత్లోని  పోలీసు వ్యవస్థ నిష్క్రియాపరత్వానికి పరాకాష్టగా నిలుస్తుంది. మొదట ఈ కేసును విచారించిన అక్కడి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాక్షాలు లేని కారణగా మొత్తం 23 మంది నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది.అనంతరం దేశ వ్యాప్తంగా ఈ తీర్పుపై పెల్లుబికిన నిరసనల్నిపరిగణించిన సుప్రీం కోర్టు, ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయగా,పునర్విచారణలో అదే నిందితుల్లోని 9 మందికి జీవిత ఖైదు విధించబడింది. ఇలాంటి కేసులు అనేకం గుజరాత్లోని వివిధ జైల్లలో, వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా నిజాలు వెల్లడించడానికి ముందుకు వచ్చిన సంజీవ్ భట్ లాంటి పోలీస్ ఆఫీసర్లను, సస్పెండ్ చేయడం, పాత కేసుల్ని తిరగతోడి జైలు పాలు చేయడం ద్వారా  నిజాయితికి దక్కే నజరానా ఎంత కఠినంగా ఉంటుందో గుజరాత్ ప్రభుత్వం స్పష్టంగానే  హెచ్చరిస్తోంది.

ఆర్థిక అభివృద్ధిని చూసి మోడీని క్షమించవచ్చా..?

మోడీని గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా, గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్న గొప్ప CMగా అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ లాంటి వారు కొనియాడుతుంటారు.పైగా గుజరాత్ మతకలహాలనేవి గోధ్రా రైలు దహణానికి 'ప్రతిచర్యగా' మాత్రమే జరిగాయనీ, వీటి ఆధారంగా మోడీని తప్పుపట్టలేమనీ కూడా చెబుతుంటారు. 2007లో CNN-IBN ఇంటర్వ్యూలో,  'గుజరాత్లో ముస్లింలపై జరిగిన అఘాయిత్యాలకి చింతిస్తున్నారా..?' అని విలేఖరి కరణ్ థాపర్  అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని మోడీ ఆ ఇంటర్వ్యూని అర్థాంతరంగా ఆపేసి స్టూడియో నుండి వెల్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గుజరాత్లోని మతకలహాల బాధితులకి అతను ఏనాడూ కనీస సానుభూతిని కూడా చూపలేదని బహిరంగ సత్యం. ప్రజల్ని మతప్రతిపదికన విభజించి చూస్తూ, ఓ వర్గానికి న్యాయాన్ని, జీవించే హక్కును కాలరాస్తున్న ఓ వ్యక్తి, కొన్ని కోట్లరూపాయల పెట్టుబడుల్ని తీసుకురాగలిగినంత మాత్రాన గొప్పవాడు అయిపోతాడా..? గుజరాత్ ఘటనలకి చర్య-ప్రతిచర్య సిద్ధాంతాన్ని ఆపాదించి మోడీ నేరాన్ని, వైఫల్యాన్ని కప్పిఉంచడం, అక్కడి ఆర్థికాభివృద్ధిని చూపించి మోడీని జాతీయ నాయకునిగా నిలబెట్టడం వీరి తాపత్రయంగా కనిపిస్తుంది.

మరి గుజరాతీలు మోడీని ఎందుకు గెలిపిస్తున్నట్లు?

గుజరాత్ లో జరిగిన గొద్రా అనంతర మారణహోమాల్ని నివారించలేకపోవడంలోనూ,వీటికి కారకులైన నిందితుల్ని శిక్షించేలా అక్కడి పోలీసు,చట్ట వ్యవస్థల్ని సమాయత్తం చేయలేకపోవడంలోనూ గుజరాత్ ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీం కోర్టు అనేక సార్లు ఎండగట్టింది. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వ వైఖరి, దేశంలోని లౌకిక వాదులకు, ఇతర మైనారిటీలకు తీవ్ర అసంపృతిని కలిగిస్తూ, అక్కడి బాధితులపై సానుభూతిని కలిగిస్తున్నా , గుజరాతీలకు మాత్రం ఇదేమంత ప్రాధాన్యత ఉన్న అంశంలా అనిపించడంలేదు. 2002, మరియు 2007 అసెంబ్లీ ఎలెక్షన్లలో వారు మోడీకి అనుకూలంగా తీర్పు నివ్వడమే దీనికి నిదర్శనం. దీనిలో BJPకి రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్  అత్యంత బలహీన స్థితిలో ఉండటం ఒక కారణమైతే, అక్కడి హిందూ,ముస్లిం సమాజాల మధ్య గల స్పష్ఠమైన అంతరం(కమ్యునల్ డివైడ్) మరో కారణం.
                        మానవ మనస్తత్వ శాస్త్రం ప్రకారం, కష్టాల్లో ఉన్న ఓ వ్యక్తిపై, మరో వ్యక్తి చూపే సానుభూతి, వారిరువురి మధ్యగల సఖ్యతను, మరియు అతనిపై అప్పటికే ఏర్పరచుకుని ఉన్న అభిప్రాయాన్ని బట్టి  మారుతుంటుంది.  ఉదాహరణకు ఒక వ్యక్తికి కష్టాలలో ఉన్న మరో అపరిచిత వ్యక్తిపై ఉండేది సాధారణ(కనీస) సానుభూతి అనుకుంటే, అదే పరిస్థితుల్లో ఉన్న 'తన' వర్గానికి చెందిన వ్యక్తిపై ఆ కనీస సానుభూతి కంటే ఎక్కువే ఉండి, అతన్ని కష్టాలనుండి విముక్తి కలగజేయడానికి ప్రయత్నించేలా కూడా సమాయత్తం చేయవచ్చు. అట్లే ఆ కష్టాలలో ఉన్నది తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిస్తే, అతనిపై కనీస సానుభూతి కూడా ఉండకపోగా తన 'పాపాన్ని అనుభవిస్తున్నాడన్న' తాత్సార వైఖరి ఉంటుంది. ఇక్కడ వర్గం అనేది పరిస్థితుల్ని బట్టి కులం, మతం, భాషా, ప్రాంతం వీటిలో ఏదైనా కావచ్చు. అట్లే సానుభూతి చూపడంలో ఈ రకమైన వ్యత్యాసాలను ఆ కష్టాలలో ఉన్న వ్యక్తి పై అప్పటికే ఏర్పడి ఉన్న అభిప్రాయాన్ని బట్టి కూడా మారుతుంటుంది, అంటే  కష్టాలలో ఉన్నది మంచి వ్యక్తి అని తెలిస్తే అతనిపై ఎక్కువ సానుభూతి, అంత మంచి వాడు కాదు అనే అభిప్రాయం ఉంటే, తక్కువ సానుభూతి ఉంటుంది.దేశ విభజన సంధర్భంగా, గుజరాత్లో సరిహద్దు కిరువైపులా జరిగిన మత ఘర్షనలు  మొదులుకొని, RSS,VHP,భజరన్ దల్ లాంటి సంస్థలు ఆ తర్వాత అక్కడ ఒక పద్ధతి ప్రకారం  చేపట్టిన ముస్లింల పట్ల దుష్ప్రచారం ఫలితంగా, ముస్లింలు మిగతా వర్గాలనుండి పూర్తిగా వేరుచేయబడటంతో, వారి పట్ల ప్రభుత్వం ఎంత వివక్షాపూరితంగా వ్యవహరించినా అది మెజారిటీ ప్రజలకు నేరంగా అనిపించని పరిస్థితులు ప్రస్తుతం అక్కడ నెలకొని ఉన్నాయి. ఇలాంటి స్థితి దేశంలోని ముస్లింల మరియు ఇతర మైనారిటీల  మనుగడకు ఎంత ప్రమాదకరమో గుజరాత్ దారుణాలు తెలియజేస్తున్నాయి.

చాపకింద నీరులా ముస్లింల పరాయీకరణ

గుజరాత్ లో విజయవంతంగా పరీక్షించబడ్డ 'పరాయీకరణ ' చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే ప్రయత్నాలు చాపకింద నీరులా జరుగుతూనే ఉన్నాయి. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ వైఖరుల్ని ప్రత్యక్షంగా గమనించొచ్చు. కర్నాటకలోని భాగల్కోట్లో జనవరి 1,2012 నాడు జరిగిన సంఘటన దీనికో చిన్న ఉదాహరణ మాత్రమే. అక్కడ తహసిల్దార్ ఆఫీసు ఎదురుగా జనవరి 1 వ తేదీన ,పాకిస్తాన్ జండా ఒకటి వెలసింది. అక్కడి ముస్లిములే ఈ పని చేశారని శ్రీరాం సేన, భజరంగ్ దల్, RSS లాంటి సంస్థలు ధర్నాలు,ర్యాలీలు నిర్వహించి అనేక ముస్లింల షాపులు, మరీయూ ఓ మసీదును కూడా ధ్వంసం చేశారు. కానీ పోలీసు విచారణలో ఇది ముస్లింల పని కాదనీ, మత వైషమ్యాలను పెంచి దానిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అక్కడి స్థానిక BJP నాయకులు ఈ పని చేయించారనీ తేలింది. దీనిలో భాగస్వామ్యులైన 7 మందిని శ్రీరాం సేన కార్యకర్తలుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది దేశవ్యాప్తంగా పార్టీకి చెడ్డపేరు తెస్తుందని గ్రహించి వెంటనే తేరుకున్న రాష్ట్ర BJP ప్రభుత్వం, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన విషయాలేవీ బయటికి పొక్కనీకుండా  పోలీసుల్ని కట్టడి చేసేసింది. అక్కడి స్థానిక ముస్లింల అదృష్టం బాగుండి ఈ కుట్ర విఫలమైంది కానీ, లేకపోతే ఈ పాటికి ఎంత మంది అమాయకులు తమ ఆస్తులు,ప్రాణాలు కోల్పోయే వారో. ఇలా ముస్లింలను ఏదోఒక వివాదంలోకి లాగి వారిని ఇతర వర్గాలనుండి వేరు చేసి, వారిపట్ల ద్వేషభావం పెంచి పోషించడానికి ఈ కాషాయ వర్గాలు వాడే మరో అస్థ్రం -అసత్యాలు,అర్థ సత్యాలతో వక్రీకరించబడిన చరిత్ర. టిప్పు సుల్తాన్ అప్పటి కాలంలోని హిందువుల్ని ఏదో చేశాడనో, ఔరంగజేబు దుర్మార్గుడనో వారి గురించి ఉన్నవీ,లేనివీ కట్టుకథలు సృష్టించి ఆ ద్వేషాన్ని ప్రస్తుత ముస్లిం సమాజంపైకి మల్లించేలా ప్రయత్నిస్తుంటారు. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మరియు ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ మాటల్లో చెప్పాలంటే -"మధ్య యుగాలనాటి ముస్లిం పాలకులు అప్పటి హిందువులపై అనేక అకృత్యాలకు పాల్పడ్డట్లుగా, వేధింపులకు గురి చేసినట్లుగా ఏ మాత్రం ఆధారాలు లేని కట్టుకథలతో మన చరిత్ర  నింపబడింది." (Source:http://www.kgfindia.com/kalidas-ghalib.php) ఇలాంటి వక్రీకరించబడిన చరిత్రే దేశంలోని ముస్లింల భవిష్యత్తును అంధకారమయం చేయడానికి ఉపయోగించబడుతుంది.

చేటు తెస్తున్న కొందరు ముస్లింల మత చాందసవాదం

స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం, ముస్లింల పట్ల ప్రణాళికా బద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారానికి, కొంత మంది ముస్లింలు కూడా తమ మత చాందస వాదంతోనూ, మూర్ఖత్వం తోనూ సహాయపడుతున్నారు. దీనికి చక్కటి ఉదాహరణ ఇటీవల రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో పండుగల సంధర్భంగా విపరీతంగా పెరిగిపోతున్న జెండాలు మరియు బైక్ ర్యాలీల సంస్కృతి.నిజానికి విగ్రహారాధనకి,మత చిహ్నాలకీ చోటులేని ఇస్లాంలో ఈ జెండాల గొడవేమిటో అర్థం కాదు.ఇది కేవలం ఇటీవలి కాలంలోనే మొదలై, ప్రతి సంవత్సరానికీ విస్తరిస్తూంది. 'ఇతరులు కూడా చేస్తున్నారు కదా ' అనే ఓ గొర్రెదాటు వంక తప్ప దీనికి మరే ఇతర సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నట్లు కనిపించదు. కానీ ప్రశాంత వాతావరణంలో, చూసే వారికీ, చుట్టుపక్కలవారికీ కూడా సంతోషాన్ని పంచుతూ చేసుకోవాల్సిన పండుగలు ఇలా పోలీసు బందోబస్తు మధ్య బలప్రదర్శనకు వేదికగా మారడం శోచనీయం. పైగా, ఇలాంటి మత పరమైన విభజనలు, ఉద్రిక్త పరిస్థితులు, 'ఎద్దు పుండు కాకికి ముద్దు ' లా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాచుక్కూర్చున్న అతివాద శక్తులకే అంతిమంగా లాభం చేకూరుస్తాయనే సంగతిని, జరుగుతున్న సంఘటనల్ని  బట్టైనా గ్రహించలేక పోవడం వీరి మూర్ఖత్వానికి నిదర్శనం.
                       మతం మత్తులాంటిదని కార్ల్ మార్క్స్ చెప్పిన మాట అన్ని మతాలకు వర్తిస్తుంది.కానీ ఉరుకులు,పరుగుల దైనందిన జీవితంలోని ఒత్తిల్ల నుండి కాస్త స్వాంతన చేకూర్చటానికి, మంచి చెడుల స్పృహను
కలిగించడానికి  ఇది కొంత వరకూ అవసరమే. కానీ హద్దులు దాటిందంటే దీని అనర్థాలు చాలా తీవ్రంగానే ఉంటున్నాయి. 'మనోల్ల' మతోన్మాదం వల్ల మనకేం ఇబ్బందులు లేవుకదా అని వీరిని ఉపేక్షిస్తే, ఈ మతోన్మాద విషసర్పం స్వపక్షీయుల్ని కూడా కాటేయడానికి ఎంతో కాలం పట్టదు. దీనికి చక్కని ఉదాహరణ మన పొరుగునే ఉన్న పాకిస్తాన్.అక్కడ ఎప్పుడు, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. చంపేదీ,చచ్చేదీ అందరూ ఒక మతస్థులే. ఇన్నాల్లూ భారత్,ఆఫ్గనిస్తాన్ లాంటి పొరుగుదేశాల్ని లక్ష్యంగా చేసుకున్న తమ దేశమతోన్మాదుల్ని ఉపేక్షించిన ఫలితాన్ని వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందుకే మతోన్మాదం, ఎక్కడ ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించవలసిందే, వారికి వంత పాడే వ్యక్తుల్ని, పార్టీల్ని దూరంగా ఉంచవలసిందే. అట్లే ముస్లింలు కూడా తామేదో ఓ ప్రత్యేక వర్గమని భావిస్తూ, అస్తమానం స్వర్గ సుఖాలగురించే ఆలోచించకుండా, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని, అందరిలో కలిసిపోయి, అందరినీ కలుపుకుని పోవలసిన అవసరం చాలా ఉంది. సర్వేజనాసుఖినోభవంతు.

Saturday, January 21, 2012

లోకాయుక్త పై సుప్రీం కి మోడీ: అసలు లక్ష్యం వేరే!!!


లోకాయుక్త – రాష్ట్ర పరిథిలో ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ శాఖల కార్యకలాపాలపై డేగ కన్నేసి ఉంచి అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించే ఓ రాజ్యాంగ బద్ధ పదవి. సహజంగా లోకాయుక్తలుగా రిటైర్డ్ న్యాయమూర్తుల్నే నియమిస్తారు. వారు అప్పటికే రిటైరైపోయి ఉంటారు కాబట్టి, పెద్దగా రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి పోకుండా ఏదో తూతూ మంత్రంగా అవినీతిపై సాంవత్సరిక రిపోర్టులు సమర్పించేసి మమ అనిపిస్తుంటారు.  కానీ నిజాయితీ నిబద్ధత, అవినీతి భరతం పట్టాలనే కసి ఉన్న వ్యక్తి లోకాయుక్త గా నియమించబడితే దాని ప్రభావం ఎంతగా ఉంటుంది అనేదానికి, ఇటీవలే కర్ణాటక లోకాయుక్తగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే ఓ చక్కని ఉదాహరణ. అవినీతి వ్యవహారంలో ఇతను సమర్పించిన పరిశోధనాత్మక రిపోర్టులే యెడ్యూరప్పను పదవీచ్యుతున్ని చేశాయి.

ఇక గుజరాత్ విషయానికి వస్తే,  మన మోడీ ఎంతైనా మహా తెలివి పరుడుకదా,  యెడ్యూరప్పకి వచ్చిన సమస్య లాంటిదాన్ని ముందే ఊహించి, ఎందుకొచ్చిన గొడవ అనుకున్నడేమో కానీ..  గుజరాత్లో 2002లో ఖాలీ అయిన లోకాయుక్త స్థానాన్ని తిరిగి భర్తీ చేయకుండా ఇప్పటి వరకూ అలాగే ఉంచేశాడు. ఇటీవల గుజరాత్ గవర్నర్ గా నియమితులైన కమలా బెనివాల్  లోకాయుక్త పదవిని భర్తీ  చేయడానికి తగిన వ్యక్తిని సూచించవలసిందిగా గుజరాత్ హైకోర్టుని పురమాయించింది. అందుబాటులో ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తులనుండి ఒకరిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసి, రాష్ట్రప్రభుత్వ సలహా కోసం పంపారు. మన మోడీ గారు, ఆ న్యాయమూర్తిని కాదని తనకి అనుకూలంగా ఉన్న మరో న్యాయమూర్తి పేరును సూచిస్తూ  ప్రధాన  న్యాయమూర్తి ప్రతిపాదనని పునహ్ పరిశీలించ వలసిందిగా కోరారు.  HCJ  మల్లీ అదే పేరును పంపడం, మోడీ మల్లీ తిరస్కరించడం జరిగిపోయాయి. విషయం ఇలా నానుతుండగానే, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో సంబంధం లేకుండా HCJ చెప్పిన వ్యక్తిని  లోకాయుక్తాగా నియమించాలని గవర్నర్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. వెంటనే అలెర్ట్ ఐన మన మోడీ,  లోకాయుక్తని నియమించే అధికారం గవర్నర్ కి లేకుండా చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయాలనే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చాడు. ఆదే రోజు  HCJ  ప్రతిపాదించిన వ్యక్తిని లోకాయుక్తాగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా గవర్నర్ చేసిన ఈ నియామకం చెల్లదని మోడీ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. మొదట ఇద్దరు జడ్జిలు గల కమిటీ దీనిని విచారించి, ఒక జడ్జి గవర్నర్ నిర్నయాన్ని సమర్థించగా, మరో జడ్జి గవర్నర్ కి ఆ అధికారం లేదని పరస్పర విరుద్ధ తీర్పు లిచ్చారు. ఇలాంటి పరిస్తితుల్లో మూడో జడ్జి నిర్ణయం అవసరం కాబట్టి,  HCJ దీనిని పరిశీలించి గవర్నర్ కి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఫైగా  HCJ  సూచించిన వ్యక్తిని  లోకాయుక్తగా నియమించకుండా ఇలా ‘మినీ రాజ్యాంగ సంక్షోభం’ సృష్టించడానికి ప్రయత్నించాడని మొడీని తీవ్రంగా దుయ్యబట్టారు.  


మరో రాష్ట్ర CM ఐతే , ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి,లోకాయుక్తగా కోర్టు చెప్పిన వారిని నియమించి సైలెంటైపోయేవారు. కానీ మన మోడీ తేడా కదా.. పైగా కోర్టులతో తిట్టించుకోవడమంటే మహా  సరదా.. కాబట్టి  హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెల్లాడు.  ఇక్కడ సుప్రీం  కోర్టు  తీర్పు , దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.


కేస్ 1:  హైకోర్టు వాదనతో వ్యతిరేకిస్తే..

ఇది మోడీ కి గొప్ప శుభవార్తే అవుతుంది. సుప్రీం కోర్టు ఆరు కోట్ల గుజరాతీయుల్ని బలపరచింది అని,"ఆరు కోట్ల గుజరాతీల తరుపున సుప్రీం కోర్టుకి ధన్యవాదాలు" అనీ   మోడీ అలవాటైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు.  ఆపైన తనకు కావలసిన  వారిని లోకాయుక్తగా నియమించుకుని, తనకు కావలసిన విధంగా అతని నుండి రిపోర్టులు రాయించుకుంటూ.. గుజరాత్ వెలిగి పోతుందని చాటింపు వేయించుకోవచ్చు.కానీ తీర్పు ఇలా రావడానికి అవకాశం చాలా తక్కువ.


కేస్2: హైకోర్టు వాదనతో ఏకీభవిస్తే.. 

‘మోడీకి మరో ఎదురు దెబ్బ’అని పత్రికలు వార్తలు రాసుకుంటాయి. మోడీకి ఇదీ అలవాటే కాబట్టి దులిపేసుకుని లైట్  తీసుకుంటాడు. లోకాయుక్తగా HCJ చెప్పిన వ్యక్తిని  అంగీకరించడం మినహా మరో గత్యంతరం ఉండదు.కాకపోతే.. లోకాయుక్త మాకు వ్యతిరేకంగా రిపోర్టులు ఇస్తాడేమోననే సందేహాన్ని సుప్రీం కోర్టు సాక్షిగా వ్యక్తపరచే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ కొత్త లోకాయుక్త గత  10ఏళ్ళ కాలంలోని స్కాములు ఏవైనా వెలికి తీస్తే.. మన మోడీ గారు మరియూ వారి భజనపరులైన అరున్ జైట్లీ లాంటి వారు.. ఏమాత్రం  కంగారు పడకుండా.. T.V గొట్టాలముందుకు వచ్చి, లోకాయుక్త కాంగ్రెసు మనిషని,  సోనియా గాంధీ దగ్గరుండి ఆ రిపోర్టు రాయించారనీ..అందుకే తాము ముందు నుండీ   లోకాయుక్త నియామకాన్నివ్యతిరేకిస్తున్నామనీ.. తాము భయపడిందే జరిగిందనీ..పైపెచ్చు.. కేంద్రంలోని సోనియా గాంధీ ఈ విధంగా 6 కోట్ల గుజరాత్ ప్రజల్ని అవమానిస్తున్నారని, దానినుండి కూడా ఓట్లు రాబట్టడానికి ప్రయత్నించవచ్చు.


ఈ రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. దానిని అనుకూలంగా మార్చుకునే చావు తెలివితేటలు మోడీకి చాలానే ఉన్నాయి.ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిసి కూడా సుప్రీంకోర్టు గడప తొక్కడంలో ఆంతర్యం అదే.. 


ఇక ఈ మొత్తం వ్యవహారంతో మరో సారి స్పష్టంగా నిరూపితమైంది ఏదైనా ఉందంటే అది, 'అవినీతి పై అన్నాకు మద్ధతు' పేరుతో BJP సాగిస్తున్న కపట నాటకం. ఒక వైపు కేంద్రంలో బలమైన లోక్ పాల్ ని తేవాలని అన్నాతో కలిసి ఆందోళనలు చేస్తూ మరో వైపు తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లోకాయుక్తని గత 10ఏళ్ళుగా నియమించలేదంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి..?  

Wednesday, January 11, 2012

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )

The Hindu : News / National : Pakistani flag hoisting was a Hindutva plot to foment strife, police say

హిందూ పత్రికలో ఈ రోజు వచ్చిన పై వార్తను చదవండి.
వారికి బాగా అలవాటైన, 'విభజించు పాలించు ' అనే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ సారి కాలం కలిసివచ్చినట్లు లేదు. తీరా వీరి కుటిల బుద్ధి బహిర్గతమయ్యాక నేరం మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకుంటున్నారు. శ్రీ రాంసేన, భజరంగ్ దల్, RSS.... పేర్లు వేరైనా అందరి వ్యూహం ఒకటే. మైనారిటీలను మెజారిటీ మతస్తుల నుండి వేరు చేయడం, మైనారిటీలను వారికి బూచిగా చూపి, హిందువులను ఉద్ధరించేది తామేనని నమ్మబలికి వారి ఓట్లను కొల్లగొట్టడం. ఇదే వీరి అజెండా.. బ్రిటీష్ వాడినుంచి నేర్చుకున్న ఈ సూత్రాన్ని ఇప్పటిదాకా అనేకసార్లు విజయవంతంగా అమలుపరిచారు. కాకపోతే ఈసారి కాలం కలిసి వచ్చినట్లు లేదు పాపం..

సానియా మీర్జా పొట్టి గౌను పై, ఊరూ పేరూ లేని ఓ మారుమూల గ్రామం లోని ముసలి ముల్లా ఎవరైనా ఫత్వా జారీ చేస్తే.. అలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రచురించే మన తెలుగు మీడియా.. మన రాష్ట్రం పక్కనే జరిగిన పై సంఘటన గురించి మాత్రం రాయలేదు. బహుశా మన పాఠకులకు ఇలాంటివి నచ్చవనుకున్నారు కాబోలు. మన తెలుగు మీడియా ఇలాంటి ధోరనిని చూపడం ఇది మొదటిసారి కాదు.
సుమారు రెండేల్ల క్రితం, కర్నాటకలో ఓ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయితో లేచిపోయిన సంఘటన ఇలాగే మతం రంగు పులుముకొని వివాదాస్పదం అయింది. 'లవ్ జీహాద్ ' పేరుతో ముస్లిం లందరూ కూడబలుక్కొని హిందూ అమ్మాయిల్ని లేవదీసుకు పోయే కార్యక్రమం పెద్ద యెత్తున చేస్తున్నారని, కాబట్టి ముస్లింలను దూరంగా ఉంచాలని శ్రీ రాం సేన, RSS లాంటి సంస్థలు నానా రాద్ధాంతం చేశాయి. పైదా దానికి ఆధారాలంటూ వివిధ 'లేచిపోయిన' లెక్కల్ని కూడా చూపించేవి. దీనిని అప్పట్లో 'ఈనాడు' పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. వారి కాకి లెక్కల్తో సహా. ఈ వివాదంపై  స్పందించిన కర్నాటక ప్రభుత్వం(BJP), హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణా సంఘాన్ని వేసింది. సుమారు 2 నెలల విచారన అనంతరం 'లవ్ జీహాద్ ' అనేది ఒట్టి పుకారేననీ, ఆ లెక్కలన్నీ కాకి లెక్కలేననీ తేలింది. కానీ విచారణా సంఘం ఫలితాన్ని మాత్రం మన 'ఈనాడు' ప్రచురించలేదు. ఐనా నిరంతరం ఏదో ఒక పార్టీ కొమ్ముకాస్తూ వార్తల్ని రాసే మన పత్రికల నుండి ఇలాంటి విలువల్ని ఆశించడం అత్యాశేనేమో. కాకపోతే.. ఇలాంటి అసత్యాల్ని, అర్థ సత్యాల్ని మాత్రమే చదివి, తమకు మొత్తం తెలుసనుకొని ఫీలైపోయి, మనసు నిండా విద్వేషం నింపుకొని, పైన పేర్కొన్న సంస్థల్ని నికార్సైన దేశభక్త సంస్థలుగా భావిస్తూ, తమను మించిన దేశభక్తులు లేరనే భ్రమల్లో బతుకుతూ.. తమకు నచ్చని విషయాల్ని రాసే వారందరినీ ద్వేశించడమే పనిగా పెట్టుకున్న కొందరు దారి తప్పిన యువకులు కాస్త అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరం ఉంది..

ఇక అసలు ట్విస్టు ఏంటంటే.. 'మత పరమైన విభజన'కు ఆదినుండి ఆజ్యం పోసిందీ, దాని నుండి అత్యధిక లబ్ధి పొందిందీ BJP మరియా దాని అనుబంధ సంస్థలే.. కానీ మైనారిటీలకు మేలు చేసే రిజర్వేషన్లు, మత హింసా బిల్లు లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడల్లా.. వీరు చేసే మొదటి ఆరోపణ- ఇవి 'మత పరమైన విభజనకు దారితీస్తాయట, కాబట్టి వీరు వాటిని సమర్థించరట.. మంచి జోక్ కదూ..

Monday, December 26, 2011

M.F.హుస్సేన్-తస్లీమా నస్రీన్ : మతం- రాజకీయం

M.F హుస్సేన్ అనగానే వివాదాలు గుర్తుకొస్తాయి. హుస్సేన్ గీసిన అనేక రకాల పైంటింగ్స్ లో బూతు బొమ్మల కింద వివాదాస్పద మైనవి కొన్ని మాత్రమే. అతను గీసినవన్నీ  దేవతల బూతు బొమ్మలే కావు, కేవలం వాటితోనే అతను పాపులర్ పైంటరూ కాలేదు. 
1996లో 'విచార్ మీమాంస ' అనే హిందీ పత్రిక, హుస్సేన్ గీసిన కొన్ని చిత్రాలను ప్రచురించి అతను హిందూ దేవతల్ని అవమానిస్తున్నాడని తీర్మానించడంతో వివాదం మొదలైంది. అప్పటి దాకా దేశంలో గొప్ప పైంటర్లలో ఒకడిగా వెల్గొందుతున్న హుస్సేన్, రాత్రికి రాత్రి హిందూ ద్వేషిగా ముద్ర వేయబడ్డాడు. శివసేన, భజరంగ్ దల్ లాంటి సంస్థలు  హుస్సేన్ ఇంటి మీద దాడిచేయడం, అతని ఆర్ట్ గ్యాలరీల్ని ధ్వంసం చేయడం లాంటివి చేయడంలో పోటీలు పడ్డాయి. ఈ బొమ్మలు గీసింది ఏ రమేశో, సురేశో ఐతే పరిస్తితి ఎలా ఉండేదో గానీ, 'హుస్సేన్ ' అనే పేరు కావడంతో ఇక ఎవరికీ అతను హిందూ దేవతల్ని అవమానిస్తూనే  గీశాడా లేదా అని  అణుమానించాల్సిన అవసరం  కనపల్లేదు. హుస్సేన్ మీద దేశంలోని అనేక కోర్టుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. దేశంలో అతని ప్రదర్శనల్ని ప్రతిసారీ ఆందోళనకారులు అడ్డుకోవడం జరిగింది. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన హుస్సేన్ దేశం వదిలి పారిపోయి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.
       
నిజానికి ఆ పత్రిక ప్రచురించిన హుస్సేన్ చిత్రాలు అతను 1970లో గీసినవి. 1970 నుండి, 1996లో ఓ పత్రిక ప్రచురించే వరకూ, ఈ 26 ఏళ్ళ కాలంలో  ఏ హిందువూ వాటిని చూడలేదా..? హుస్సేన్ ఆ చిత్రాల్ని ముస్లింలో, క్రిష్టియన్లో చూసి ఆనందించాలని రహస్యంగా గీశాడా..? వాటిని కేవలం అరబ్ దేశాల్లోనో, క్రిష్టియన్ దేశాల్లోనో ప్రదర్శనకి పెట్టాడా..?
హుస్సేన్ గీసిన ఈ చిత్రాలు ఆ 26 ఏళ్ళలో బారతడేశంలోనే, అనేక ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించబడ్డాయి. అనేక మంది వీటిని చూసి హుస్సేన్ ప్రతిభని కొనియాడారు. ఈ అనేక మందిలో, చిత్రకారులు, చిత్ర లేఖనం పట్ల ఆసక్తి కలవారు ఉంటారు. వీరిలో కూడా అత్యధికులు హిందువులే ఉంటారనేదాంట్లో సందేహం లేదు. పాపం వీరెవరూ ఆ చిత్రాల్లోని బూతుని కనిపెట్టలేక పోయారు, ఓ పత్రిక చెప్పేదాకా.. 


ఇక మరో వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన పుస్తకం 'లజ్జ ' లో ఇస్లాంకి వ్యతిరేకంగా రాసిందనే అభియోగం మీద అక్కడి మత సంస్థలు తస్లీమా తలకి వెలకట్టడంతో ఆమె బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి భారత దేశంలో తలదాచుకుంటుంది.
 హుస్సేన్, తస్లీమలను చూసే కోణాన్ని బట్టి దేశంలోని వివిధ వర్గాల/సంస్థల రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు.
హుస్సేన్ పై దాడులను సమర్థిస్తూ, అతన్ని దేశం నుండి తరిమి వేయడాన్ని తమ విజయంగా భావించే శివసేన, భజరంగ్ దల్, VHP లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ పై విమర్శల్ని మాత్రం మత మౌఢ్యంగా భావిస్తాయి. అట్లే ఆమెను  భారత దేశంలో  ఉంచుకోవడం గొప్ప మానవతా విషయంగా అభివర్ణిస్తాయి.  అదే సమయంలో హుస్సేన్ ని దేశం నుండి వెల్లగొట్టడాన్ని ఆటవిక చర్యగా భావించే MIM లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ ను మాత్రం భారత దేశం నుండి గెంటివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  


ఈ రెండు వివాదాల్లో అసలు కీలకాంశం ' మత విషయాల్లో కళాకారుల స్వేచ్చకు పరిమితులేమిటి, చట్టాలు, కోర్టులు ఇలాంటి విషయాల్లో ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చు' అనేది. నిజానికి ఇదేమంత క్లిష్టమైన విషయం కాదు. కాకపోతే ఇలాంటి వాటికి పరిష్కారాల్ని వెతికేటప్పుడు, మన మతం, అవతలి మతం అంటూ గిరి గీసుకుని ఆలోచించినంత కాలం విభిన్న మతాలు కల మన భారత దేశంలాంటి చోట్ల , వీటికి పరిష్కారాలు దొరకటం కష్టమే. పైగా 'ఎద్దు పుండు కాకికి ముద్దు' అన్నట్లు ఇలాంటి వాటిలో తల దూర్చి తమ రాజకీయ ప్రయోజనాల్ని నేరవేర్చుకోవడానికి ప్రయత్నించే రాబందులు ఉండనే ఉన్నాయి.. అన్ని చోట్లా, అన్ని వైపులా.. 

ఇలాంటి రాబందులకి లొంగకుండా ప్రజలు ఎంత మెచ్యూర్ గా ఆలోచించగల్గుతున్నారు అనే దాని మీదనే ఆ దేశ/సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే రవీంద్రుడు చెప్పినట్లు -  Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit...Into that heaven of freedom, my Father, let my country awake.. Aamen!!!  

Thursday, December 22, 2011

జస్టిస్ మార్కండేయ కట్జూ ఆలోచనాత్మక వ్యాసాలు.

మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ ఐన జస్టిస్ మార్కండేయ కట్జూ , భారతరత్న అవార్డు గురించి రాసిన ఆలోచనాత్మక  వ్యాసం ఇవాల్టి 'ది హిందూ'  లో ప్రచురితమైంది.

http://www.thehindu.com/opinion/op-ed/article2732614.ece 


జస్టిస్ కట్జూ 'కాలిదాస్-గాలిబ్ ఫౌండషన్' అనే సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ సామాజిక రాజకీయ  అంశాలపై లోతైన విశ్లేషణలతో రాసిన అనేక వ్యాసాలు-  http://www.kgfindia.com  అనే వెబ్ సైట్లో ఉన్నాయి. 

ఉదాహరణకి  భారత దేశంలో చరిత్ర బోధన గురించి  రాసిన వ్యాసం నుండి కొంత భాగం ఇలా ఉంది-


"1928లో, టిప్పుసుల్తాన్ గురించి నేను పరిశోధన చేస్తున్న టైంలో, ఒక విధ్యార్థి సమాఖ్యకు సంబంధించిన కొందరు తాము స్థాపించబోతున్న చరిత్ర సంబంధమైన ఒక సంఘ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. వారి దగ్గరున్న చరిత్ర పుస్తకంలో నుండి టిప్పుసుల్తాన్ గురించి రాసి ఉన్న ఒక వాక్యాన్ని చూసి దాదాపు నాకు కల్లు బైర్లు కమ్మినంత పనైంది. అది - "టిప్పుసుల్తాన్ 3 వేల మంచి బ్రాహ్మణుల్ని బలవంతంగా  ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించగా వారు ఆత్మహత్య చేసుకున్నారు అనేది" . ఆ టెక్స్ట్ బుక్ రాసింది మహామహోపాధ్యాయ హర్ ప్రసాద్ శాస్త్రి, కలకత్తా యూనివర్సిటీలో సంస్కృత శాఖాధిపతి. దేని ఆధారంగా ఆయన టిప్పుసుల్తాన్ గురించి ఈ వ్యాఖ్య చేశారో, దానిని నిరూపించే చారిత్రక ఆధారాలేమైనా ఉంటే తెలియజేయండని నేను వెంటనే శాస్త్రి గారికి రాయడం జరిగింది. ఇలా అనేక సార్లు అడగిన తర్వాత- మైసూరు గెజిట్ నుండి తీసుకున్నానని ఆయన నుంచి ప్రత్యుత్తరం వచ్చింది.   మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీకాంతియా ని ఈ విషయమై సంప్రదిస్తే, మైసూర్ గెజిట్లో ఏనాడు బ్రాహ్మణుల ఆత్మహత్యల గురించి రాలేదనీ, పైగా, విద్యార్థి దశలో మైసూరు చరిత్ర మీద తాను పరిశోధన చేశాననీ, ఇలాంటి సంఘటన ఏదీ మైసూర్లో జరగలేదని తాను కశ్చితంగా చెప్పగలననీ అన్నారు.   ఇంకా టిప్పుసుల్తాన్ ప్రధానమంత్రి-పునియా మరియూ సర్వ సైన్యాధిపతి- క్రిష్ణారావు ఇద్దరూ బ్రామ్హణులేననీ చెప్తూ, అప్పట్లో టిప్పుసుల్తాన్ 156 దేవాలయాలకు ప్రతి సంవత్సరం భరణం చెల్లించే వాడనీ ఆ దేవాలయాల లిస్టూ అట్లే శ్రింగేరి మఠాధిపతి జగద్గురు శంకరాచార్య గారితో టిప్పుసుల్తాన్ ఆత్మీయ సంబంధాన్ని తెలిపే ఉత్తరప్రత్యుత్తరాలకి  సంబంధించిన సుమారు 30 ఫోటో కాపీలను కూడా పంపించాడు.  
చరిత్రను వక్రీకరిస్తూ శాస్త్రి గారు రాసిన పుస్తకం అప్పటికే  బెంగాల్, ఒరిస్సా, యు.పి, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పాఠ్యాంశంగా బోదించబడుతుంది. అప్పటి కలకత్తా యూనివర్సిటీ VC-శ్రీ అశుతోశ్ ముఖర్జీ   గారికి, శాస్త్రి గారితో, మైసూర్ యూనివర్సిటీ VC -బ్రిజేంద్ర నాధ్ శీల్ గారితో, మరియూ ప్రొఫెసర్ శ్రీకాంతియా గారితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ ఇతర అధారాలనూ పంపించి అసత్యాలను ప్రాచుర్యంలోకి తెస్తున్న వారిపై చర్య తీసుకోవలసిందిగా కోరడం జరిగింది. అశుతోశ్ ముఖర్జీ గారు వెంటనే స్పందించి శాస్త్రి రాసిన పుస్తకాలన్నింటినీ పాఠ్యాంశాలనుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.  కానీ బాధాకరమైన విషయమేమంటే - విద్యార్థుల మనసుల్లో విద్వేషాల్ని నింపే  ఇలాంటి కట్టుకథలు ఇంకా అనేక పాఠ్యపుస్తకాలలో ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు."

భారత దేశం మీదికి దండెత్తి వచ్చిన తొలితరం ముస్లిం పాలకులైన ఘజనీ, ఘోరీ లాంటి కొందరు హిందూ దేవాలయాలను కూలగొట్టిన మాట వాస్తవమేననీ, కానీ ఆ తర్వాత ఇక్కడ రాజ్యస్థాపన చేసిన అనేక మంది ముస్లిం రాజులు హిందువులతో సఖ్యతను కొనసాగిస్తూ వారి సంస్కృతినీ, దేవాలయాలనూ పరిరక్షించారనీ, కానీ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నంత కాలం వారి మీద ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదని గ్రహించిన బ్రిటీష్ వారు, తమ 'విభజించి పాలించు' పధకంలో భాగంగా చరిత్ర వక్రీకరణకి పూనుకున్నారనీ వివరిస్తూ, వివిధ బ్రిటీష్ అధికారుల మధ్య ఈ విషయం గురించి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్ని ఆధారాల్తో సహా జస్టిస్ కట్జూ గారు వివరించడం జరిగింది.  
ఆసక్తి ఉన్న వారు పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదువుకోవచ్చు. - 

http://www.kgfindia.com/kalidas-ghalib.php